ఈపని చేయిస్తే అమ్రపాలి గ్రేటే
కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నెలరోజుల్లోనే ఇంత పెద్ద భారాన్ని ఎత్తుకోవటం ఆశ్చర్యంగా ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా అమ్రపాలి చాలా పెద్ద భారాన్ని భుజన ఎత్తుకున్నారు. కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నెలరోజుల్లోనే ఇంత పెద్ద భారాన్ని ఎత్తుకోవటం ఆశ్చర్యంగా ఉంది. నగరంలో డ్రైనేజీలను క్లీన్ చేయించచ్చు. గతుకులు లేకుండా రోడ్లను వేయించచ్చు. రోడ్లపైన గుంతలుంటే వెంటనే పూడ్చచ్చు కూడా. మంచినీటిని కూడా సమయం ప్రకారం విడుదలచేయించి జనాలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవచ్చు. జనాలతో ముడిపడిన సమస్యల పరిష్కారంకు అమ్రపాలి ఎన్ని పనులైనా చేయచ్చు. పైన చెప్పిన పనులన్నీ ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగులు సహకరిస్తే అమ్రపాలి సక్సెస్ ఫుల్ కమీషనర్ గా అనిపించుకుంటారు. అయితే అంతటితో ఆగని కమీషనర్ తలకు మించిన భారాన్ని భుజానికెత్తుకున్నారు.
అదేమిటంటే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ను కచ్చితంగా సమయానికి ఆఫీసులకు రావాలని. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం స్టాఫ్ మొత్తం ఉదయం 10.30 గంటలకు ఆఫీసుకు వచ్చి సాయంత్రం 5 గంటలవరకు పనిచేయాలి. ఉదయం పదిగంటలకు అటెండెన్స్ రిజస్టర్ లో ప్రతి ఉద్యోగి సంతకం చేయాల్సిందే. అలాగే ఆఫీసు నుండి సాయంత్రం వెళ్ళేటప్పుడు 5 గంటలకు మళ్ళీ సంతకం చేయాల్సిందే. అమ్రపాలి లెక్క ప్రకారం ప్రతి ఉద్యోగి ఉదయం 10.30 గంటలకల్లా అటెండెన్స్ రిజస్టర్లో సంతకం చేసి కచ్చితంగా తమ సీట్లలో ఉండాల్సిందే. అలాగే సాయంత్రం 5 గంటల్లోపు ఆపీసునుండి బయటకు వెళ్ళేందుకు లేదు.
కమీషనర్ ప్రయత్నం చాలామంచిది. ఎందుకంటే సమస్యల కోసం ఆపీసుకు వచ్చే ప్రజలకు ఉద్యోగులు పరిష్కారం చూపాలన్నది ఆమె ఆలోచన. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగ పనిచేస్తారో అందరికీ తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలంటే జనాలకు అదృష్టం ఉండాలి. లేకపోతే ఉద్యోగులకు భయమన్నా ఉండాలి. జనాల అదృష్టం సంగతి పక్కనపెట్టేస్తే ఉద్యోగులకు భయం అన్నది లేదు. ఎందుకంటే ఉద్యోగభద్రత ఉన్నపుడు ఇక ఉద్యోగులకు భయం ఎందుకుంటుంది. ఏ ఉద్యోగిమీద ఏ విషయంలో అయినా ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే వెంటనే యూనియన్లు అడ్డుపడతాయి. సమ్మెలంటాయి, విధుల బహిష్కరణంటాయి. దాంతో ఉన్నతాధికారులు ఉద్యోగులమీద యాక్షన్ అంటేనే వెనక్కుతగ్గుతారు. ఎందుకంటే ఉద్యోగులు సమ్మెంటో ఇబ్బందులు పడేది జనాలే కాబట్టి. ఇలాంటి కారణాలతోనే ఉద్యోగులకు ఉన్నతాధికారులు భయపడతారు. దీన్ని అడ్డంపెట్టుకుని ఉదయం 10.30 గంటలకు ఆఫీసుకు రావాల్సిన ఉద్యోగుల్లో కొందరు తమిష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు.
తమిష్టం వచ్చినపుడు వచ్చి, ఇష్టం వచ్చినపుడు వెళిపోతుంటారు. ఇలాంటి ఉద్యోగులను దారికి తీసుకురావాలని గతంలో కమీషనర్లు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఆ పనిని ఇపుడు అమ్రపాలి నెత్తికెత్తుకున్నారు. ఉదయం 10.30 గంటల తర్వాత పది నిముషాలను కమీషనర్ గ్రేస్ పీరియడ్ గా చెప్పారు. అంటే ప్రతి ఉద్యోగి 10.40 గంటలకల్లా కచ్చితంగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాల్సిందే. 10.45 గంటలకు ప్రతి సెక్షన్లోని అటెండెన్స్ రిజిస్టర్ తన టేబుల్ మీదకు తీసుకొచ్చి పెట్టేయాలని ఆదేశాలు జారీచేశారు. 10.40 గంటలకు సంతకం చేయకపోతే ఉద్యోగికి ఆరోజు సీఎల్ కింద పరిగణిస్తామని అన్నీ సెక్షన్ల ఉద్యోగులకు స్పష్టంగా చెప్పేశారు.
గ్రేటర్ మున్సిపాలిటిలో సుమారు 12 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో పీల్డ్ స్టాఫ్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఫీల్డ్ స్టాఫ్ పనిగంటలు వేరేగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి 10.30 గంటలకు రావాలనే నిబంధన లేదు. వాళ్ళు కూడా రిజిస్టర్లో సంతకాలు చేయాల్సందే అయితే నిబంధనలు వేరేగా ఉంటాయి. అమ్రపాలి తీసుకొచ్చిన నిబంధనలు శుక్రవారం నుండే అమల్లోకి వచ్చేశాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే జీహెచ్ఎంసీ ఉద్యోగులతో టైముకు పనిచేయించుకోవటం మమూలు విషయం కాదు. ఉద్యోగులందరినీ 10.30 గంటలకల్లా ఆపీసుకు వచ్చేట్లు చేయగలిగితే, సమస్యల పరిష్కారంపై ఫీల్డ్ స్టాఫ్ ను యుద్ధప్రాతిపదికను పనిచేయించగలిగితే అమ్రపాలిని గ్రేట్ అనే చెప్పాలి. తన సర్వీసు మొత్తం ఇది అమ్రపాలికి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఈ ఒలంపిక్స్ లో మనదేశానికి బంగారు పతకం వస్తుందేమో కాని ప్రభుత్వ ఉద్యోగులను సమయానికి ఆపీసుకు వచ్చేట్లు చేయటం మాత్రం కష్టమే. కష్టమని తెలిసినా పెద్ద భారాన్ని అమ్రపాలి భుజానికి ఎత్తుకున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.