KTR and FEO|క్విడ్ ప్రో కో దర్యాప్తులో ఈడీ కీలక నిర్ణయం
కోట్లాదిరూపాయలు చేతులు మారటంవెనుక ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds to BRS) రూపంలో క్విడ్ ప్రోకో(Quid pro quo) జరిగిందన్న విషయం బయటపడింది.;
రాజకీయంగా ఫార్ములా ఈ కార్ రేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు కార్ రేసు నిర్వహణలో నిబంధనలను అతిక్రమించి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ బ్రిటన్ సంస్ధ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు కోట్లాదిరూపాయల లబ్ది చేకూర్చారని మాత్రమే వినిపించింది. అయితే తాజాగా ఫార్ములా కారు రేసు(Formula E Car Race)లో కోట్లాదిరూపాయలు చేతులు మారటంవెనుక ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds to BRS) రూపంలో క్విడ్ ప్రోకో(Quid pro quo) జరిగిందన్న విషయం బయటపడింది. ఫార్ములా నిర్వహణ కంపెనీ గ్రీన్ కో(GreenKo) నుండి బీఆర్ఎస్ కు రు. 49 కోట్లరూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందుకున్న విషయం బయటపడటం సంచలనంగా మారింది. 2022-2023 మధ్య సుమారు కోటిరూపాయల చొప్పున 41సార్లు గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లను అందించిందని బయటపడింది. ఫార్ములా కార్ రేసు నిర్వహణ పేరుతో అప్పనంగా కోట్లాది రూపాయలు అక్రమమార్గంలో చేతులుమారాయన్న ప్రభుత్వం ఆరోపణలు ఇపుడు రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.
కేటీఆర్(KTR) మంత్రిగా ఉండి ప్రజాధనాన్ని అక్రమపద్దతిలో ఎఫ్ఇవో కంపెనీకి పంపించి అక్కడినుండి గ్రీన్ కో కంపెనీకి చేర్చి మళ్ళీ ఆ కంపెనీనుండి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి పార్టీకి విరాళాలుగా తెప్పించుకున్నట్లు ముఖ్యమంత్రి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి చేసిన ట్వీట్ సంచలనమైంది. అంటే ప్రజలధనాన్ని ముందుగా విదేశాలకు పంపించి అక్కడినుండి కంపెనీలు మార్చి అదే డబ్బును తిరిగి కేటీఆర్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలుగా పార్టీ ఖాతాకు తెప్పించుకున్నారని అర్ధమవుతోంది. అందుకనే ఈకేసులో ఇప్పటికే మనీల్యాండరింగ్, ఫెమా కేసులు నమోదుచేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) బ్రిటన్ కంపెనీ ఎఫ్ఇవో(FEO)కు నోటీసులు జారీచేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఎఫ్ఈవో కంపెనీని విచారిస్తేనే తెలంగాణా ప్రభుత్వం(Telangana) నుండి అందిన రు. 45 కోట్లు ఎక్కడికి వెళ్ళిందన్న విషయం తెలియదు. ఈ విషయం తెలుసుకోవటానికే తొందరలో నోటీసులిచ్చి ఎఫ్ఈవో కంపెనీని ఈడీ విచారించబోతోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2022 ఏప్రిల్ లో రు. 31 కోట్లు, అక్టోబర్లో రు. 10 కోట్లు గ్రీన్ కో కంపెనీ అనుబంధ సంస్ధల నుండి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు అందింది. గ్రీన్ కో కంపెనీకి అనుబంధంగా ఉన్న ఆస్మాన్ ఎనర్జీ లిమిటెడ్, అచింత్యా సోలార్ పవర్ ప్రైవేటు లిమిటెడ్, గ్రీన్ కో బడ్ హిల్ హైడ్రో పవర్ ప్రైవేటు లిమిటెడ్, సనోలా విండ్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ లాంటి 20 సంస్ధలు బీఆర్ఎస్ కు 31 కోట్ల రూపాయల విలువైన బాండ్లను చెల్లించాయి. అలాగే అక్టోబర్లో 10వ తేదీన ఆరు సంస్ధలు మిగిలిన రు. 10 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించాయి. గ్రీన్ కో కంపెనీకి అనుబంధంగా ఉన్న 26 సంస్ధలు బీఆర్ఎస్ కు 41 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్లు చెల్లించాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే పై సంస్ధలు చెల్లించినవి వాటి సొంతడబ్బుతో కొన్న బాండ్లు కావు. మున్సిపల్ శాఖలో అతర్భాగంగా ఉన్న హెచ్ఎండీయే ఖాతానుండి ముందు ఎఫ్ఈవో కంపెనీకి 41 కోట్ల రూపాయలు చేరాయి. అక్కడి నుండి గ్రీన్ కో కంపెనీకి చేరిన మొత్తాన్ని కోటి రూపాయల చిల్లరగా విడదీసి 26 సంస్ధల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మొత్తం డబ్బు తిరిగి బీఆర్ఎస్ కు చేరింది.
ఈమొత్తం అక్రమంగా సర్కులేట్ అయిన డబ్బు కాబట్టే హెచ్ఎండీఏ రిజర్వ్ బ్యాంకు అనుతి తీసుకోకుండానే బ్రిటన్ కంపెనీ ఎఫ్ఈవో ఖాతాలో వేసేసింది. విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీలో డబ్బులు చెల్లించాలంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ(RBI) అనుమతి తీసుకునేకన్నా ముందు తెలంగాణా ఆర్ధికశాఖ అనుమతి తర్వాత క్యాబినెట్ ఆమోదం అవసరం. అయితే ఆర్ధికశాఖ అనుమతి లేదు, క్యాబినెట్ ఆమోదం లేకుండానే, ఆర్బీఐకి తెలియకుండానే కోట్లాదిరూపాయలు హెచ్ఎండీఏ దేశందాటించేసింది. ఇన్నిరకాలుగా నిబంధనల అతిక్రమరణ, అవినీతి, క్విడ్ ప్రోకో వ్యవహారాలకు కారణం కాబట్టే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మీద ఏసీబీ, ఈడీలు కేసులు పెట్టి విచారణక నోటీసులు ఇచ్చింది.
తెలంగాణా నుండి వెళ్ళిన రు. 45 కోట్లు ముందు ఎఫ్ఈవో కంపెనీకి చేరి అక్కడినుండి గ్రీన్ కో కంపెనీ ఖాతాలో పడిందని రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. తన ఖాతాలో పడిన కోట్లాది రూపాయలనే గ్రీన్ కో కంపెనీ తిరిగి ఎలక్టోరల్ బాండ్ల రూపంలోకి మార్చి విరాళాలుగా బీఆర్ఎస్ కు అందించిందనేందుకు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రజాధనాన్ని మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అక్రమమార్గంలో దారిమళ్ళించి తిరిగి సొంతంచేసుకున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ వేరు కేసీఆర్ కుటుంబం వేరుకాదు. ప్రాంతీయపార్టీలన్నీ అధినేతల సొంత ఆస్తులే అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కాబట్టి బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న డబ్బు, పార్టీ పేరుతో ఉన్న ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబానికి చెందినవిగానే భావిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలకు, పార్టీల అధినేతల వైఖరికి బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం ఏమీ అతీతంకాదు.