KTR ACB probe|కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందా ?

విచారణపూర్తయి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటపుడు కేటీఆర్ పోలీసులపై రెచ్చిపోయారు.;

Update: 2025-01-10 04:08 GMT
KTR

సుమారు ఏడుగంటల విచారణ తర్వాత బయటకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనబడింది. ఫార్ములా ఈ కార్ కేసులో గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు కేటీఆర్(KTR) ను విచారించారు. మొహంలోని ఫ్రస్ట్రేషన్ను చూస్తే ఏసీబీ విచారణ(ACB Inquiry)లో ఏమి జరిగిందో అర్ధమైపోతోంది. విచారణపూర్తయి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటపుడు కేటీఆర్ పోలీసులపై రెచ్చిపోయారు. రోడ్డుమీద మీడియాతో మాట్లాడద్దన్నందుకు పోలీసులపైన మండిపోయారు. ‘మీకేంసమస్య..మీకేమిటి అభ్యంతరం..మీడియాతో మాట్లాడద్దని చెప్పటానికి మీరెవరు’ ? అంటు విరుచుకుపడ్డారు. విచారణలో ఏసీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేయటంతో ఆ కోపాన్ని మీడియా సమావేశంలో కేటీఆర్ బయటున్న పోలీసులపైన చూపారని అర్ధమవుతోంది.

ఇంతకీ కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారని సమాచారం. సమాధానాలు చెప్పలేకపోయారు కాబట్టి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలతో విసిగించినట్లు తెలుస్తోంది. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా బయటపడటంతో అవునని అంగీకరించలేక ఎదురుప్రశ్నలతో రెచ్చిపోయారు. ఉదాహరణకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు విదేశీకంపెనీకి నిధులు ఎలా బదిలీచేస్తారని అడిగిన ప్రశ్నకు ‘ఆ విషయాన్ని ఉన్నతాధికారులు చూసుకోవాలి నాకేమి సంబంధం’ అని ఎదురు ప్రశ్నించారు. రెండో ఉదాహరణ ‘ఒప్పందం నుండి తప్పుకున్న కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అప్పటి ముఖ్యకార్యదర్శి అర్వింద్ ఫైల్ పంపినపుడు ఎందుకు వద్ద’న్నారు ? అని అధికారులు అడిగారు. అయితే దానికి సరైన సమాధానం చెప్పకుండా ‘ఫార్ములా కార్ రేసు(Formula e Car Race)నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి పెంచాలని తాను అనుకుంటే మీరు బొక్కలు వెతకటం ఏమిటి’ ? అని మండిపోయినట్లు సమాచారం. క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధుల బదిలీ ఎలా చేశారన్న ప్రశ్నకు కూడా అడ్డదిడ్డమైన సమాధానమే చెప్పారు.

క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ ప్రభుత్వం రేసును రద్దు నిర్ణయం తీసుకుంది కదాని ఎదురు ప్రశ్నించారు. క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి(Revanth) మీద ఎందుకు కేసుపెట్టలేదని అధికారులను కేటీఆర్ ఉల్టాగా నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి నిర్ణయం అంటే క్యాబినెట్ నిర్ణయమనే అర్ధం. కానీ కేటీఆర్ నిర్ణయం క్యాబినెట్ నిర్ణయంకాదు. ఎందుకంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) ఉంటే కేటీఆర్ మంత్రి మాత్రమే. మంత్రిగా కేటీఆర్ తీసుకున్ననిర్ణయం క్యాబినెట్ నిర్ణయించినట్లు కాదు. కేసీఆర్ కొడుకు కాబట్టి కేటీఆర్ నిర్ణయాన్ని ఇతర మంత్రులెవరు ప్రశ్నించకపోవచ్చు. అంతమాత్రాన కేటీఆర్ తీసుకున్న నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం అయిపోదు. నిధుల బదిలీ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి ఆమోదం తీసుకోకపోవటం కేటీఆర్ చేసిన తప్పు. నిధులబదిలీ నిర్ణయం కేటీఆర్లోని వైఖరిని చూపిస్తోంది. తాను నిధులబదిలీ చేస్తే అడిగేవారు ఎవరన్న అహంకారం స్పష్టంగా కనబడింది.

ముందురోజు ఏసీబీ విచారణలో అర్వింద్ చెప్పిన సమాధానమే కేటీఆర్లోని అహంకారాన్ని తెలియచేస్తోంది. నిధులబదిలీ విషయాన్ని కేటీఆర్ తో అర్వింద్ ప్రస్తావించినపుడు ‘మూడోసారి కూడా అధికారంలోకి వస్తాము కాబట్టి తాను చెప్పినట్లుగా చేయాల’ని కేటీఆర్ ఆదేశించారని అర్వింద్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, టెండర్లు పిలవకుండానే గ్రీన్ కో(GreenKo) కెంపెనీకి చెందిన ఏస్ జెన్ కంపెనీకి కాంట్రాక్టు ఏకపక్షంగా కట్టబెట్టడం లాంటి అనేక ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇవ్వకుండా అడ్డదిడ్డంగా ఎదురు ప్రశ్నలతో విసిగించినట్లు సమాచారం. కొన్నిప్రశ్నలు వేసినపుడు ‘పనికిరాని కేసు..నన్ను ఎందుకు వెంటాడుతున్నార’ని తీవ్రంగా నిలదీసినట్లు తెలిసింది. ప్రశ్నలతో విసిగిపోయిన కేటీఆర్ ఒకదశలో ‘తనను అరెస్టుచేసుకుంటే చేసుకోండి కాని ఇలా ప్రశ్నలతో విసిగించవద్ద’ని గట్టిగా అరిచారని సమాచారం.

ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం అడిగిన ప్రశ్నల్లో చాలావాటికి కేటీఆర్ సరైన సమాధానాలు ఇవ్వలేదు కాబట్టి సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి ప్రశ్నించాలని డిసైడ్ అయ్యారు. పండుగ తర్వాత విచారణలో కేటీఆర్ ను విడిగా ప్రశ్నిస్తారా ? లేకపోతే నిధుల బదిలీలో కీలకపాత్రపోషించిన అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డితో కలిపి ముగ్గురినీ ఒకేసారి విచారిస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News