విచిత్రమైన క్రైం కథ, రివాల్వార్ కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు

ఎస్ఐ పారేసుకున్నట్లు చెబుతున్న రివాల్వార్ కోసం వేట మొదలుపెట్టడం అంటే మామూలు విషయంకాదు

Update: 2025-11-28 07:01 GMT
Amberpet SI Bhanuprakash Reddy

దొంగతనం జరిగిన నగలు లేదా మరేదైనా సొత్తుకోసం పోలీసులు గాలించటం అందరికీ తెలిసిందే. కాని ఒక రివాల్వార్ కోసం వెదకటం ఆశ్చర్యంగానే ఉంది. అదికూడా ఎస్ఐ పారేసుకున్నట్లు చెబుతున్న రివాల్వార్ కోసం వేట మొదలుపెట్టడం అంటే మామూలు విషయంకాదు. ఆ రివాల్వార్ సంఘవిద్రోహుల చేతిలోపడితే ఇంకేమన్నా ఉందా ? ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట పోలీసుస్టేషన్లో క్రైం ఎస్ఐగా భానుప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఎస్ఐగా ఉంటూనే మరింత ఉన్నతోద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నాడు. ఉద్యోగంలో ఎదగాలన్నఆలోచన చాలామంచిదే అనటంలో సందేహంలేదు.

పెద్ద ఉద్యోగం సంపాదించాలన్న ఆలోచనతో తరచు ఏపీ ప్రభుత్వం నిర్వహించే వివిధ గ్రూపు పరీక్షలు రాస్తున్నాడు. అందుకని తరచూ విజయవాడకు వెళ్ళి ప్రిపేర్ అవుతు, పరీక్షలు రాస్తున్నాడు. ఇందులో భాగంగానే మేనెలలో రెండు మాసాలు సెలవుపెట్టాడు. బెజవాడకు వెళ్ళి అనేక పరీక్షలురాశాడు. సమస్య ఎక్కడ వచ్చిందంటే పరీక్షలకు వెళ్ళినపుడు బసచేసిన లాడ్జీలో ఎస్ఐ తన బ్యాగును మరచిపోయి తిరిగి హైదరాబాదుకు వచ్చేశాడు. వచ్చి ఉద్యోగంలో చేరిన నాలుగురోజులకు తన సర్వీసురివాల్వార్ మిస్సయిన విషయాన్ని రెడ్డి గమనించాడు. ఏమిచేయాలో బాగా ఆలోచించి వెంటనే విజయవాడలోని లాడ్జీకి వెళ్ళి విచారించాడు. తాను స్టేచేసిన గదిని తెరిపించి గాలించినా ఉపయోగం కనబడలేదు. లాడ్జీ యాజమాన్యంతో, లాడ్జీ బాయ్స్ తో మాట్లాడినా లాభంలేకపోయింది.

ఏమిచేయలేక తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఉన్నతాధికారులకు చెబితే ఉద్యోగానికే ఎసరు వచ్చేస్తుందని భయపడ్డాడు. అలాగే రివాల్వార్ పోయిందని విజయవాడలో ఫిర్యాదుచేసినా పెద్దసమస్య అవుతుందని తెలుసు. అందుకని పెద్ద ప్లాన్ వేశాడు. ఇంతలో మొన్న 12వ తేదీన స్టేషన్లోని ఆయుధాల ఆడిటింగ్ జరిగింది. ఆఆడిటింగులో ఎస్ఐ రివాల్వార్ మిస్సయిన విషయాన్ని ఉన్నతాధాకారులు గుర్తించారు. రివాల్వార్ గురించి ప్రశ్నించినపుడు ఎస్ఐ పొంతనలేని కతలు చెప్పాడు. స్టేషన్లోనే ఎవరో తన రివాల్వార్ ను ఎత్తుకెళ్ళి ఉంటారని బుకాయించాడు. ఒక్కోసారి ఒక్కో కత చెప్పటంతో లాభంలేదని అర్ధమైన ఉన్నతాధికారులు ఎస్ఐను తమదైనపద్దతిలో విచారించినపుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఇంతకీ ఆవిషయాలు ఏమిటంటే అతగాడికున్న వ్యసనాల గురించి బయటపడ్డాయి. అతడికి బెట్టింగులో పాల్గొనే వ్యసనముంది. వివిధ బెట్టింగుల్లో పాల్గొన్న ఎస్ఐ సుమారు రు.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకోవటం కోసం గతంలోనే అతనిపై కొన్ని ఫిర్యాదులున్నాయి. ఒక కేసులో పోలీసులు రికవరీ చేసిన బంగారునగలను ఈ ఎస్ఐ ఉన్నతాధికారులకు తెలీకుండా స్టేషన్ నుండి తీసుకుని కుదవపెట్టిన చరిత్రుంది. అందుకనే తాజా విచారణలో తమదైన శైలిలో ఎస్ఐను విచారించారు. దాంతో తనరివాల్వార్ ను విజయవాడలోని లాడ్జీ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించాడు. పరీక్షలకు వెళ్ళినపుడు తన బ్యాగులో పుస్తకాలతో పాటు రివాల్వార్ ను కూడా బెజవాడకు తీసుకెళ్ళినట్లు అంగీకరించాడు. రివాల్వార్ కోసం విజయవాడలోని లాడ్జీకి వెళ్ళి బాయ్స్ తో పాటు యాజమానిని కూడా విచారించిన విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారులకు చెప్పేశాడు.

దాంతో ఎస్ఐ పోగొట్టుకున్న రివాల్వార్ కోసం ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటుచేసి విజయవాడకు పంపారు. రివాల్వార్ కోసం పోలీసులు విజయవాడలో ప్రత్యేకంగా వేట మొదలుపెట్టారు. లాడ్జీ యాజమానితో పాటు బాయ్స్ ను విచారిస్తు, సీసీ కెమెర ఫుటేజీని పరిశీలించారు. రివాల్వార్ లో ఉండాల్సిన బుల్లెట్లు మాత్రం స్టేషన్లోని ఎస్ఐ సొరుగులోనే దొరకటంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగు వ్యసనంలో కూరుకుపోయిన ఎస్ఐ వివాహం సందర్భంగా వచ్చిన కట్న, కానుకలను ఖర్చు చేశాడు. అలాగే తల్లితో మాట్లాడి పొలాన్ని అమ్మించినపుడు వచ్చిన రు. 50 లక్షలతో కొంత అప్పుతీర్చినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇన్నిరకాలుగా అప్పులు తీర్చినా ఇంకా లక్షల రూపాయల అప్పులుండిపోయాయి. అందుకనే తన రివాల్వార్ ను ఎస్ఐ కుదవబెట్టాడా ? అన్న అనుమానం ఉన్నతాధికారులను పీడిస్తోంది. రివాల్వార్ కోసం బెజవాడకు వెళ్ళిన ప్రత్యేక బృందం తిరిగి వస్తే కాని ఏ విషయం తేలదు. చూద్దాం రివాల్వార్ వేటలో ప్రత్యేక బృందం ఏమిచేస్తుందో.

Tags:    

Similar News