గ్రూప్ 1 కు రెడీయా, లోక్ సభ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్?

రెండు సంవత్సరాలుగా తెలంగాణలో నలుగుతున్న గ్రూప్ 1 వివాదం కొలిక్కి తేవడానికి ప్రభుత్వం సిద్దమైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే గ్రూప్ 1 ప్రకటన రానుంది.

Update: 2024-02-12 07:06 GMT

గత రెండు సంవత్సరాలుగా పేపర్ లీక్ లు, రద్దులతో నలిగిపోతున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఓ కొలిక్కి తేవడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు రద్దు చేసిన ప్రిలిమ్స్ పై టీఎస్ఫీఎస్సీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేసును వెనక్కి తీసుకోవడానికి కమిషన్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఈ నెల 18న విచారణకు రానుంది. దీనిపై సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది.

ఓఎంఆర్ షీట్ల సంఖ్య ఎక్కువ రావడం

తెలంగాణ సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా టీఎస్పీపీఎస్సీ రెండో సారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను తప్పుపట్టాయి. కమిషన్ తను తీసుకొచ్చిన నిబంధనలను తానే ఉల్లంఘించడం ఏంటని ప్రశ్నించింది. మొదటి సారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకోవడం, రెండో సారి నిర్వహించిన పరీక్షలో అవేవీ లేకుండా ఎందుకు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెండో సారి పరీక్ష నిర్వహించే సమయంలో కనీసం అనుబంధ నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష రద్దు కాకుండా ఉండేదని వ్యాఖ్యానించింది. ఓఎంఆర్ షీట్ లపై పేర్లు ఇతర వివరాలు ఉండడం వల్ల పరీక్ష కు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రాకుండా పోతే వృథా పోతున్నాయనే కమిషన్ వాదనలపై కూడా హైకోర్టు ఆక్షేపించింది. పరీక్ష కోసం అభ్యర్థులు చెల్లించిన వాటినే మీరు ఉపయోగిస్తున్నారు కానీ మీ సొంత డబ్బులు ఖర్చు చేయట్లేదని, మరీ అలాంటప్పుడు వృథా ఓఎంఆర్ లు అని ఎందుకు అంటున్నారని వ్యాఖ్యానించింది.

పరీక్ష నిర్వహించినప్పుడు ప్రకటించిన సంఖ్యకు, తరువాత కమిషన్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్యకు తేడాలున్నట్లు పలువురు అభ్యర్థులు చేసిన వాదనపై హైకోర్టు ఏకీభవించింది. నిబంధనలకు అనుగుణంగా నిర్వహించలేదని, అందువల్ల రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీనిపై కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా అక్కడా కూడా ప్రిలిమ్స్ రద్దు నిర్ణయం సబబే అని తీర్పు వచ్చింది. దీంతో న్యాయనిఫుణులతో మాట్లాడి సుప్రీంకోర్టులో టీఎస్సీపీఎస్సీ ఎస్ ఎల్ సీ దాఖలు చేసింది. ప్రస్తుతం దీనినే వెనక్కి తీసుకుంటామని కమిషన్ ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

సుప్రీంకోర్టు ఏమంటుంది?

మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలు 2024 కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ లోపే సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుని, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కమిషన్ పట్టుదలగా ఉంది. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా అదనంగా మరో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి, దానికి ప్రభుత్వం అనుకున్నట్లు కొత్త గా ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 60 పోస్టులను జత చేసుకోవచ్చని కొంతమంది న్యాయనిఫుణులు చెబుతున్న మాట. కొత్త నోటిఫికేషన్, సిలబస్ లో మార్పులు వంటివి చేస్తే ఈ లోపు ఎన్నికల ప్రకటన రావచ్చని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశంపై హైకోర్టు అడ్వకేట్ ఇ. రవీందర్ రెడ్డి ఫెడరల్ తో మాట్లాడారు. " గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల కన్నా, 250 ఓఎంఆర్ షీట్లు ఎక్కువగా రావడంతో హైకోర్టు పరీక్ష రద్దు చేసింది. తరువాత డివిజనల్ బెంచ్ కూడా ఇదే అంశంపై, పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

కమిషన్ సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించగా మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. తరువాత వచ్చిన ఎన్నికల కోడ్ తో అది పెండింగ్ లో పడింది. ప్రస్తుతం ఇదే నెల కేసు విత్ డ్రా కోసం కమిషన్ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అదే రోజు విత్ డ్రా అవుతుంది. ప్రాసెస్ అయ్యాక రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి మార్గం సుగమం అవుతుంది " అని ఆయన చెప్పారు. రెండో సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి, క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించలేరని, కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ కు ఎటువంటి అడ్డంకులు ఉండవని మరో ప్రశ్నకు సమాధానంగా న్యాయవాదీ ఇ. రవీందర్ రెడ్డి చెప్పారు. 

Tags:    

Similar News