గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఆరు చోట్ల;
బిఆర్ఎస్ ప్రభుత్వహయంలో గొర్రెల కుంభ కోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్‌లోని ఆరుచోట్ల సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉండటంతో అతన్ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో రూ.750 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.
2015లో అప్పటి కెసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంత మంది గొర్రెల విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో కనిపిస్తున్నప్పటికీ , ఆ నిధుల్ని ఈ ముఠా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఈ నిధుల్ని దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో కొందరు బిఆర్ఎస్ నేతల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ, ఈడీ గుర్తించింది.