Bandi Sanjay | ‘హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది’
తన ఇంట్లో వర్కర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న బండి సంజయ్.;
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు చూపిన విషయాలు చూసి ఆశ్చర్యపోయానని బండి సంజయ్ చెప్పారు. అధికారులు చూపిన లిస్ట్‌లో తన పేరు, ఇతర నేతల పేర్లే కాదని, కేసీఆర్ బిడ్డ ఫోన్, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సిట్ విచారణ అనంతరం బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మామూలు ఫోన్ మాట్లాడలేదన్నారు. భార్యభర్తల ఫోన్లను కూడా విన్న సంస్కారహీనులు కేసీఆర్ ప్రభుత్వమని మండిపడ్డారు. మావోయిస్టుల లిస్ట్‌లో తమ పేర్లను పెట్టారని, మావోయిస్ట్‌లను అదుపుచేయడం కోసం ఉన్న వ్యవస్థను స్వార్థం కోసం వినియోగించుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ కార్యకలాపాలను కట్టడిచేయడం కోసం ఎన్న ఎస్ఐబీ వ్యవస్థను ఈ కేసీఆర్, అతని తనయుడు కేటీఆర్‌లు ఇష్టారాజ్యంగా వినియోగించుకున్నారని విమర్శలు గుప్పించారు.
‘‘ఎస్‌ఐబీని అడ్డాగా మార్చుకుని రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఉస్మానియా ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అందుకే వాళ్ల స్టేట్‌మెంట్లను కూడా సిట్ వాంగ్మూలం రికార్డ్ చేశారు. గ్రూప్ పేపర్ లీకేజీ అంశంపై నేను ప్రొటెస్ట్‌కు రెడీ అవుతుంటే ప్రొటెస్ట్ స్టార్ట్ కావడానికి ముందే పోలీసులు నా ఇంటికి వచ్చారు. మా ధర్నా గురించి మికెలా తెలుసు అని అడిగితే ఆనాటి పోలీసు అధికారులు సమాధానం కూడా ఇవ్వలేదు. అంతెందుకు టీజీపీఎస్‌పీ పేపర్ లీకేజీ అంశాన్ని విచారిస్తున్న న్యాయమూర్తి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు. ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఒక నీచుడు. లోపల అధికారులు చూపుతున్న విషయాలు వింటుంటే నేను ఆశ్చర్యపోయా. వీళ్లు ఇంత నీచులా, ఇంత ఫాల్తుగాళ్ల అని అనిపించింది. వాళ్లని ఈ రేవంత్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నాలు చేస్తోంది’’ అని బండి ఆరోపించారు.
‘‘రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్‌లో ప్రధాన నిందితులు విదేశాలకు జంప్ అయ్యారు. ఎస్‌ఐబీ ద్వారా వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. వాటి ఆధారంగా కేటీఆర్.. సదరు బిజినెస్ మెన్‌లకు ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర నుంచి అధికారులు రూ.7కోట్లు సీజ్ చేశారు. అవి ఏమయ్యాయో ఇప్పటి దాకా తెలీదు. వాటిని ఈ ప్రభాకర్ రావు, ఆయన సహచరులు కలిసి.. కేసీఆర్, కేటీఆర్‌కు చేరాయి. వీళ్లు సీజ్ చేసేటప్పుడు రూ.20 కోట్ల ఉంటాయి.. కానీ కేసీఆర్ లేదా కేటీఆర్ ఫోన్ రాగానే ఆ మొత్తం రూ.2కోట్లు అయిపోతుంది. ఈ లెక్కలపై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగినా ఎందుకు చర్యలు లేవు’’ అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇంకెన్నాళ్లు సాగదీస్తారని బండిసంజయ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కరే కాబట్టే ఇప్పటి వరకు ఎటువంటి అరెస్ట్‌లు కాలేదని అన్నారు. సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి.. ఆయనను పిలిచి విచారించే ధమ్ము అధికారులకు ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అందుకే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, అది చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని మేము భావిస్తామని వెల్లడించారు. ఈ రెండు పార్టీల మధ్య ఢిల్లీ వేదికగా మంతనాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లపై పనిచేస్తుందని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం సహా అన్ని కేసుల్లో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మూటలు అందుతున్నాయని బండి సంజయ్ అన్నారు.
‘‘అందరి ఫోన్లను ట్యాప్ చేసిన కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసీఆర్.. ఏం చెప్తే రేవంత్ అదే చేస్తారు. కేసీఆర్ ఆడించినట్లే రేవంత్ ఆడుతారు. అసలు కేసీఆర్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు. ఈ కమిషన్లు, విచారణలు అన్నీ కూడా టైమ్ పాస్ పనులే. ఇన్నాళ్లూ కాంగ్రెస్ చేస్తున్నదంతా వట్టిదేనని మేము మొదటి నుంచే చెప్తున్నాం. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం, సిట్ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు. సిట్‌కు కావాల్సిన స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే మాకు నమ్మకం లేకుండా పోయింది’’ అని బండి సంజయ్ కోరారు.
‘‘ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపించిన దాఖలాలే లేవు. కానీ ఇక్కడ మాత్రం ఉంది. అందుకే చెప్తున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే’’ అని పునరుద్ఘాటించారు.