ముగిసిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం, ఎవరి పరిస్ధితి ఏమిటి ?
ముగ్గురు అభ్యర్ధుల్లో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి
హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. దాదాపు మూడువారాలు ఉపఎన్నికల ప్రచారంతో నియోజకవర్గం హోరెత్తిపోయింది. మూడు ప్రధానపార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్ధులు, వారి తరపున పార్టీల్లోని స్టార్ క్యాంపెయినర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉధృతమైన ప్రచారంచేశారు. కాంగ్రెస్ తరపున వల్లాల నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నారు. వీరుకాకుండా ఇతరపార్టీల తరపున మరికొందరు అభ్యర్ధులు, స్వతంత్రులు అందరు కలిసి 55 మంది పోటీలో ఉన్నారు. అంటే ప్రధాన పార్టీలు, వివిధ పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెంట్లు కలిసి 58 మంది రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో ఏడు డివిజన్లు షేక్ పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్ నగర్, వెంగళరావునగర్, యూసుఫ్ గూడ, సోమాజీగూడలోని కొంతప్రాంతం ఉంది. ఈ మొత్తం మీద 4.01 లక్షల ఓట్లున్నాయి.
కాలనీలు, బస్తీల కలయికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనిచెప్పాలి. మామూలుగా ఎవరైనా జూబ్లీహిల్స్ అనగానే అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లోని వీవీఐపీలుంటారని అనుకుంటారు. అయితే నియోజకవర్గానికి, జూబ్లీహిల్స్ అనే పేరుకు ఎలాంటి సంబంధంలేదు. పైన చెప్పుకున్న వారంతా జూబ్లీహిల్స్ లోనే ఉంటారనటంలో సందేహంలేదు. అయితే జూబ్లీహిల్స్ ప్రాంతం మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ ఏరియాతో ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అని ఎలా ఏర్పడిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గానికి, నియోజకవర్గం పేరుకు ఎలాంటి సంబంధంలేదన్న విషయం చాలామందికి తెలీదు.
నియోజకవర్గాల పునర్విభజనలో 2008లో ఈ నియజకవర్గం ఏర్పడితే 2009లో మొదటిసారి ఎన్నిక జరిగింది. మొదటి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి పీ విష్ణువర్ధనరెడ్డి గెలిచాడు. తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి మాగంటి గోపీనాధ్ గెలిచాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా గోపీ బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018, 2023 ఎన్నికల్లో గోపి బీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే గెలిచిన కొన్నినెలలకే మరణించటంతో ఇపుడు ఉపఎన్నిక అవసరమైంది. తమ సీటును నిలబెట్టుకోవాలంటే గెలవాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. అందుకనే సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఇంతగా పోరాటంచేస్తోంది. నోటిఫికేషన్ రాకముందే మాగంటిసునీతను అభ్యర్ధిగా ప్రకటించి, ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.
గ్రేటర్ పరిధిలో రెండోసీటును ఎలాగైనా గెలుచుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పట్టుదలమీదున్నారు. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సీనియర్ నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. రేవంత్ ఐదు రోడ్డుషోలు. ఒక బహిరంగసభలో పాల్గొన్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లోని ఇల్లిల్లు తిరిగి విస్తతంగా ప్రచారం చేశారు.
ఇక బీజేపీ తరపున కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ప్రచారంచేశారు. నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాతే బీజేపీ ప్రచారం మొదలైంది. ప్రచారంలో మూడుపార్టీల అగ్రనేతలు ఒకపార్టీకి మరోపార్టీతో రహస్య ఒప్పందాలున్నాయని, సర్దుబాట్లు జరిగాయని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. రేవంత్ తన ప్రచారంలో నాలుగు హామీలు ఉచితబస్సు, ఆరోగ్యశ్రీ సాయాన్ని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచటం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రు. 500కే సబ్సిడీ గ్యాస్ పథకాల అమలుపైనే ఎక్కువగా ప్రచారంచేశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, బీజేపీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం వివక్షపైనే విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ ప్రచారసరళి అంతా రేవంత్ ప్రభుత్వం వైఫల్యాలు, నియోజకవర్గం వెనుకబాటు, పేదల ఇళ్ళను హైడ్రా కూల్చేస్తోంది అనే జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల్లో కేంద్రప్రభుత్వం మీదకన్నా ఎక్కువగా రేవంత్ మీదే టార్గెట్ చేశారు.
