తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్ ప్రకటించింది.;

Update: 2025-08-19 01:57 GMT
భారీవర్షాలతో పరవళ్లు తొక్కుతున్న వరదనీరు

తెలంగాణలో మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని ఆమె వెల్లడించారు. మోస్తరు వర్షాల నేపథ్యంలో మూడు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని నాగరత్న వివరించారు. హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఆమె తెలిపారు. సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, సిద్ధిపేట జిల్లాల్లో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు.




 12 జిల్లాల్లో 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముందని ధర్మరాజు వివరించారు. ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశామని ఆయన వివరించారు.

9 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ 9 జిల్లాలకు మంగళవారం ఎల్లో అలర్ట్ జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము దాకా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రాబోయే మరో రెండు గంటలపాటు చినుకులు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.



 ములుగు జిల్లాను ముంచెత్తిన జడివాన

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాను జడివాన ముంచెత్తింది. ములుగులో ఆదివారం 28.6 మిల్లీమీటర్లు, సోమవారం అత్యధికంగా 76.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, రంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 50.1 మిల్లీమీటర్ల నుంచి 17.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు.

అయిదు ప్రాంతాల్లో అధిక వర్షాలు
ములుగు జిల్లా మంగపేటలో సోమవారం అత్యధికంగా 186.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏటూరునాగారం మండలం ఏటూరునాగారంలో 161.0 మిల్లీమీటర్లు, వెంకటాపురం మండలం వెంకటాపురంలో 121.0 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 116.5 మిల్లీమీటర్లు, మంగపేట మండలం మల్లూరులో 116.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు.


Tags:    

Similar News