Delhi Elections | ‘తెలంగాణలో కూడా బీజేపీనే గెలుస్తుంది’
ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారని బీజేపీ నేతలంటున్నారు.;
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సమీకరణాలు, ఆప్ ఎందుకు ఓడుతోంది? కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయడం ఎలాంటి ప్రభావం చూపింది? కాంగ్రెస్ పర్యటన ఎవరికి మేలు చేసింది? ఇలా అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ విజయం దశగా దూసుకుపోతుండగా.. బీజేపీ గెలుపుపై తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలతో పాటు మేధావులు కూడా బీజేపీకే పట్టం కట్టాలని నిశ్చయించుకున్నారని బండి సంజయ్ అన్నారు. అదే విధంగా ఆప్‌పై సెటైర్లు కూడా పేల్చారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలకు తెలిసిపోయిందని, ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న ఆప్.. తమను మోసం తప్ప చేసిందేమీ లేదని ప్రజలు గుర్తించారని, అందుకే వారికి గుణపాఠం నేర్పిస్తున్నారని అన్నారు.
ఢిల్లీ ప్రజలను ‘చీపురు’ను ఊడ్చిపారేశారు. ఇన్నాళ్లూ చేసిన మోసానికి ఆప్‌కు తగిన బుద్ధి చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. ‘‘ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారు. అందుకే ఎన్నికల వేదికగా తమ నిర్ణయాన్ని రాష్ట్రమంతా మార్మోగించారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గమంతా కూడా బీజేపీకే ఓటేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుంది. తెలంగాణలోని ఉద్యోగ, మేధావి, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించుకుని ఓటేయాలి. అసెంబ్లీలో మా సమస్యలపై ప్రశ్నించే గొంతు బీజేపీ మాత్రమే’’ అని అన్నారు.
27ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హస్తినలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు. బీజేపీకి ఢిల్లీ ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి మంది వాతావరణం ఉంది. కర్ణాటక, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఆప్.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై బీసీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది’’ అని అన్నారు కిషన్ రెడ్డి.