బీజేపీ ప్రచారంలో ఎక్కువ ఆరోపణలు బీఆర్ఎస్ మీదే ఉన్నాయి. పదేళ్ళపాలనలో బీఆర్ఎస్ నియోజకవర్గానికి చేసిందేమీలేదంటు కిషన్, బండి ఇద్దరు పదేపదే ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే అంటు ధ్వజమెత్తారు. బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మూడు ప్రధానపార్టీలు, అభ్యర్ధుల ప్రచార హోరులో మిగిలిన పార్టీలు, అభ్యర్ధుల ప్రచారం ఎవరికీ వినబడలేదు, కనబడలేదు.
ఓటర్లు ఎంతమంది ?
నియోజకవర్గంలో 4.01 లక్షలమంది ఉన్నారు. వీరిలో బీసీలు, ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. బీసీ ఓటర్లు సుమారుగా 1.40 లక్షలుంటే ముస్లింల ఓట్లు 1.2 లక్షలున్నాయి. తర్వాత ఎస్సీ, రెడ్డి, కమ్మ, ఎస్టీ, క్రిస్తియన్ తదితర సామాజికవర్గాల ఓటర్లున్నారు. నియోజకవర్గంలో సుమారుగా 30 కాలనీలు, 70 బస్తీలున్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా మధ్య, దిగువ మధ్యతరగతి జనాలే ఉంటారు. అందుకనే రేవంత్ వ్యూహాత్మకంగా పైన చెప్పిన నాలుగు పథకాల అమలుగురించి మాత్రమే మాట్లాడింది.
బలాబలాలు
అభ్యర్ధుల బలాబలాలు చాలా సమీకరణలపై ఆధారాపడున్నాయి. నవీన్ బలం చూసుకుంటే మూడు అంశాలు ప్రధానంగా కనబడుతాయి. అవేమిటంటే నవీన్ యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. బీసీల్లో జూబ్లీహిల్స్ లో 35 వేలమంది యాదవులున్నారు. అలాగే ముస్లింల ఓట్లు 1.20 లక్షలున్నాయి. యాదవుల ఓట్లు, బీసీల్లోని ఇతర సామాజికవర్గం ఓట్లు, ముస్లింల ఓట్లలో మెజారిటిపడితే నవీన్ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. కాంగ్రెస్ ఆశలన్నీ పైన చెప్పిన నాలుగు పథకాల లబ్దిదారుల ఓట్లపైనే. అధికారంలో ఉండటం, యావత్ మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల ప్రచారం అదనపు బలమనే చెప్పాలి.
ఇదేసమయంలో మాగంటి సునీతకు ప్లస్సులు, మైనస్సులు కొన్నున్నాయి. ప్లస్సులు ఏమిటంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపుకు వ్యక్తిగత ప్రతిష్టకు పరీక్ష. అందుకనే దాదాపు నెలరోజులుగా సునీతతో పాటు ప్రచారంచేస్తున్నారు. రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో విస్తృతంగా ప్రచారంచేశారు. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని నియోజకవర్గంలో దింపేశారు. ప్రభుత్వ వ్యతిరక ఓట్లు, హైడ్రా బాధితుల ఓట్లు, ముస్లిం ఓట్లు, బస్తీల్లోని ఓట్లు తమకే పడతాయని, గోపీ మరణంతాలూకు సింపథినే సునీతను గెలిపిస్తుందని కేటీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక బీజేపీ విషయం చూస్తే లంకల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లో కూడా పోటిచేశారు. అప్పట్లో లంకలకు సుమారు 26 వేల ఓట్లొచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మీద వ్యతిరేకత ఓట్లన్నీ తనకే పడతాయని, నరేంద్రమోడీ ఛరిష్మా తనను గెలిపిస్తుందని దీపక్ బాగా నమ్మకంతో ఉన్నాడు. మొత్తంమీద కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారంతో పోల్చితే బీజేపీ వెనుకబడిందనే చెప్పాలి.
