తెలంగాణ దివాలా తీసిందా ?
అప్పులు కట్టలేక ఒక కుటుంబం ఏ విధంగా అయితే దివాలాతీస్తుందో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా అలాగే ఉందని ప్రకటించారు;
తెలంగాణ ప్రభుత్వం దివాలాతీసిందా ? ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనించిన తర్వాత అందరిలోను ఇవే ఆలోచనలు పెరిగిపోతున్నాయి. పోలీసుశాఖ నిర్వహించిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతు ఆర్ధికపరిస్ధితి చితికిపోయి, అప్పులు కట్టలేక ఒక కుటుంబం ఏ విధంగా అయితే దివాలాతీస్తుందో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా అలాగే ఉందని ప్రకటించారు. రేవంత్ తాజా ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం దివాలాతీసిందా(Telangana bankrupt) అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ల సాధనకు ఆర్టీసీ ఉద్యోగులు(TGRTC) సమ్మెచేయాలన్న పిలుపుకు రేవంత్ స్పందిస్తు తెలంగాణకు రూపాయి కూడా ఎక్కడా అప్పుపుట్టడంలేదన్నారు. కేసీఆర్ చేసిన లక్షల కోట్లరూపాయల అప్పుల వల్లే తెలంగాణకు ఇపుడీ దుస్ధితి వచ్చిందని రేవంత్ ఆవేధన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి ఏమాత్రం బాగాలేనపుడు డిమాండ్ల సాధనకు సమ్మెచేయాలని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పిలుపివ్వటం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వం నడవాలంటే ప్రతినెలా రు. 22 వేల కోట్లు అవసరమైతే వస్తున్న ఆదాయం రు. 18500 కోట్లు మాత్రమే అన్నారు. ఎన్నిమార్గాల్లో ప్రయత్నంచేస్తున్నా రు. 18,500 కోట్లకు మించి ప్రభుత్వానికి ఆదాయం రావటంలేదని చెప్పారు. అప్పులకోసం వెళుతుంటే బ్యాంకర్లు తెలంగాణ ప్రతినిధులను దొంగలను చూసినట్లు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్(KCR) హాయంలో జరిగిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలకే ఆదాయం సరిపోతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంచేసిన రు. 8.29 లక్షల కోట్ల అప్పులవల్లే ఇపుడు తిప్పలని రేవంత్(Rvanth) చెప్పారు.
రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని దాచిపెట్టుకోవాల్సిన అవసరం తమకులేదన్నారు. అందుకనే ఉద్యోగులకు, ఉద్యోగసంఘా నేతలతో పాటు ప్రజలకు కూడా ఆర్ధిక పరిస్ధితిని వివరిస్తున్నట్లు రేవంత్ పదేపదే చెబుతున్నారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు సమ్మెచేస్తే మొత్తం వ్యవస్ధ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అదనపు ఆదాయం కోసం తననుకోసినా ఒక్కరూపాయికూడా రావటంలేదన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటానికి డబ్బులు లేకే కసీఆర్ ఉద్యోగుల విరమణ వయసును పెంచినట్లు వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రు. 8500 కోట్లు కూడా కేసీఆర్ బాకీపెట్టి అధికారంలోనుండి దిగిపోయినట్లు రేవంత్ మండిపడ్డాడు. ఆర్ధికపరిస్ధితి ఇంతఘోరంగా ఉన్నా వస్తున్న ఆదాయంలో నుండే తామిచ్చిన హామీలను, ఉద్యోగుల జీత, బత్యాలను చెల్లిస్తున్నట్లు చెప్పాడు. కొన్ని రాజకీయపార్టీల మాయలో ఉద్యోగసంఘాలు పడిపోయి ప్రభుత్వంపై సమరమే అని పిలుపివ్వటాన్ని తప్పుపట్టారు. ఎవరిపైన ఉద్యోగులు సమరంచేస్తారని నిలదీశారు. పెన్షన్లు, పథకాలు, అభివృద్ధిని ఆపేసి బోనసులు తీసుకుంటాము, జీతాలు పెంచుకుంటామని, తాము తినగా మిగిలినదే ఇస్తామని ఉద్యోగసంఘాల నేతలు ప్రజలకు చెబుతారా అని సవాలు విసిరారు. ఇవేవీ కాకపోతే ఉప్పులు, పప్పులు, నూనెలు, చింతపండు ధరలను రెండింతలు చేసి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుందామా చెప్పండని ఉద్యోగులసంఘాల నేతలను రేవంత్ అడిగాడు.
స్వీయనియంత్రణ లేకపోతే తెలంగాణ ఆర్ధికపరిస్ధితి బాగుపడదని రేవంత్ తేల్చిచెప్పారు. ప్రత్యేక విమానంలో కాకుండా తాను అందరితోను కలిసి మామూలు విమానంలోనే వెళుతున్న విషయాన్ని రేవంత్ చెప్పారు. తెలంగాణ వచ్చినపుడు నెలకు రు. 600 కోట్లున్న అప్పు ఇపుడు రు. 10 వేల కోట్లకు చేరినట్లు చెప్పాడు. అధికారంలో ఉన్నపుడే గచ్చిబౌలి, కొండపూర్, మాదాపూర్ భూములన్నింటినీ కేసీఆర్ అమ్మేసినట్లు ఆరోపించాడు. తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు గుంట భూమికూడా అమ్మలేదన్నారు. పాత అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించటానికే కొత్త అప్పులు చేయాల్సొస్తోందని రేవంత్ ఆవేధన వ్యక్తంచేశాడు. వస్తున్న ఆదాయంలోనే సంక్షేమపథకాలు, అభివృద్ధి, ఉద్యోగుల జీత, బత్యాలు, పెన్షన్లు చెల్లిస్తున్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశాడు. మొత్తానికి రేవంత్ తాజా ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం దివాలాతీసిందనే అనుమాలు పెరిగిపోతున్నాయి.