కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ ను ఇరికించింది ఎవరు ?
కాళేశ్వరంకు సంబంధించిన ఫైళ్ళన్ని నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దగ్గరకే వస్తున్నాయని తాను 2016లోనే సోదరుడు కేటీఆర్(KTR) ను హెచ్చరించినట్లు చెప్పారు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ ను ప్లాన్ చేసి మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు ఇరికించారా ? కల్వకుంట్ల కవిత తాజా ఆరోపణలతో అందరిలోను ఇవే అనుమానాలు పెరుగుతున్నాయి. కవిత ఏమన్నారంటే కాళేశ్వరంకు సంబంధించిన ఫైళ్ళన్ని నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దగ్గరకే వస్తున్నాయని తాను 2016లోనే సోదరుడు కేటీఆర్(KTR) ను హెచ్చరించినట్లు చెప్పారు. అంటే కవిత(Kavitha) మాటల ప్రకారం అర్ధమవుతున్నది ఏమిటంటే 2016 నుండే కాళేశ్వరం(Kaleshwaram Corruption)లో అవినీతి జరగుతున్నట్లు. సంతకాల కోసం ఉన్నతాధికారుల దగ్గర నుండి ఫైళ్ళు నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలాగ వస్తాయి ? మధ్యలో మంత్రి హరీష్(Harish) ఉన్నాడు కదాని తాను కేటీఆర్ ను అడిగినట్లు బయటపెట్టారు. అయితే అప్పట్లో తాను చెప్పిన విషయాలను, లేవనెత్తిన అంశాలను ఎవరూ పట్టించుకోలేదట.
కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ తనరిపోర్టులో పేర్కొన్న అంశాలను గమనిస్తే అప్పట్లో జరిగిన కుట్ర అంతా అర్ధమవుతుందన్నారు. కమిషన్ రిపోర్టులో కాళేశ్వరం అవినీతిలో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అని ఘోష్ చెప్పిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ఫైళ్ళపైన మంత్రి సంతకంలేకుండా, ఉన్నతాధికారుల సంతకాలు లేకుండా అన్నీచోట్లా కేసీఆర్ సంతకాలే ఉండటంతో జస్టిస్ ఘోష్ ఆ అభిప్రాయానికి వచ్చి అవినీతికి కేసీఆరే బాధ్యుడని తేల్చేసినట్లు కవిత చెప్పారు.
ఇపుడు కాళేశ్వరం అవినీతిలో తప్పంతా హరీష్ ది మాత్రమే అని కేసీఆర్ ఉత్త అమాయకుడు అని కవిత చెబుతున్న మాటలను ఎవరూ నమ్మటంలేదు. ఎందుకంటే ఫైళ్ళపైన గుడ్డిగా సంతకాలు పెట్టేసేంత అమాయకుడు కాదు కేసీఆర్ అన్న విషయం అందరికీ తెలుసు. మెజారిటి ప్రజానీకం కాళేశ్వరం అవినీతి కేసీఆర్ కు తెలిసే జరిగిందని గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ కు తెలీకుండా ఏ ప్రాజెక్టులో కాని ఏ శాఖలో కాని అవినీతి, అక్రమాలు జరిగే ఛాన్సేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఫైళ్ళపై కిందస్ధాయి అధికారుల సంతకాలు కూడా లేకుండానే కేసీఆర్ సంతకాలు చేయించారని చెప్పటంలో అర్ధంలేదు.
ఎందుకంటే కిందస్ధాయి అధికారులే కాదు చివరకు కొందరు చీఫ్ ఇంజనీర్లు కూడా ఏమిచెప్పారంటే ప్రాజెక్టు నిర్మాణంలోని చాలా అంశాల్లో తమకు సమాచారమే లేదన్నారు. అంతా ముఖ్యమంత్రి కార్యాలయమే చూసుకుందని కదా ఘోష్ కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలుచేశారు. నిర్మాణ కంపెనీ ప్రతినిధులు, మురళీధరరరావు లాంటి ఒకరిద్దరు అధికారులను దగ్గర పెట్టుకుని కేసీఆర్ తనిష్టారాజ్యంగా చేసుకున్నారని అర్ధమవుతోంది. అందుకనే చివరకు ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయింది. హోలు మొత్తంమీద గమనించాల్సిన విషయం ఏమిటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవమే అని కేసీఆర్ కూతురు కవిత స్పష్టంగా అంగీకరించారు.