తెలుగు వెలుగు పివి నరసింహారావుకు ‘భారత రత్న’
ఇద్దరు భారత మాజీ ప్రధానులు, పీవీ నరసింహరావుకు, చరణ్ సింగ్ లతో, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్ కేంద ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది.
ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త, దివంగత ఎంఎస్ స్వామినాథన్ కు సైతం కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ, బిహార్ ఒక నాటి ముఖ్యమంత్రి కర్పూరీ సింగ్ ఠాకూర్ కు కూడా భారతరత్న ప్రకటించింది.
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
— Narendra Modi (@narendramodi) February 9, 2024
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
పీవీ జీవిత చరిత్ర
పీ.వీ. నరసింహారావు 1921 జూన్ 28న కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలోను, బాంబే యూనివర్శిటీ, నాగ్‌పూర్ యూనివర్శిటీలో చదువుకున్నారు. పీవీ నరసింహరావుకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయదారుడిగా, న్యాయవాదిగా ఉన్న నరసింహారావు రాజకీయాల్లో చేరి కొన్ని ముఖ్యమైన పదవులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1962 – 64 న్యాయ, సమాచార శాఖ మంత్రి, 1964 – 67 న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 ఆరోగ్యం, వైద్య శాఖ మంత్రి, 1968 -71 విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1975 -76 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధానకార్యదర్శి, 1968 -74 ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్మన్, 1972 నుంచి మద్రాస్‌లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు.
1957 – 77 మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడుగా ఉన్నారు. 1977 నుంచి 1984 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1984 డిసెంబర్‌లో రామ్‌టెక్ నుంచి 8వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1978 -79లో పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా లండన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఆసియన్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నిర్వహించిన దక్షిణాసియా సదస్సులో పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1980 జనవరి 14 నుంచి 1984 జులై 18 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1984 డిసెంబర్ 31 నుంచి 1985 సెప్టెంబర్ 25 వరకు రక్షణ మంత్రిగా ఉన్నారు. అనంతరం 1985 సెప్టెంబర్ 25 మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అనేక అభిరుచులు కలిగిన నరసింహారావుకు సంగీతం, సినిమా, నాటకాలంటే ఇష్టం. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసంగం, రాజకీయ వ్యాఖ్యానం, భాషలు నేర్చుకోవడం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. జ్ఞానపీఠ్ ప్రచురించిన స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవన వేయి పడగలు హిందీ అనువాదాన్ని ‘సహస్రఫణ్’ పేరుతో ఆయన విజయవంతంగా ప్రచురించారు.
అలాగే, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వర్గీయ శ్రీహరినారాయణ్ అప్టే ప్రముఖ మరాఠీ నవల ‘పన్ లక్షత్ కోన్ గెటో’ (Pan Lakshat Kon Gheto) తెలుగు అనువాదాన్ని కూడా ప్రచురించారు. మరాఠీ నుంచి తెలుగులోను, తెలుగు నుంచి హిందీలోను అనేక అనువాద గ్రంథాలు ప్రచురించారు. వివిధ పత్రికల్లో కలం పేరుతో అనేక వ్యాసాలు రాశారు. అమెరికా, పశ్చిమ జర్మనీలోని యూనివర్శిటీల్లో రాజకీయ అంశాలపై, అనుబంధ అంశాలపైన ప్రసంగాలు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో 1974 బ్రిటన్, పశ్చిమ జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు.
విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి ఆయన తన మేథావితనాన్ని, ప్రజ్ఞా పాటవాలను, రాజకీయ అనుభవాన్ని సమయోచితంగా ప్రదర్శిస్తూ వచ్చారు. 1980 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన యునిడో 3వ సదస్సుకు నరసింహారావు అధ్యక్షత వహించారు.
1980 మార్చిలో న్యూయార్కులో జరిగిన 77 దేశాల సమావేశానికి కూడా అధ్యక్ష బాధ్యతలు వహించారు. 1981 ఫిబ్రవరి అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన నిర్వహించిన పాత్ర విస్తృత ప్రశంసలు అందుకొంది. అంతర్జాతీయ ఆర్థికాంశాలపై వ్యక్తిగత శ్రద్ధ కలిగిన నరసింహారావు 1981 మేలో కారకస్‌లో జరిగిన 77 దేశాలు ఈసిడిసి సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి వ్యక్తగతంగా నాయకత్వం వహించారు.
భారతదేశానికి, భారత విదేశాంగ విధానానికి 1982, 1983 సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో అలీనోద్యమం 7వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వవలసిందిగా భారత్‌ను కోరడమైంది. దీనివల్ల అలీనోద్యమ అధ్యక్ష స్థానాన్ని భారత్ అలంకరించింది. ఇందిరాగాంధీ అలీనోద్యమం ఛైర్ పర్సన్ అయ్యారు. న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సుతోపాటు 1982లో అమెరికాలో జరిగిన అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలకు పి.వి.నరసింహారావు అధ్యక్షత వహించారు.
1983 నవంబర్‌లో పాలస్తీనా సమస్య పరిష్కార యత్నంలో భాగంగా పశ్చిమాసియా దేశాల్లో పర్యటించిన అలీన దేశాల ప్రత్యేక ప్రతినిధి బృందానికి నరసింహారావు నాయకత్వం వహించారు. సైప్రస్ అంశానికి సంబంధించి కార్యాచరణ బృందం సమావేశంలోను, న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సులో కూడా నరసింహారావు క్రియాశీలక పాత్ర పోషించారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో అమెరికా, రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం,టాంజేనియా, గుయానాతో సహా అనేక దేశాలతో సంయుక్త కమిషన్లకు భారత్ తరపున నరసింహారావు నాయకత్వం వహించారు.
1984 జులై 19న నరసింహారావు హోం మంత్రి బాధ్యతలు చేపట్టారు. 1984 నవంబర్ 5న ఆయనకు ప్రణాళికా శాఖను కూడా అదనంగా అప్పగించారు. 1984 డిసెంబర్ 31 నుంచి 1985 సెప్టెంబర్ 25 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. 1985 సెప్టెంబర్ 25న మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా నియమితులయ్యారు.