బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 15మంది ఆత్మహత్యలు చేసుకున్నారు..!
బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు ఎవరు, ప్రమోటర్లు ఎవరు, వీటిని ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారు వంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.;
బెట్టింగ్ యాప్స్.. ప్రస్తుతం తెలంగాణను షేక్ చేస్తున్న అంశంపై. యువతను తప్పుదోవ పట్టించే ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, నటీనటులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని విచారిస్తున్నారు. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌లకు బలైన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఏడాది కాలంలోనే తెలంగాణలో 15 మంది బెట్టింగ్‌ల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ కేసులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రోజురోజుకు బెట్టింగ్‌కు బానిసలవుతున్న యువత సంఖ్య పెరుగుతుండటంతోనే వీటిని ప్రమోట్ చేస్తున్నవారిపై కొరడా ఝులిపిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
బెట్టింగ్ యాప్ అంశంపై ఫోకస్ పెట్టిన పోలీసులు రాష్ట్రంలో వీటి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. వారు చెప్పిన దాని ప్రకారం గతేడాదిలో 15 మంది యువత బెట్టింగ్ ఊబిలో కూరుకుని, భారీ మొత్తంలో అప్పులు చేశారని, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యలకు బెట్టింగ్‌లే కారణమని ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారు ఏ బెట్టింగ్ యాప్‌లను వినియోగించారు అనే అంశాలను కూడా కనుగొనే పనిలో పడినట్లు పోలీసులు వివరించారు. వాటి నిర్వాహకులు ఎవరు, ప్రమోటర్లు ఎవరు, ఎక్కడి నుంచి ఆ యాప్‌లను నిర్వహిస్తున్నారు వంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.