హైదరాబాద్ ఐటీ,ఫార్మా హబ్‌లో రియల్ బూమ్
హైదరాబాద్ ఐటీ, ఫార్మా హబ్‌లలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పురోగమిస్తోంది. కోకాపేట్, తెల్లాపూర్,బాచుపల్లిల్లో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరిగాయి.
By : The Federal
Update: 2024-08-30 22:11 GMT
కోకాపేటలో రియల్ ఎస్టేట్ ధరలు 33 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,000కి చేరాయి. ఈ సంవత్సరం జూన్ నాటికి చదరపు అడుగుకు దాదాపు రూ.6,750 ఉండేది. బాచుపల్లి చదరపు అడుగు ధర గతేడాది రూ.4,700 నుంచి ఈ ఏడాది రూ.5,800కి పెరిగింది.
- తెల్లాపూర్‌లోనూ రియల్ బూమ్ పెరిగింది. తెల్లాపూర్ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.7,350కి చేరుకుంది. తెల్లాపూర్ లో గతంలో చదరపు అడుగు ధర రూ.6,100 ఉండేది.
- హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కోకాపేట ప్రాంతంలో 33 శాతం రియల్ రంగంలో ధరలు పెరిగాయి. బాచుపల్లిలో 23 శాతం, తెల్లాపూర్ లో 20 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ నగరం రియల్ రంగంలో ముందడుగు వేస్తుందని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కోకాపేట వేగంగా అభివృద్ధి
కోకాపేట ప్రధాన ఐటి హబ్‌లకు సమీపంలో ఉంది. దీనికితోడు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా కనెక్టివిటీ ఉన్న కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా కోకాపేట మారింది. నాణ్యమైన గృహాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కోకాపేట ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, ఎత్తైన అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన విల్లాల నిర్మాణం సాగుతోంది.
తెల్లాపూర్ పురోగతి
తెల్లాపూర్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ హబ్‌కు సమీపంలో ఉంది. దీంతో తెల్లాపూర్ ప్రాంతంలో గృహాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు.తెల్లాపూర్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌తో సహా ఐటీ మేజర్‌ల క్యాంపస్‌లు తెల్లాపూర్ ప్రాంతాన్ని గృహనిర్మాణ అభివృద్ధికి దోహదపడ్డాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా కోరుకునే నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో ఒకటిగా తెల్లాపూర్ అభివృద్ధి చెందింది.
బాచుపల్లి ఫార్మా హబ్
బాచుపల్లి ప్రముఖ ఫార్మాస్యూటికల్ హబ్ గా మారింది. ఈ ప్రాంతం ప్రపంచ ఫార్మా తయారీదారుల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు నిలయంగా ఉంది. గత ఏడాది కాలంలో 23 శాతం రియల్ ధర పెరిగింది. కోకాపేటలో ధర 89 శాతం మేర పెరిగింది. ఐదేళ్లలో కోకాపేటలో పలు అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణం జరిగింది.రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర గల యూనిట్లు కూడా విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట, బాచుపల్లి, తెల్లాపూర్ టాప్ టెన్ మైక్రో మార్కెట్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.