కవిత పార్టీలో చేరేది వారేనా..!
కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి.;
‘బీఆర్ఎస్ కవిత కొత్త పార్టీ దిశగా నడుస్తున్నారు. బీఆర్ఎస్‌కు బైబై చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు కూడా చేశారు. కొత్త పార్టీ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు పేర్లను ఫైనలైజ్ చేశారు. జూన్ 2 నాటికి వాటిలో ఒక పేరును ఫిక్స్ చేసి కొత్త పార్టీని ప్రకటిస్తారు. కవిత లేఖతో బీఆర్ఎస్ మూడు ముక్కలు కానుంది’ కొన్ని రోజులుగా తెలంగాణను ఓ ఊపుఊపేస్తున్న వార్తలివి. కేసీఆర్‌కు కవిత రాసిన ఆరు పేజీల లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి ఇదే చర్చ నడుస్తోంది. లేఖ తానే రాశానని, కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తలు వాస్తవాలని చాలా మంది గట్టిగా నమ్మారు. కారు(బీఆర్ఎస్) దిగేయడానికి కవిత రెడీ అయిపోయారని చాలా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
అయితే కవిత వేరే పార్టీలో చేరే ఆలోచనలో లేరని, కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్న చర్చలు తీవ్రతరం అవుతున్న క్రమంలో వీటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. కవిత కొత్త పార్టీ అంతా ఊహాగానాలే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి అని కూడా అన్నారు. ‘‘కవిత పార్టీ ఊహగానాలే. పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుతాం. మా బాస్ కేసీఆరే.. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు. కేటీఆర్ మాటల తో ఏకీభవిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
వాళ్లతోనే కవిత కొత్త పార్టీ..!
కేసీఆర్‌కు రాసిన ఆరుపేజీల లేఖలో చాలా మంది నేతలు, కార్యకర్తలు అసంతప్తిగా ఉన్నారని కవిత పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కీలక విషయాల్లో పార్టీ తన వైఖరిని ప్రకటించకపోవడంపై చాలా మంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని కవిత స్పష్టం చెప్పింది. అంతేకాకుండా పార్టీ టికెట్లు పంచడం, పాత ఇన్‌ఛార్జ్‌లకే మళ్ళీ అవకాశం కల్పించడం ఇలా అనేక విషయాలను కవిత తన లేఖలో పొందుపరిచారు. ఇప్పుడు కవిత కొత్త పార్టీ ప్లాన్‌లో ఉన్న క్రమంలో ఆ దిశగా కవితతో కలిసి సాగనున్న నేతలు ఈ అసంతృప్తి నేతలే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. వారికి నాయకత్వం వహిస్తూ ఇప్పటికే కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ కూడా రాసింది. ఆ లేఖ తానే రాశానని బహిరంగం ప్రకటించడమే కాకుండా, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో అసంతప్తి నేతలతో పార్టీ స్థాపనకు కవిత పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారన్న చర్చ బలం పుంజుకుంటుంది.
నేతలు డైలమాలో ఉన్నారా..!
బీఆర్ఎస్‌లో చీలికలు మొదలయ్యాయని, కవిత కొత్త పార్టీ పెట్టనున్నారన్న వార్తలు వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు సందిగ్దంలో ఉన్నారన్న చర్చ కూడా జోరందుకుంటుంది. ఈ క్రమంలోనే అసంతప్తి నేతలు సహా మిగిలిన నేతల్లో కూడా కొందరు డైలమాలో పడ్డట్లు సమాచారం. కవిత కొత్త పార్టీ అంటే.. అందులో చేరాలా, లేదంటే బీఆర్ఎస్‌లోనే కొనసాగాలా అని అంతర్గత చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కవిత, ఆమె లేఖ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు స్తబ్దుగా ఉన్నారని పలువురు విశ్లేకులు చెప్తున్నారు. ఒకరిద్దరు స్పందించినా వాళ్లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్తున్నారని, భవిష్యత్తులో ఏమైనా రెండు వైపులా తమకు అవకాశాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, అందుకు గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని అంటున్నారు. ఆయన కవిత పార్టీ ఊహాగానాలు అని అనడంతో పాటు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడతామని చెప్పారు. వెంటనే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని, కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నానని చెప్తూ అటు కవిత, ఇటు కేటీఆర్ ఇద్దరినీ మ్యానేజ్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.