సన్నబియ్యం తింటే ఎన్నికష్టాలో...

సన్నబియ్యం తినిపించి ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాలు;

Update: 2025-08-18 12:37 GMT

జి.రాం మోహన్


తెలంగాణలో 33 సన్న రకం (Fine Rice) వరిపంటలకు క్వింటాల్ కు  500 రూపాయల బోనస్ యివ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏక పంట (Monocropping) విధానానికి ఊతం యిస్తోంది. వరిపంటకు విస్తరణ గణాంకాలు చూస్తే ఈవిషయం చాలా స్పష్గంగా తెలుస్తుంది.

యిప్పటికే ఈ పంటల సరళిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆందోళన వ్యక్తం చేసింది. నేపధ్యం లో రాష్ట్రం లో ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం వుంది?

2023 అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో చేసిన వాగ్దానాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇపుడు సన్నబియ్యానికి బోనస్ చెల్లిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన అనేక వాగ్దానాలలో యిది ఒకటి. ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో తాను జరిపిన రైతు సదస్సులో అన్నీ పంటలకు కనీస మద్దతు ధరపైన అదనపు బోనస్ యిస్తామని వాగ్దానం చేసింది. అందులో అన్నీ రకాల వడ్లకు బోనస్ యిస్తామని హామీ యిచ్చారు కానీ అధికారం లోకి వచ్చాక దానిని సన్న రకాలకు కుదించేసింది.

రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వడ్ల ఉత్పత్తి పెరగడాన్ని తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పు కొన్నారు. రాష్ట్రం లో 2024-25 వానాకాలం లో , 66.78 లక్షల ఎకరాలలో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు, యాసంగీ లో 127.5 లాఖల టన్నుల వడ్లను 56.49 లక్ష ల ఎకరాలలో పండించారు.

ప్రభుత్వం రాష్ట్రం లో 3.1 కోట్ల మంది అంటే 84 శాతం ప్రజలకు 30 లక్షల టన్నుల సన్న బియ్యం 13,523 కోట్లు ఖర్చుపెట్టి ఏప్రిల్ నుండి పంచుతున్నామని ఆయన చెప్పారు. ఇందులో కేంద్రం తన వాటాగా జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద 54,66,814 కార్డులకు డొద్దు బియ్యం పంపిణీకి మాత్రమే డబ్బు యిస్తుందని తక్కిన కార్డులకు రాష్ట్రమే ఖర్చులు భరిస్తోందని చెప్పారు. ఈ కార్డు దారులకు కూడా యిప్పుడు సన్న బియ్యం పంపిణీకి అయ్యే అదనపు ఖర్చును తామే భరిస్తున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఈ సన్న బియ్యం లబ్ది దారులను కలిసి వాళ్ళ యింట్లో భోజనాలు చేసి దానిని తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పుకున్న విషయం మనకు తెలిసిన విషయమే. యిది ఒకరకంగా ప్రజలలో సన్న బియ్యం తినడం గొప్ప గా తమ స్థితిగతుల మార్పుకు సంకేతంగా చూసే వైఖరి నుండి లాభ పడాలని చూడటమే.

ఆర్బీఐ తన నివేదికలో రాష్రం ఏర్పాడ్డాక 2013-14 నుండి అది పండ్లు, కూరగాయలు, చెరకు, దినుసులు, ధాన్యాలు పండించటంలో ఎలా వెనక పడిందో బయట పెట్టింది. యివి మునుపు వున్న విస్తీర్ణం కంటే చాలా తగ్గిపోయాయని అది చెప్పింది.

రాష్ట్రం లో పత్తి, మొక్కజొన్న, వడ్లు ఎక్కువ ప్రాంతంలో పండుతున్నాయి. రాష్ట్రం లో బిఆర్ఎస్ ప్రభుత్వం పంటల ప్రణాళికా తయారీకి చెల్లు చీటి యివ్వటం తో వడ్ల కు మాత్రమే మద్దతు వున్న కారణంగా దాని విస్తీర్ణం యిబ్బడి ముబ్బడి గా పెరిగిన విషయం గమనించాలి.

