‘ప్రభాకర్ రావు సహకరించట్లేదు’
ఆయన మధ్యంతర బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలన్న సొలిసిటర్ జనరల్.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన కేసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, ఈ నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు. ఇప్పటికే ఒకసారి ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆయన విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, ఈ నేపథ్యంలోనే బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.
చాలా విషయాలపై దర్యాప్తు చేయాలి..
‘‘ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన ల్యాప్‌టప్, కంప్యూటర్ల పాస్‌వర్డ్ చెప్పడానికి ప్రభాకర్ రావు సహకరించడం లేదు’’ అని ఎస్‌జీ తుషార్ మెహతా చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది సిద్దార్థ మల్హోథ్రా కోరారు. కోర్టు నోటీసులు జారీ చేసినా.. రాష్ట్రానికి రాకుండా ఆయన మరో ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. అధికారికంగా ఆయనకు ఇచ్చిన ల్యాప్‌టప్, కంప్యూటర్, మొబైళ్లను ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశారని ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టమైందని ప్రభుత్వం.. కోర్టుకు వివరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ తొలగించే ప్రయత్నాలు చేశారని తెలిపింది.
డేటా మొత్తం డిలీట్..
‘‘ఏ ప్రశ్న అడిగినా గుర్తు లేదు.. తెలియదు అంటూ దాటవేసే తరహాలో సమాధానాలు చెప్తున్నారు. ఆయన దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదు. ప్రభుత్వం మారనిప్పుడు అధికారులు తమకు ఇచ్చిన పరికరాలను యథావిధిగా ఇవ్వాలన్న నియమాలు ఉన్నాయి. కానీ ఆయన వాటన్నింటినీ తుంగలో తొక్కి.. అన్ని పరికరాల నుంచి డేటాను తొలగించారు’’ అని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వివరించారు.
కాగా అధికారులు పిలిచిన ప్రతిసారీ ప్రభాకర్ రావు.. విచారణకు హాజరై తన పూర్తి సహకారం అందించారిన ఆయన తరపు న్యాయవాది శేషాద్రినాయుడు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును అధికారులు 15సార్లు విచారణకు పిలిచారని వివరించారు. ఆయనను రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని, ప్రతి ఒక్కరినీ పిలిచి ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా మధ్యంతర బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాస్థానం కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. అనంతరం విచారణను రెండు వారాల తర్వాతకు వచ్చే నెల 8కి వాయిదా వేసింది.