Revanth Reddy | ‘మోదీకి చేతకానిది మా ప్రభుత్వం చేసింది’

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-12-04 14:24 GMT

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని, సీఎంగా లేదా పీఎంగా అయినా మోదీ(Modi).. ఒక్క ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అందించిన పాలనను, ఏడాదిగా కాంగ్రెస్(Congress) అందిస్తున్న పాలనను పోల్చుకోవాలని కోరారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనపై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని, దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల ఆశీస్సులతోనే ఒక సామాన్యుడు సీఎం అయ్యాడని, తెలంగాణను సాధించుకున్నది ఉద్యోగాల కోసమేనని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తేనే బీఆర్ఎస్ బెంబేలెత్తుతోందని, అందుకే విషప్రచారాన్ని ప్రారంభించిందని దుయ్యబట్టారు.

‘‘ఉద్యోగాల కోసమే ఖమ్మం జిల్లా పాల్వంచలో తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చాం. మోదీ.. సీఎం, పీఎంగా ఉంటూ గుజరాత్‌లో ఒక్క సంవత్సరంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మేము నియామక పత్రాలు అందించాం. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ సర్కారే అధికారంలోకి వస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణలో అత్యధికంగా వడ్లు పండించే జిల్లా పెద్దపల్లి జిల్లా. బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి రైతులను గిట్టుబాటు ధర అందలేదు. గజ్వేల్‌లోని తన పొలంలో ఎకరాకు రూ.కోటి సంపాదిస్తున్నానని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. పదేల్లు పాలించిన ఆయన ఎకరాకు రూ.కోటి ఎలా సంపాదించారో ఇప్పటి వరకు రైతన్నలకు చెప్పలేదు. ఆయన రహస్యం ఏంటో ఈరోజూకు అంతుచిక్కడం లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్. అదే విధంగా ఈ కార్యక్రమంలో గ్రూప్-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి.. నియామక పత్రాలు అందించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు.

Tags:    

Similar News