హైదరాబాద్ లో రూ 69 లక్షల డ్రగ్స్ స్వాధీనం

ముంబాయి మాఫియా నుంచి డ్రగ్స్ కొనుగోలు, హైదరాబాద్ లో అమ్మకాలు;

Update: 2025-07-23 12:30 GMT

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయాలు యదేచ్చగా జరుగుతున్నాయని ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎక్కువయ్యాయి. డ్రగ్ రహిత తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న 9 మందిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ (హెచ్‌న్యూ) పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసిన విషయం తెలిసిందే. కొకైన్‌ సరఫరా చేస్తున్న ఆరుగురు, మెఫిడ్రీన్‌ సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్‌, 11 గ్రాముల ఎక్స్‌టసీ, తుపాకీ, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

‘‘డగ్స్‌ కేసులో కీలక నిందితులైన రవివర్మ, సచిన్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ముఖ్యమైన సమాచారం అప్ డేట్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. రవివర్మకు ముంబాయికి చెందిన మాఫియాతో సంబంధాలున్నాయి. అక్కడ ఉన్న వాహిద్‌ అనే వ్యక్తికి విదేశాల నుంచి కొకైన్‌ దిగుమతి అవుతోంది. అతడి నుంచి నిందితులు హైదరాబాద్‌కు డ్రగ్స్‌ పట్టుకొస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టుకావడానికి వినియోగదారుడే కారణం. ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ అనే వినియోగదారుడిని అరెస్ట్‌ చేయగానే డొంక కదిలింది. ఈ ముఠా గుట్టురట్టయింది. నిందితుల నుంచి ఏకంగా రూ.69లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ పారిశ్రామిక వాడ కాటేదాన్‌లో డ్రగ్స్‌ దందా చేస్తున్నవ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన పవన్‌ భాటీని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు కమిషనర్ తెలిపారు. హేమ్‌సింగ్‌ అనే మరో వ్యక్తితో కలిసి పవన్‌ భాటీ డ్రగ్స్‌ విక్రయిస్తున్నాడు. నిందితులు డ్రగ్స్ దందా మాత్రమే కాకుండా బడా వ్యాపారులను కంట్రీ రివాల్వర్ లతో బెదిరించే వారని తెలుస్తోంది. వారి వద్ద నుంచి రివాల్వర్‌, బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నాం ’’ అని కమిషనర్ వివరించారు.

Tags:    

Similar News