ప్రభుత్వం దిగొచ్చేదాకా తగ్గేదే లే...

నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థి సంగం నాయకులను, నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నారు.

Update: 2024-07-05 10:25 GMT

తెలంగాణలో నిరుద్యోగ జేఏసీ టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో 'నిరుద్యోగుల మార్చ్' నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ పిలుపు మేరకు శుక్రవారం వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్ బాట పట్టారు. దీంతో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిరుద్యోగులను కార్యాలయం వద్దకి చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థి సంగం నాయకులను, నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కొందరిని గృహ నిర్బంధం చేశారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసు శాఖ ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేసి పంపతున్నారు. హైదరాబాద్ లో అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీలు, లైబ్రరీలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూంల తోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టారు. దీంతో పోలీసుల తీరుపై నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

నిరుద్యోగుల డిమాండ్స్...

రాష్ట్రంలో గ్రూప్ 2, 3 పోస్టులను పెంచి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి. గ్రూప్1 మెయిన్స్ కి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలి. జీవో 46 రద్దుతోపాటు డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి. నిరుద్యోగ భృతి కింద రూ.4 వేలు ఇవ్వాలి. గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్విస్ట్మెంట్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అరెస్టులను ఖండించిన కేటీఆర్..

విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థుల శాంతియుత నిరసన పైన ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరించింది అని మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను యువకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు BRS అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ఇది ముమ్మాటికీ అప్రజాస్వామ్యపాలన.. హరీష్ రావు 

టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. "సో కాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది రేవంత్ సర్కారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, అప్రజాస్వామ్యపాలన" అని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

Tags:    

Similar News