కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం రికార్డు ఒకటి ఎదురుచూస్తోందా ?
దేశచరిత్రలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కుటుంబంలోని ముగ్గురూ ఆరోపణలను ఎదుర్కొంటున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమేనేమో;
కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్, కేటీఆర్, కవితలపైన చాలా ఆరోపణలున్నాయి. అధికార దుర్వినియోగం, అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలకు కొదవలేదు. వీరిలో కేటీఆర్, కవిత విచారణలు ఎదుర్కోగా కవిత జైలుకు కూడా వెళ్ళి బెయిల్ పైన తిరుగుతున్నారు. దేశచరిత్రలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కుటుంబంలోని ముగ్గురూ ఆరోపణలను ఎదుర్కొంటున్న కుటుంబాల జాబితాలోకి కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కబోతున్నది. కుటుంబంలో ఉన్న ముగ్గురిలో ఇద్దరు విచారణలు ఎదుర్కోగా ఇందులో కూడా ఒకరు జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ రంగంలో అవినీతిపై కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను కేసీఆర్ జూన్ 5వ తేదీన హాజరవ్వాల్సుంది. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race)లో అవినీతిపై కేటీఆర్ మీద ఏసీబీ, ఈడీలు కేసులు నమోదు చేసి ఇప్పటికే రెండేసి సార్లు విచారణ కూడా జరిపాయి. ఫైనల్ గా కవిత(Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో విచారణను ఎదుర్కొని, అరెస్టయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఆరుమాసాలుండి బెయిల్ పై విడుదలయ్యారు.
ముఖ్యమంత్రిగా చేసిన నేత వారసులంతా కేసుల్లో ఇరుక్కోవడం విచిత్రం. ముఖ్యమంత్రులుగా పనిచేసిన చాలామందిపైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో తాము మాత్రమే విచారణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఒకరిద్దరు వారసులపైన కూడా అవినీతి ఆరోపణలు రావటంతో విచారణను ఎదుర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ళపాలనలో చాలాఆరోపణలున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, విద్యుత్ రంగంలో అవినీతి, అవకతవకలు బాగా హైలైట్ అయ్యాయి. అందుకనే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం విచారణకు రెండు కమిషన్లను నియమించింది. విద్యుత్ రంగంలో అవినీతిపై విచారణ జరిపిన జఃస్టిస్ మదన్ బీ లోకూర్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి కమిషనే విద్యుత్ రంగంలోని అవినీతిపై విచారణ జరిపింది. నరసింహారెడ్డి కమిషన్ తనకు నోటీసులు జారీచేయటాన్ని కేసీఆర్ సవాలుచేసిన తర్వాత జరిగిన పరిణామాలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఛైర్మన్ గా రాజీనామాచేయటంతో ప్రభుత్వం ఛైర్మన్ గా జస్టిస్ మదన్ బీ లోకూర్ ను ఛైర్మన్ గా నియమించింది. తననివేదికలో కేసీఆర్ పైన వచ్చిన ఆరోపణలపై మదన్ బీ లోకూర్ ఏమని సిఫారసుచేశారో ఎవరికీ తెలీదు. ప్రభుత్వం కూడా ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించినట్లు లేదు. ఇపుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ జూన్ 5వ తేదీన విచాణకు రావాలని కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీచేసింది. మరి కేసీఆర్ ఏమిచేస్తారో చూడాలి. ప్రతిరోజు హరీష్ రావుతో అయితే భేటీలు జరుపటమే కాకుండా న్యాయనిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇక కొడుకు కేటీఆర్(KTR) ఫార్ములా కార్ రేసు అవినీతిలో ఇరుక్కున్నారు. ఫార్ముల కార్ రేసు నిర్వహణ కోసం క్యాబినెట్ అనుమతి లేకుండా, ప్రభుత్వ ఆమోదంలేకుండానే బ్రిటన్ లోని ఫార్ముల వన్ కంపెనీకి కేటీఆర్ రు. 45 కోట్లు చెల్లించేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పకుండా బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్లు జరిమానా విధించింది. కేటీఆర్ చేసిన అధికారదుర్వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం జరిమానా చెల్లించటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయమై ఏసీబీ, ఈడీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పైన కేసులు నమోదుచేసి రెండుసార్లు విచారణలు కూడా జరిపాయి. విచారణ జరిగికూడా సుమారు రెండు నెలలు దాటినా దర్యాప్తుసంస్ధలు కేటీఆర్ పైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇదిలాగుంటే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు ఇరుక్కున్నారు. కవితను లిక్కర్ స్కామ్ లో ఈడీ, సీబీఐలు విచారించాయి. సౌత్ గ్రూప్ తరపున స్కామ్ లో కీలకవ్యక్తిగా ఈడీ, సీబీఐలు చార్జిషీట్లలో చాలాసార్లు కవిత పేరును ప్రస్తావించటమే కాకుండా ఆధారాలను కూడా చూపించాయి. అందుకనే అరెస్టయిన కవితను రౌస్ ఎవిన్యు కోర్టు తీహార్ జైలుకు పంపించింది. ఆరుమాసాలు తీహార్ జైలులో ఉన్న కవిత అతికష్టంమీద బెయిల్ పైన బయటతిరుగుతున్నారు. కేసులు నమోదై విచారణలు ఎదుర్కోవటం, జైలుకు వెళ్ళటంలో తండ్రి, సోదరుడికన్నా కవిత చాలా జోరుమీదున్నారు. ఫార్ములా 1 కేసులో కేటీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పక్కా ఆధారాలున్నాయని ఏసీబీ, ఈడీ అధికారులు చాలా స్పష్టంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మరి తదుపరి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలోనే కేసీఆర్ విచారణకు హాజరవ్వాల్సిన రోజు దగ్గరకు వచ్చేస్తోంది. కేసీఆర్ గనుక విచారణకు హాజరైతే కల్వకుంట్ల కుటుంబంలోని ముగ్గురు యాక్టివ్ పాలిటీషియన్లూ అవినీతి, అధికారదుర్వినియోగంపై విచారణలు ఎదుర్కొన్న రికార్డును సృష్టిస్తారేమో చూడాలి.