తెలంగాణలో ‘బీసీ ఛాంపియన్ షిప్’ మొదలైందా ?

స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించి బీసీ ఛాంపియన్లమని అనిపించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు;

Update: 2025-07-30 07:39 GMT
Revanth, KCR and BJP

పోటీలు ఎప్పుడో డేట్ తెలియకపోయినా బీసీ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచేందుకు పార్టీల మధ్య పోటీ మొదలైపోయినట్లే ఉంది. బీసీఛాంపియన్లు తామంటే తామని మూడు ప్రధానపార్టీలు పోటీపడుతున్నాయి. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించి బీసీల ఛాంపియన్లమని అనిపించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహలు పన్నుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తో పాటు కప్ రేసులో తానూ ఉన్నానంటు బీజేపీ(BJP) పోటీలోకి దూసుకొస్తోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించిన విషయం తెలిసిందే. 42శాతం రిజర్వేషన్లను చట్టబద్దం చేసేందుకు ముందు బిల్లన్నాడు. అది కుదరకపోయేటప్పటికి ప్రత్యామ్నాయమార్గంగా ఆర్డినెన్స్ అన్నాడు. అదీ కుదరకపోయేసరికి ఇపుడు పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తామని రేవంత్ ప్రకటించాడు. దాంతో వెంటనే బీజేపీ మేల్కొంది. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఎన్. రామచంద్రరావు మాట్లాడుతు పార్టీపరంగా బీసీలకు తాము 45శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

పార్టీపరంగా బీసీలకు కేటాయించబోయే రిజర్వేషన్లను కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించినా ఎందుకనో బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు నోరిప్పలేదు. ఇంతకాలం రిజర్వేషన్ల అమలుపై నోరిప్పని కారుపార్టీ సడెన్ గా ఆగష్టు 8వ తేదీన కరీంనగర్ లో బీసీలకు మద్దతుగా బహిరంగసభ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. పార్టీఅధినేత కేసీఆర్(KCR) పాల్గొంటారనే ప్రచారంజరుగుతున్న బహిరంగసభలో రిజర్వేషన్ల అమలుపై తననిర్ణయన్ని ప్రకటిస్తారేమో చూడాలి. బీసీ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా వేయించుకుని తామే బీసీల ఛాంపియన్లమని నిరూపించుకునేందుకు మూడుపార్టీలు ఒకదానితో మరొకటి బాగా పోటీపడుతున్నాయి.

తెలంగాణలో ఇపుడు హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశమే. ఈఅంశం ఎందుకింత హాట్ టాపిక్ అయ్యిందంటే సెప్టెంబర్ 30లోగా స్ధానికసంస్ధల ఎన్నికలు ఉన్నాయి కాబట్టే. బీసీలను ఆకట్టుకుని ఓట్లు సంపాదించి ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెగ ప్రయత్నిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లని మొదటి ప్రకటించింది 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నెరవేర్చటంలో రేవంత్ ఫెయిల్ అయ్యాడు. ఇదేసమయంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ను బూచిగా చూపించి బీజేపీ ఓట్లు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రామచంద్రరావు ఏమన్నారంటే బీసీలకు పార్టీపరంగా తాము 45శాతం టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇక కేటీఆర్(KTR) మాట్లాడుతు బీసీలను రేవంత్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారే కాని ఎంతశాతం టికెట్లు కేటాయిస్తామనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

బీసీ కులసంఘాల నేతల నుండి కీలకమైన ప్రశ్న వినబడుతోంది. అవేమిటంటే మొదటిది బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఎప్పుడు వస్తుందని నిలదీస్తున్నారు. రిజర్వేషన్లకు చట్టబద్దత దక్కాలంటే అందుకు కేంద్రంలోని ఎన్డీయే(NDA) ప్రభుత్వం పూనుకోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఎన్డీయే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినపుడు మాత్రమే పార్లమెంటులో చర్చజరిగి తర్వాత తీర్మానం పాస్ అవుతుంది. ఆ తర్వాత తీర్మానంపై రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టబద్దం అవుతుంది. అప్పుడు మాత్రమే తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత వచ్చినట్లు లెక్క. లేకపోతే పార్టీపరంగా అమలయ్యే 42శాతం లేదా 45 శాతం రిజర్వేషన్లు అనధికారికం మాత్రమే.

బీసీ 42శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇవ్వాలంటే అందులో నుండి ముస్లింలను తొలగించాలని బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షరతు విధించారు. బీజేపీ నేతల స్టాండ్ అంతా అలాగే ఉంది అయితే దీనికి రేవంత్ అంగీకరించటంలేదు. ఎందుకంటే 42శాతంలో నుండి తొలగిస్తే ముస్లింలు ఊరుకోరు. కాంగ్రెస్ కు బీసీలూ కావాలి అలాగే ముస్లింలూ ముఖ్యమే. అందుకనే బీసీలు, ముస్లింలను కలిపి 42శాతం రిజర్వేషన్లు ఖరారుచేసింది. 42శాతం రిజర్వేషన్ల నుండి ముస్లింలను రేవంత్ ప్రభుత్వం తొలగించదన్న విషయం బాగా తెలుసుకాబట్టే బీజేపీ పదేపదే ముస్లింలను తొలగించకపోతే మద్దతు ఇచ్చేదిలేదని గట్టిగా పట్టుబడుతోంది.

కాంగ్రెస్, బీజేపీ వాదనల నేపధ్యంలో ఏమిచేయాలో అర్ధంకాక బీఆర్ఎస్ దిక్కులు చూస్తోంది. కరీంనగర్ బహిరంగసభలో కేసీఆర్ పార్టీ స్టాండుపై క్లారిటి ఇస్తారేమో చూడాలి. మూడు పార్టీల వాదనలు, ప్రతివాదనలు, డిమాండ్లను బీసీలు, ముస్లింలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లువేసి ఏ పార్టీని ఛాంపియన్ గా గెలిపిస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News