వివాదాస్పదం అవుతున్న ఏకగ్రీవాలు..
పోటీలో ఒక్క అభ్యర్థి మాత్రమే ఉన్నప్పుడే దానిని ఏకగ్రీవంగా ప్రకటించాలి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకవైపు ఏకగ్రీవాలను అంగీకరించడమని, ఎన్నిక జరగాల్సిందేనని ఎన్నికల సంఘం చెప్తుంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమకు పోటీ ఉండకూదన్న ఉద్దేశంతో బేరసారాలు చేస్తున్నారు. భారీ ఆఫర్లు చెప్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం భూమి ఇస్తామంటే మరో గ్రామంలో నగదు ఇస్తా అంటున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో అయితే భూమి, నగదు రెండూ ఇస్తానంటున్న అభ్యర్థులు కూడా కొందరు ఉన్నారు. తొలివిడతలోనే దాదాపు 6-7 గ్రామాల్లో ఏకగ్రీవాలు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా పలు చోట్ల భారీ ఆఫర్లు కూడా పెడుతున్నారు. దీంతో ఏకగ్రీవాల విషయం వివాదాస్పదంగా మారుతోంది. ఏకగ్రీవాలను సహించేది లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన.. వీటి కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమాత్రం తగ్గడం లేదు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే దాదాపు 7 పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఖరారు అయినట్లు సమాచారం. ఇవి మరింత పెరుగుతుండటంతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దని స్పష్టం చేసింది.
ఏకగ్రీవాలపై ఇప్పటికే ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. వేలం పాట ద్వారా కూడా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం పోటీలో ఒక్క అభ్యర్థి మాత్రమే ఉన్నప్పుడే దానిని ఏకగ్రీవంగా ప్రకటించాలి. కాగా ఏకగ్రీవం కోసం గ్రామస్తులను ప్రలోభపెట్టడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం, బెదిరించడం, మోసం చేయడం వంటివి ఎవరూ చేయకుండా చూసుకోవాలని చట్టం సూచించింది. అటువంటి ఏకగ్రీవాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్న వేళ.. వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. అటువంటి ఏకగ్రీవ ప్రయత్నాలు ఎవరి దృష్టికి వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని, లిఖితపూర్వకంగా, వాట్సాప్, మౌఖికంగా, వాట్సాప్, వార్త పత్రికల క్లిపింగ్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని ఈసీ స్పష్టం చేసింది.
ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా, వాటిని జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించి, నిజమని తేలితే ఎలాంటి ఫలితాలు ప్రకటించకూడదని సూచించారు. ఫిర్యాదులు రాకపోవడంలొ, నామినేషన్లు స్వచ్ఛందంగా ఉపసంహరించిన అభ్యర్థుల నుండి స్వీయ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి. ఈ పత్రాలలో అభ్యర్థి స్వచ్ఛందంగా ఉపసంహరణ చేసినట్లు, ఎలాంటి బెదిరింపు, భయం, వేలంపాట, ఆర్థిక ప్రేరణకు గురికాలేదని స్పష్టంగా పేర్కోవాలి. అలాగే, ఒకే అభ్యర్థి మిగిలితే, ప్రత్యర్థి అభ్యర్థుల ఉపసంహరణ కోసం ధన బలం లేదా వేలంపాట ఉపయోగించలేదని కూడా ధృవీకరించాలి. తప్పుడు సమాచారాన్ని అందిస్తే, అభ్యర్థి ఎన్నిక రద్దు అవుతుంది.
ఒకవైపు ఎన్నికల సంఘం హెచ్చరికలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఏకగ్రీవాల జోరు మాత్రం తగ్గడం లేదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఆనుకొని ఉన్న జనరల్ పంచాయతీల్లో సర్పంచ్పదవులకు భారీ డిమాండ్ ఉంది.
గత ఎన్నికల్లో 1,935 ఏకగ్రీవాలు
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1,935 ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఇందిలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 162 ఏకగ్రీవాలు జరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ ఉన్నాయ్. అదే విధంగా ఈ ఏడాది కూడా భారీగా ఏకగ్రీవాలు పెరగొచ్చని, ఆశావాహులు ఊపు చూస్తుంటే.. గత ఎన్నికల నెంబర్‌ను అధిగమించినా ఆశ్చర్యం అక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.