తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ లో బిగ్ ట్విస్ట్
అమెరికా వదలకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తునే మరోవైపు తాను ట్యాపింగ్ కేసులో పోలీసులకు అన్నీరకాలుగా సహకరిస్తున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.;
టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేమిటంటే తనకు బెయిల్ ఇవ్వాలని ఇద్దరు నిందితుల్లో ఒకడైన టీ ప్రభాకరరావు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. తనకు తీవ్ర అనారోగ్యంగా ఉన్న కారణంగా ముందస్తు బెయిల్ కోరుతు పిటీషన్ వేశారు. తాను క్యాన్సర్ రోగంతో బాధపడుతు అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నట్లు పిటీషన్లో ప్రభాకరరావు చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని టెలిఫోన్ ట్యాపింగు(Telephone Tapping) విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేశారు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు.
విచిత్రం ఏమిటంటే ట్యాపింగ్ కేసు నమోదుకాగానే నిందితులు ప్రభాకరరావుతో పాటు మీడియా యాజమాని శ్రవణ్ రావు హైదరాబాద్ నుండి అమెరికా(America)కు తప్పించుకుని పారిపోయారు. వీళ్ళని రప్పించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. పోలీసులముందు విచారణకు హాజరైతే తన భవిష్యత్తు ఎలాగుంటుందో ప్రభాకరరావుకు బాగానే అర్ధమయ్యుంటుంది. అందుకనే అమెరికాలోనే ఉండేపోయేందుకు గ్రీన్ కార్డు(US Green Card) తీసుకున్నారు. తర్వాత ఇండియాలో తనకు ప్రాణభయం ఉందని చెప్పి తనను ఇండియాకు అప్పగించవద్దని కోరుతు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు అమెరికా వదలకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తునే మరోవైపు తాను ట్యాపింగ్ కేసులో పోలీసులకు అన్నీరకాలుగా సహకరిస్తున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.
ప్రభాకర్ రావు ప్రయత్నాలు సాగనీయకుండా సీఐడీ అధికారులు కూడా సీబీఐ(CBI) ద్వారా ఇంటర్ పోల్(Inter Pol) అధికారులను సంప్రదించారు. చాలా ప్రయత్నాల తర్వాత నిందితులు ఇద్దరికీ ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీచేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయటం అంటే ప్రొవిజనల్ అరెస్టుకు అంగీకరించటమే. అయితే ఇందుకు అమెరికాలో కోర్టు అంగీకరించాల్సుంటుంది. కోర్టు ద్వారా నిందితుల అరెస్టుకు సీఐడీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాత తన అరెస్టుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే టెన్షన్ ప్రభాకరరావులో మొదలైనట్లుంది. అందుకనే ఎందుకైనా మంచిదని తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ముందస్తుబెయిల్ కు ప్రయత్నిస్తున్నారు. విచారణకు ఏరకంగాను సహకరించకుండానే ముందస్తుబెయిల్ కోసం చేసిన ప్రయత్నాన్ని కోర్టు గతంలో ఒకసారి కొట్టేసింది. ఇపుడు మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తున్నారు. మరి తాజా పిటీషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.