‘రేవంత్ రెడ్డి పగటి కలలు మానుకోవాలి’
కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్న జాతిలాంటిదని, అతి త్వరలోనే కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు బండి సంజయ్.;
దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్ల కన్నా బీజేపీ మరింత ప్రమాదకరమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్లతో బీజేపీని పోల్చడం సిగ్గు చేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ వాద సిద్ధాంతాలు, నిలువెల్లా దేశభక్తి ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు, అవినీతి పాలనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ పార్టీ. కరోనా కంటే ప్రమాదకరమైన పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకుంటామంటున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికి అయినా పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్న జాతిలాంటిదని, అతి త్వరలోనే కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందో 15 నెలల కాంగ్రెస్ పాలనలో అంతకు రెట్టింపు వ్యతిరేకతను మూటగట్టుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ‘‘ తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు. సిట్టింగ్ సీటైన మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. అక్కడా కూడా బీజేపీ గెలిచింది. స్వయంగా పోటీ చేసిన కామారెడ్డిలో బీజేపీ చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయారు. ఎమ్మల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 50 శాతానికిపైగా ప్రాతినిధ్యం బీజేపీ కలిగి ఉందనే విషయాన్ని విస్మరించొద్దు’’ అని హెచ్చరించారు.
‘‘హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ చేసే అభ్యర్థులే కరవయ్యారు. దిక్కులేక హైదరాబాద్ ను మజ్లిస్ చేతిలో పెట్టేందుకు సిద్ధమైన మీరు బీజేపీ కంచుకోటైన గుజరాత్ కు వెళ్లి తెలంగాణలో బీజేపీని అడ్డుకునే శక్తి ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. కాంగ్రెస్ కు అంటిన బురదను తుడుచుకోలేని వారు దేశం మొత్తాన్ని క్లీన్ చేస్తాననడం హాస్యాస్పదం. రిజర్వేషన్ల ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టేది, మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలేనన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మీరెన్ని డ్రామాలాడినా తెలంగాణలో అధికారం రావడం పక్కా. మిగిలిన కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనైనా అధికారం కోల్పోకుండా చూసుకుంటే బెటర్’’ అని సూచించారు.