‘కేటీఆర్ జీవితాంతం జైల్లోనే ఉండాలి’
కేటీఆర్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కుమార్.;
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజ్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. తాను నోటీసులు ఇవ్వడం మొదలు పెడితే కేటీఆర్ జీవితాంతం చిప్పుకూడు తినాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చిచ్చు మరోసారి రాజుకుంది. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్.. కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లోగా బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో లీగల్‌గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై బండి సంజయ్.. శనివారం స్పందించారు. ఉన్నది చెప్తే అంత నొప్పెందుకంటూ చురకలంటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు అనేది ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని అన్నారు.
‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చ ఎందుకు చేయట్లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అదొక కొలిక్కి వస్తుంది. రాధాకిషన్ వాంగ్మూలంలో కేసీఆర్ పేరుంది. అయినా విచారించడానికి కేసీఆర్‌ను ఎందుకు పిలవడం లేదు? తాను ట్యాపింగ్ చేయించలేదని కుటుంబ సభ్యులపై కేసీఆర్ ప్రమాణం చేయగలరా? నేను కూడా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తా.. ఏ గుడికి రమ్మంటే అక్కడి వస్తా.. టైమ్, డేట్ చెప్పండి. కేటీఆర్ లీగల్ నోటీసులకు నేను భయపడను. నేను నోటీసలు ఇవ్వడం మొదలు పెడితే కథ వేరేలా ఉంటుంది’’ అని హెచ్చరించారు.
కేటీఆర్ ఛాలెంజ్ ఇదే..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తోసిపుచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, ఉండే ఆధారాలు చూపాలని, చేసిన ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ‘‘ఇంటెలిజెన్స్ విభాగం ఎలా పనిచేస్తుందో సంజయ్ అర్థం చేసుకోలేరు. ఆయన నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు హద్దు మీరాయి. చౌకబారు ఆరోపణలతో ఆయన ఇంకా దిగజారారు. రాజకీయ ఉనికి కోసం రోడ్లపై ఇలాంటి నాటకానికి తెరలేపారు’’ అని కేటీఆర్ విమర్శలు చేశారు.
కేటీఆర్ నోటీసులపై బండి రియాక్షన్..
‘‘అనైతిక పనులు చేస్తూ లీగల్ నోటీసులు ఇస్తానని అనడానికి ట్విట్టర్ టిల్లుకు(కేటీఆర్)కు సిగ్గుండాలి. కేటీఆర్ ఓ పిరికిపంద.. గతంలో కూడా ఇదే విధంగా లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పి పారిపోయారు’’ అని బండి సంజయ్ చురకలంటించారు.