ఫార్ములా ఈ-కార్ రేసులో క్విడ్ ప్రోకో..!

క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎలక్టోరల్ బాండ్స్ అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.;

Update: 2025-01-06 09:22 GMT

ఫార్ములా ఈ-కార్ రేసు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో క్విడ్ ప్రోకో జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. గ్రీన్ కో సంస్థ దాదాపు రూ.41కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు అందించిందని, ఫార్ములా రేసులో భాగస్వామికి, బీఆర్ఎస్‌కు మధ్య భారీ లావాదేవీలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌‌కు కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపింది. గ్రీన్‌కో, దాని అనుబంధ సంస్థ నుంచి బీఆర్ఎస్‌కు 41సార్లు ఎన్నికల బాండ్లు అందాయని, 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు జరిగిందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రతిసారి కూడా కోటి రూపాయలు విలువైన బాండ్లు కొనుగోలు చేయడం జరిగిందని, మొత్తం మీద రూ.41కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌ అప్పజెప్పడం జరిగిందని కాంగ్రెస్ వెల్లడించింది.




 

ఫార్ములా ఈ-కార్ రేసు చర్చలు మొదలైనప్పటి నుంచే గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ప్రారంభించని, 8 ఏప్రిల్ 2022 నుంచి అదే ఏడాది అక్టోబర్ 10 మధ్యలో సదరు సంస్థ పదిసార్లు ఎన్నికల బాండ్లు కొన్నదని సమాచారం. అయితే ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. రేస్‌తో గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్‌కు ఎటువంటి సంబంధిం లేదని కేటీఆర్ ఇప్పటికే పలుసార్లు చెప్పారు. ఏసీబీ కార్యాలయానికి చేరుకుని తన తరపు న్యాయవాదిని లోపలికి అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగిన కొద్దిసేపటికే కాంగ్రెస్ ఈ వివరాలు బహిర్గతం చేసింది. దీంతో కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ-కార్ రేసు ఉచ్చు మరింత బిగుస్తోంది. కానీ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా తోసిపుచ్చుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?: కేటీఆర్

‘‘గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ-రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్ కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. ఫార్ములా రేసు ద్వారా గ్రీన్ కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? ఇది రేవంత్ రెడ్డి టీమ్ చేస్తున్న దుష్ప్రచారమే. పార్లమెంటులో ఆమోదం పొందిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఇచ్చిన బాండ్లపై చర్చలకు మేము సిద్ధం’’ అని కేటీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News