ఎంతమంది జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయో తెలుసా ?
19 మంది హైకోర్టు జడ్జీల మొబైల్ ఫోన్లతో పాటు ఒక సుప్రింకోర్టు జడ్జీ ఫోన్ కూడా ట్యాప్(Telephone tapping) అయినట్లు బయటపడింది.;
సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో మరో కొత్త విషయం వెలుగుచూసింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోనే అనేకమంది ప్రముఖులతో పాటు జడ్జీల మొబైల్ ఫోన్లను కూడా కేసీఆర్(KCR) ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు గతంలోనే బయటపడింది. ఇంతకాలం ఎంతమంది జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే విషయంపై సరైన సమాచారం లేదు. అయితే తాజాగా హైకోర్టులో ఇదే విషయమై జరిగిన విచారణలో కొత్త విషయం వెలుగుచూసింది. ఇంతకీ ఆ కొత్త విషయం ఏమిటంటే 19 మంది హైకోర్టు జడ్జీల మొబైల్ ఫోన్లతో పాటు ఒక సుప్రింకోర్టు జడ్జీ ఫోన్ కూడా ట్యాప్(Telephone tapping) అయినట్లు బయటపడింది. టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు, మీడియ అధినేత శ్రవణ్ కుమార్ కీలక నిందితులన్న విషయం తెలిసిందే. ట్యాపింగ్ కేసు వెలుగుచూసి డీఎస్పీ ప్రవీణ్ రావు అరెస్టు కాగానే ప్రభాకరరావు, శ్రవణ్ అమెరికాకు పారిపోయారు.
దాదాపు ఏడాదిగా అమెరికా(America)లోనే ఉంటున్న నిందితులు అక్కడినుండే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా బెయిల్ కోసం శ్రవణ్ వేసిన పిటీషన్ను హైకోర్టులో జస్టిస్ కే సుజన విచారించారు. శ్రవణ్ బెయిల్ పిటీషన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ట్యాపింగ్ లో శ్రవణ్ ప్రోద్భలంతోనే అప్పటి పోలీసు అధికారులు అక్రమంగా 19 మంది హైకోర్టు జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను, సుప్రింకోర్టు జడ్జి ఫోన్ను కూడా ట్యాప్ చేయించినట్లు పల్లె చెప్పారు. శ్రవణ్ ఆఫీసునుండి స్వాధీనంచేసుకున్న కంప్యూటర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపినట్లు చెప్పారు. కంప్యూటర్లలో బయటపడిన సమాచారాన్ని ల్యాబ్ లో విశ్లేషించినపుడు మొత్తం 20 మంది జడ్జీల ఫోన్లతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన విషయం బయటపడిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా చేయించిన వేలాది ఫోన్ల ట్యాపింగులో జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ఉండటం చాలా తీవ్రమైన నేరంగా పల్లె వాదించారు. అక్రమ టెలిఫోన్ ట్యాపింగులో కీలకపాత్ర పోషించిన కారణంగా శ్రవణ్ కు ఎట్టిపరిస్దితుల్లోను ముందస్తు బెయిల్ ఇవ్వద్దని పల్లె హైకోర్టు(Telangana high court)ను అభ్యర్ధించారు. ట్యాపింగ్ కు గురైన జడ్జీల వివరాలు, కుటుంబసభ్యుల వివరాలతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్లను కూడా సీల్డ్ కవర్లో అందించినట్లు పల్లె హైకోర్టుకు చెప్పారు. కేసు తీవ్రత, నిందితుడి నేరపూరితమైన చర్యలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ ఇవ్వద్దని పల్లె గట్టిగానే వాదించారు. పల్లె ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో వాదించినట్లుగానే శ్రవణ్ తరపు లాయర్ శ్రీవెంకటేష్ ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలో వివరించారు. రెండువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసి వాయిదావేశారు.
నిజానికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, కోర్టులో విచారణ ఎప్పుడో పూర్తయిపోవాల్సుంది. అయితే ఇద్దరు కీలకనిందితులు ప్రభాకరరావు, శ్రవణ్ కుమార్ అమెరికాకు పారిపోవటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏ కేసుకయినా లాజికల్ ఎండ్ అన్నది ఉంటుంది. ట్యాపింగ్ కేసు దర్యాప్తులో లాజికల్ ఎండ్ రావాలంటే అమెరికాలోని ఇద్దరు నిందితులు దొరకాల్సిందే. వీళ్ళు దొరకనంతకాలం దర్యాప్తు ముందుకు సాగదు, కోర్టులో విచారణ పూర్తవ్వదు. నిందితులిద్దరినీ అమెరికా నుండి హైదరాబాదుకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ఏ ప్రయత్నమూ ఫలించటంలేదు. మరి నిందుతులు అమెరికా నుండి ఎప్పుడొస్తారో ? సిట్ అధికారుల దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో ? కోర్టు విచారణ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.