బిఆర్ఎస్ హాయంలోనే హైదరాబాద్ అభివృద్ది

జూబ్లిహిల్స్ పర్యటనలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

Update: 2025-10-26 13:33 GMT
KTR in Jubilee Hills campaign

బిఆర్ఎస్ హాయంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిందని మాజీమంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ అన్నారు. రెండేళ్లలోకాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అభివృద్దిని పక్కన పెట్టి బిఆర్ఎస్ పై నిందలు వేస్తోందని ఆరోపించారు. బిజెపికి బిటీం బిఆర్ఎస్ అని ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ బిజెపి పంచన ఎందుకు చేరిందని ఆయన ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెటిఆర్ మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డితో కల్సి ఆదివారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట డివిజన్ లో పర్యటించారు.

24 గంటల విద్యుత్ అందించాం

2014 ముందు హైదరాబాద్ లో ప్రతీ అపార్ట్ మెంట్ వద్ద జనరేటర్లు ఉండేవని , బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్ సరఫరా ఉందన్నారు. హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కెటిఆర్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఎప్పుడు కలిసి మెలిసి ఉండేవారని ఆయన గుర్తు చేశారు. బిఆర్ ఎస్ పాలనలో హిందువులకు దసరా సందర్బంగా బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ లో తోఫా , క్రిస్టియన్లకు గిప్ట్ లు ఇచ్చినట్టు కెటిఆర్ గుర్తు చేశారు. కెసీఆర్ హిందువుగా ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతీ మతాన్ని గౌరవించారన్నారు. కెసీఆర్ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించినప్పుడు మసీదు, దేవాలయం, చర్చి నిర్మించి సెక్యులర్ ప్రభుత్వం అని రుజువు చేసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కు చేసింది శూన్యమన్నారు.

బుల్ డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు

బిజెపి పాలిత రాష్ట్రాల్లో బుల్ డోజర్లు నడపటాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో బుల్ డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి సిబిఐ తొత్తు అని చెప్పే రాహుల్ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయమని కాంగ్రెస్ సిబిఐకి అప్పగించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక ముస్లిం వ్యక్తికి కూడా చట్ట సభల్లో ప్రాతినిద్యం కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి తలచుకుంటే ఒక ఎమ్మెల్సీ పదవి, ఒక మంత్రి పదవి ముస్లింకు ఇవ్వొచ్చు . కాని అలా చేయడం లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News