KTR Legal Notice | ఎంతమందికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారో తెలుసా ?
తనపైన ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏమాత్రం సహించలేకపోతున్నారు.;
రాజకీయాల్లో ఉన్నపుడు పూలే కాదు కొన్నిసార్లు రాళ్ళుకూడా పడతాయి. పూలను, రాళ్ళను సమానంగా చూడగలిగినపుడే రాజకీయల్లో రాణించగలరు. ఇపుడీ విషయం ఎందుకంటే తనపైన ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏమాత్రం సహించలేకపోతున్నారు. తనపైన ఆరోపణలు చేస్తున్న వారికి వెంటనే లీగల్ నోటీసులు పంపటం ద్వారా వాళ్ళ నోళ్ళు మూయించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇపుడు విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో తనపై అసత్యారోపణలు చేశారని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కి కేటీఆర్ లీగల్ నోటీసులు(Legal Notice) పంపారు. తనపైన బండిచేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించలేకపోయినా, క్షమాపణ చెప్పకపోయినా లీగల్ యాక్షన్ తప్పదని కూడా కేటీఆర్ హెచ్చరించారు.
ప్రత్యర్ధులపై యధేచ్చగా తానుమాత్రం ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ తనపైన మాత్రం ఎవరూ ఆరోపణలు చేయకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలావరకు నిరాధారమైనవే అనటంలో సందేహంలేదు. ఆరోపణకు ప్రత్యారోపణ అన్నట్లుగానే ఉంటుంది నేతల తీరు. ఆరోపణలు వచ్చినపుడు నేతలు ఎందుకు వెంటనే ప్రత్యారోపణలు చేస్తారు ? ప్రత్యారోపణలు చేయకపోయినా, ఆరోపణలను ఖండిచకపోయినా తమపైన వచ్చిన ఆరోపణలు నిజమే అని జనాలు అనుకుంటారన్న భయంతో వెంటనే స్పందిస్తారు.
ఇపుడు విషయం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ అరాచకాలకు పాల్పడ్డారని బండి ఆరోపించారు. వేలాది కోట్లరూపాయలను కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సంపాదించారన్నారు. 6500 ఫోన్లను ట్యాప్ చేయించినట్లు మండిపడ్డారు. తన ఫోన్ తో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ ను ట్యాపయ్యిందన్నారు. ప్రత్యర్ధుల ఫోన్లే కాదని చివరకు బిడ్డ కల్వకుంట్ల కవిత, అల్లుడు దేవనపల్లి అనీల్ రావు, మేనల్లుడు తన్నీరు హరీష్ రావుతో పాటు మంత్రులు, ఎంఎల్ఏల ఫోన్లను కూడా తండ్రి, కొడుకులు ట్యాప్ చేయించినట్లు బండి ఆరోపించారు.
తనపైన బండిచేసిన ఆరోపణలకు కేటీఆర్ మండిపడ్డారు. ఆరోపణలను నిరూపించలేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. అయినా కేటీఆర్ ను బండి పట్టించుకోలేదు. అందుకనే మంగళవారం బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బండికే కాదు తనపైన ట్యాపింగ్ ఆరోపణలు చేసిన మంత్రి కొండాసురేఖ, మహబూబ్ నగర్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ తో పాటు కొన్ని యూబ్యూబ్ ఛానళ్ళకు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.
నోటీసుల్లో కేటీఆర్ కోరుతున్నది ఏమిటంటే చేసిన ఆరోపణలను నిరూపించాలని. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని. క్షమాపణచెప్పటంతో పాటు భవిష్యత్తులో ఇంకెప్పుడూ నిరాధార ఆరోపణలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. లీగల్ నోటీసును దాటుకుని కోర్టులో మంత్రి మీద కేసు కూడా దాఖలుచేశారు. మంత్రి కొండా సురేఖపై లీగల్ యాక్షన్ తీసుకోవటంతో పాటు పరువునష్టం దావా కూడా వేశారు. అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవటానికి కేటీఆరే కారణమని మంత్రి ఆరోపించారు. సినీమా సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేయటం ద్వారా కొందరు హీరోయిన్లను లొంగదీసుకున్నాడంటు కేటీఆర్ పై మంత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ ముందు లీగల్ నోటీసులు పంపి తర్వాత కోర్టులో కేసు కూడా వేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యర్ధులపై తాను యధేచ్చగా ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ తనపైన ప్రత్యర్ధులు ఆరోపణలు చేయటాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. ఢిల్లీకి ఎనుముల రేవంత్ రెడ్డి మూటలు మోస్తున్నాడని, 25 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని చాలాసార్లు ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డులో రు. 1600 కోట్ల కాంట్రాక్టును బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు రేవంత్ కట్టబెట్టాడని ఆరోపించారు. మూసీనది బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ ఢిల్లీ బాసులకు సూట్ కేసులు మోస్తున్నాడన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఢిల్లీకి రేవంత్ మూటలు మోస్తున్నాడన్న ఆరోపణలకు కేటీఆర్ దగ్గర ఆధారాలున్నాయా ? అని మంత్రులు ప్రశ్నించినపుడు సమయం వచ్చిపుడు బయటపెడతానని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. అంతేకాని ఇవిగో రేవంత్ మోస్తున్న మూటలకు ఆధారాలని ఎందుకు చూపలేకపోయారు ?
తాను ఎవరిమీదైనా ఆరోపణలు చేయచ్చుకాని తనమీద మాత్రం ఎవరూ ఆరోపణలు చేయకూడన్నట్లుగా ఉంది కేటీఆర్ వైఖరి. రేవంత్ మీద వ్యక్తిగతంగా లేకపోతే ప్రభుత్వం మీద కేటీఆర్ ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు చేసుంటారో లెక్కేలేదు. రేవంత్ కు వ్యతిరేకంగా చేసినఆరోపణల్లో ఇప్పటివరకు కేటీఆర్ ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేదు. రాజకీయాల్లో ఉన్నపుడు తనపైన పూలుమాత్రమే చల్లాలని రాళ్ళు విసరకూడదంటే కుదరదని కేటీఆర్ కు అంతమాత్రం తెలీదా ? కొసమెరుపు ఏమిటంటే కేటీఆర్ నుండి లీగల్ నోటీసులను అందుకున్న వాళ్ళల్లో ఎవరూ నోటీసులను సీరియస్ గా తీసుకోవట్లేదు.