పిల్లల అభ్యాసానికి కొత్త ఊపు,ఖమ్మం విద్యా విప్లవం
సరికొత్త బోధన విధానంతో ఖమ్మం జిల్లా దేశానికి ఆదర్శం
By : Saleem Shaik
Update: 2025-11-28 10:27 GMT
ప్రాథమిక విద్యా నాణ్యతను కొత్త దశకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రవేశపెట్టిన “చదవండి–అర్థం చేసుకోండి–ప్రగతి సాధించండి” కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల అభ్యాసానికి కొత్త ఊపు నింపుతోంది. సంప్రదాయ పద్ధతులను మార్చి, విద్యార్థి-కేంద్రీకృత బోధనకు దారితీసిన ఈ చొరవ, ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే వినూత్న విద్యా మోడల్‌గా నిలబెడుతోంది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వతరగతి విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాన్ని పెంచేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. “చదవండి-అర్థం చేసుకోండి-ప్రగతి సాధించండి” పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కలెక్టరు అమలు చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలోని 958 ప్రభుత్వ పాఠశాలల్లో 28,982 మంది విద్యార్థుల పఠన గ్రహణశక్తి, ప్రాథమిక అభ్యాసంలో అంతరాలను గుర్తించి వారి అభ్యాసాన్ని పెంపొందించారు.
జిల్లా కలెక్టర్ పాఠశాలల తనిఖీలు
ప్రాథమిక విద్యార్థుల విద్యా నైపుణ్యాన్ని ఈ పథకం కింద కలెక్టర్ పాఠశాలలను తనిఖీలు చేస్తూ ఈ వినూత్న విద్యా విధానంలో విద్యార్థులకు బోధన జరిగేలా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం చేశారు. పిల్లలకు కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా వారి అభ్యాసాన్ని మెరుగుపర్చారు. కలెక్టరు చొరవ వల్ల తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారని తల్లాడకు చెందిన ఎం శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తెలంగాణ భవిష్యత్తుకు ఒక నమూనా
“చదవండి-అర్థం చేసుకోండి-ప్రగతి చెందండి ” కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యాస స్థాయిలను మెరుగుపర్చారు. విద్యాపరమైన ఆసక్తిని పెంపొందించే సంస్కృతిని పాఠశాలల్లో రేకెత్తించింది.కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ, మద్దతుతో ఈ విద్యా బోధనా విధానం ఖమ్మం మోడల్ గా పేరొందింది. ఇప్పుడు తెలంగాణ అంతటా ప్రాథమిక విద్యకు ఉత్తమ-అభ్యాస కార్యక్రమంగా అభివృద్ధి చెందుతోంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మెరుగ్గా విద్యాబుద్ధులు చెప్పేందుకు వీలుగా కలెక్టరు ప్రవేశపెట్టిన ఖమ్మం బోధనా విధానం ఉపయోగపడుతుందని బోనకల్ మండల టీచర్ ఎ వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఖమ్మంమోడల్ విద్యా విధానం 'చదవడం-అర్థం చేసుకోవడం-ప్రగతి' చొరవ పునాది అభ్యాసంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.ఖమ్మం జిల్లా కలెక్టర్ వినూత్న అభ్యాస మెరుగుదల కార్యక్రమం ఒక అద్భుతమైన విజయగాథగా మారింది. అక్షరాస్యత అంతరాలను పరిష్కరించడమే లక్ష్యంగా చేసుకున్న ఈ విద్యా విధానానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యా నిపుణుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ప్రాథమిక విద్యను మూలాల నుంచి బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రారంభమైన “చదవండి–అర్థం చేసుకోండి–ప్రగతి సాధించండి” కార్యక్రమం ఖమ్మం జిల్లాలో విద్యా రంగానికి కొత్త ఊపిరి పోసింది.పిల్లలు మెరుగైన భవిష్యత్తుకు దారితీసే ఈ మార్పు, ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా ప్రేరణగా నిలపనుందనడం అతిశయోక్తి కాదు.