యిదే విషయాన్ని అది తన వ్యవసాయ విధాన నీటి పారుదల ప్రణాళికల గొప్పతనంగా చెప్పుకుంది. అలా వరి పంట 2024 వానాకాలం లో సాధారణంగా వుండే 57,18,527 ఎకరాల నుండి 65,49,230 ఎకరాలకు పెరిగింది. యిక యాసంగీలోనూ అది 47,27,000 నుండి 59,92,177 ఎకరాలకు పెరిగింది. కాగా అది మునుపటి సంవత్సరం యాసంగీ లో 52,03,953 ఎకరాలుగా వుండిoది. ఈ వానాకాలం లో యిప్పటికే మునుపటి ఏడు 13 ఆగస్టు లో వుండిన 31,60,699 ఎకరాలుగా నుండి అది ఈ ఏడు 45,20,974 ఎకరాలకు పెరిగింది. అది 72.36 శాతం పెరుగుదల అని గమనించాలి. ఈ పంట కాలానికి వడ్లు 62,47,868 సాధారణంగా ఎకరాలలో పండుతాయి.

రాష్ట్రం యిటీవల ఒక లక్ష టన్నుల వరిని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసింది. మరో లక్షా టన్నులకు రాష్ట్ర మంత్రి మరో ఒప్పందం చేసుకున్నారు ఆ దేశ వ్యవసాయ మంత్రి తో. ఒక అధికారి ఎనిమిది లక్షల టన్నుల వడ్ల ఎగుమతి లక్ష్యం గా పెట్టు కొన్నట్టు చెప్పారు.

దీని పైన సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ గా వున్న రామాంజనేయులు మాట్లాడుతూ 25 లక్షల ఎకరాలలో పండించే వడ్లు సన్న బియ్యం పథకానికి సరిపోగా ఒక కోటి ఎకరాలలో ఎందుకు వాటిని పండిస్తున్నాము అని అన్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టి లక్షల మందిని నిరాశ్రయులు చేసి యిలా నీరు అధికంగా వాడే పంటలు పండించి మనం చేస్తోంది నీరు ఎగుమతి చేయడమే అంటారు ఆయన. వడ్ల పంటకు మాత్రమే అన్నీ స్థాయిలలో మద్దతు వుండటం వలన యిలా జరుగుతొందని ఆయన అన్నారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కులపతి జానయ్య  మన రాష్ట్రం కనీసం 25 నుండి 30 లక్ష ల ఎకరాల భూమిని యాసంగీ లో యితర పంటలకు మార్పు చేయాలని అన్నారు. ఆసియా దేశాలలో కేవలం ఫిలిప్పనా దేశం మాత్రమే వరి పంటలో లోటు తో వుంది తక్కిన వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్థాన్ మరియు చైనా మిగులు వడ్లు కలిగి వున్నాయి అని చెప్పారు. మన వద్ద యిప్పటికి 70 నుండి 80 లక్ష ల టన్నులు (FCI) గోదాములలో వున్నాయి మరో పంట రాబోతోంది తొందరలో. మనం ఈ లోపు కనీసం 30 నుండి 40 లక్షల టన్నుల బియ్యం గోదాముల నుండి నుండి తరలించ గలగాలి అన్నారు.

చిరుధాన్యాల పరిశోధన సంస్థ (IIMR) లో మాజీ పరిశోధకులు ప్రొ. బి. దయాకర్ రావు దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం తినడం వలన గ్లూకోజ్ రక్తం లోకి త్వరగా చేరుతుంది  అని చెప్పారు. చిరుధాన్యాలలో సంక్లిష్ట మైన పిండి పదార్థలు వుంటాయి అవి తొందరగా రక్తం లో గ్లూకోజ్ ను పెంచవు. ఒక పక్కన బియ్యం ఎక్కువ పాలిష్ చేసి తింటూ మళ్ళీ వాటిలోకి కొన్ని ఖనిజాలు ఆహారాన్ని బలోపేతం చేయడం (ఫోర్టిఫికేషన్) పేరుతో కలపటం లో ఔచిత్యం లేదు అని  అన్నారు.

మనం కనీసం డొద్దు బియ్యం సన్నబియ్యం మధ్యనయినా  పంట మార్పిడి చేయాలి అంటారు సుస్థిర వ్యవసాయ కేంద్రం ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా. జి. రాజశేఖర్. సన్న రకాలకు పంట కాలం ఎక్కువ కాబట్టి ఎక్కువ నీరు వాడుతాయి వాటికి రోగాల తాకిడి కూడా ఎక్కువే అని ఆయన గుర్తు చేశారు.



Tags:    

Similar News