మైనస్సులు లేవా ?
ఎందుకు లేవు కావాల్సినన్ని మైనస్సులున్నాయి అభ్యర్ధులపైన. నవీన్ పైన రౌడీషీటర్ అనే పెద్ద మైనస్ ఉంది. నవీన్ పైన ఏడు కేసులున్నాయని బీఆర్ఎస్ బాగా ప్రచారంచేస్తోంది. అభ్యర్ధి తండ్రి చిన శ్రీశైలం రౌడీషీటర్ అంటు కేటీఆర్, కారుపార్టీ నేతలు బాగా ప్రచారంచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిది సెటిల్మెంట్ల బ్యాచ్ అంటు కేటీఆర్ ఎద్దేవాచేశారు.
ఇక మాగంటిసునీతకు కుటుంబవివాదం బాగా మైనస్ అనేచెప్పాలి. నామినేషన్ ఓకే కాగానే గోపీ మొదటిభార్యను అంటు మాలినీదేవి, కొడుకనంటు తారక్ ప్రద్యుమ్న రంగంలోకి దిగారు. గోపీకి సునీతకు వివాహమే కాలేదని, వాళ్ళిద్దరు సహజీవనం చేశారని భార్య మాలినీ చేసిన ఆరోపణలు సునీతగురించి నెటిగివ్ గా జనాల్లోకి వెళ్ళింది. దీనికి అదనంగా గోపి తల్లి మహానందకుమారి సునీతతో పాటు కేటీఆర్ పైన తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. గోపి మరణంలో కేటీఆర్ కీలక పాత్రదారిగా మహానందకుమారి చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. సునీతను తన కొడుకు గోపి వివాహం చేసుకోలేదని తల్లి చెప్పటం బీఆర్ఎస్ క పెద్ద మైనస్ అనేచెప్పాలి. గోపి-సునీత-కేటీఆర్ వివాదాన్ని రేవంత్, బండి పదేపదే విస్తృతంగా చర్చల్లో పెట్టటంతో జనాలు బాగా చర్చించుకుంటున్నారు.
ప్రచారంలో బాగా వెనకబడటమే బీజేపీ అభ్యర్ధి దీపక్ కు అతిపెద్ద మైనస్. పైగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోని బండి సంజయ్ చాలారోజులు అసలు ప్రచారంలోకే దిగలేదు. ఏదో మొక్కుబడిగా బోరబండ, రహ్మత్ నగర్ లో మాత్రం కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. ప్రచారంలో జనాలను పెద్దగా ప్రభావం చూపగలిగిన నేతలు లేకపోవటం కూడా మైనస్ అనేచెప్పాలి.
పోలింగ్ స్టేషన్లు
ఏడు డివిజన్లలోని 4.01 లక్షల ఓటర్ల కోసం ఎన్నికల కమీషన్ 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు 986 మంది ఓట్లు వేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఈనెల 11వ తేదీన జరగబోయే పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలక ముగుస్తుంది. పోలింగ్ ముగిసేసమయానికి ఎంతమంది ఓటర్లు క్యూలైన్లో ఉంటారో వారంతా ఓట్లేసేంతవరకు పోలింగ్ కు అనుమతిస్తారు. 2023 ఎన్నికల్లో పోలింగ్ 48 శాతం జరిగింది. 4.01 లక్షల ఓట్లలో పురుషులు 2,08,561 మంది, మహిళా ఓటర్లు 1,92,779 మంది ఉన్నారు.