తెలంగాణ డాగ్ స్క్వాడ్‌లోని గోల్డీ,షైనీ పోలీసు జాగిలాలు ఏం చేశాయంటే...

తెలంగాణపోలీసు డాగ్ స్క్వాడ్‌కు చెందిన రెండు పోలీసు జాగిలాలు ఒకేరోజు మృత్యువాత పడ్డాయి.ఇవి మావోయిస్టులు పెట్టిన మందుపాతరల పసిగట్టి పెను ప్రమాదాలను నివారించాయి.

Update: 2024-09-12 03:58 GMT
పోలీసు జాగిలం షైనీకి పోలీసు అధికారుల శాల్యూట్

తెలంగాణ పోలీసు డాగ్ స్క్వాడ్‌లో ఒకే రోజు రెండు పోలీసు జాగిలాలు మరణించిన ఘటన పోలీసులను కలచివేసింది. నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని డాగ్ స్క్వాడ్‌లో విశిష్ఠ సేవలందించిన కె9 గోల్డీ పోలీసు జాగిలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో షైనీ పోలీసు జాగిలం మృత్యువాత పడ్డాయి.

నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ లో ఎనిమిదేళ్ల పాటు విశిష్ఠ సేవలందించిన గోల్డీ కే9 పోలీసు జాగిలం తీవ్ర అనారోగ్యంతో మరణించింది. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన గోల్డీ పోలీసు జాగిలం పనితీరులో 50 ఇతర పోలీసు జాగిలాల్లోనే ఉత్తమంగా నిలిచింది. మందుగుండు సామాగ్రిని గుర్తించడంలో విశేష అనుభవం ఉన్న గోల్టీ మృతి చెందడంతో నిజామాబాద్ పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాంకా ట్రంప్ పర్యటన, కే9 పోలీసు జాగిలం గోల్డీ
గోల్డీ 2017 గ్లోబల్ పారిశ్రామికవేత్తల సదస్సు, ఇవాంకా ట్రంప్ పర్యటనల్లో భద్రతా తనిఖీల్లో కీలక పాత్ర పోషించింది.ఎన్నెన్నో సేవలందించిన గోల్డీ తీవ్ర అనారోగ్యంతో మరణించడం బాధాకరమని ఈ జాగిలం హ్యాండ్లర్ పోలీసు కానిస్టేబుల్ ఆర్ మనోహర్ వ్యాఖ్యానించారు. పలు హై ఫ్రొఫైల్ ఈవెంట్ల భద్రతను పరీక్షించిన ఈ జాగిలం మృతి పట్ల నిజామాబాద్ పోలీసు కమిషనర్ కాల్మేష్ సింగనవార్, అదనపు పోలీసు కమిషనర్ బి కోటేశ్వరరావు, డాగ్ స్క్వాడ్ పోలీసులు సంతాపం తెలిపారు. పోలీసు గౌరవంతో గోల్డీకి పోలీసులు అంత్యక్రియలు చేశారు.



 


శిక్షణలో గోల్డీ ఫస్ట్
హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన షైనీ పోలీసు జాగిలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ జాగిలం 2016లో భద్రాద్రి కొత్తగూడెం డాగ్ స్క్వాడ్ లో చేరింది.

30 పేలుడు పదార్ధాలు గుర్తించిన షైనీ
పోలీసు డాగ్ స్క్వాడ్ లో 8 ఏళ్ల పాటు సేవలందించిన షైనీ 30 పేలుడు పదార్థాలను గుర్తించింది. వీఐపీల పర్యటనల్లో షైనీ సమర్ధంగా విధులు నిర్వర్తించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను ఇది గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించింది.

మందుగుండు సామాగ్రిని గుర్తిస్తున్న పోలీసు జాగిలం 


 మందుపాతరలను గుర్తించి...

చెర్ల, దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను షైనీ కనుగొంది. భద్రాచలం బస్టాండ్‌లో జిలెటిన్‌ స్టిక్స్‌ని, కొన్నేళ్ల క్రితం చెర్ల బస్‌స్టేషన్‌లో అమర్చిన ప్రెజర్ మైన్స్‌ను కూడా ఈ పోలీసు జాగిలం గుర్తించింది.భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల భద్రత కోసం పనిచేసిన పోలీసు బృందంలో షైనీ కీలకం.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది తరలింపు సమయంలో షైనీనే రూట్ క్లియరెన్స్ ఇచ్చింది.

బ్లడ్ కేన్సరుతో షైనీ మృతి
కొత్తగూడెం పోలీసు జాగిలం షైనీకి గత నెలరోజుల క్రితం బ్లడ్ కేన్సర్ వ్యాధి సోకింది. చికిత్స చేయించినా షైనీ కోలుకోలేకోలేదు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం షైనీ మరణించింది.

షైనీ అంతిమ యాత్ర, ఘన నివాళులు
షైనీ కళేబరానికి పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షైనీ సేవలను గుర్తు చేసుకున్నారు.విశ్వాసానికి మారుపేరు అయిన షైనీ మందుగుండు సామాగ్రిని గుర్తించి పెద్ద ప్రమాదాలను నివారించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. షైనీ మృతి డాగ్ స్క్వాడ్ కు తీరని లోటని అదనపు ఎస్పీ పంకజ్ పరితోష్ వ్యాఖ్యానించారు.పోలీసు జాగిలం కళేబరాన్ని ఊరేగింపుగా పోలీసులు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు తీసుకువచ్చి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.




Tags:    

Similar News