ఖానాపూర్‌లో కోతి చేష్టలు, ప్రజలు లబో దిబో

ఇంటి వరండా నుంచి స్కూల్ వరకు… ఖానాపూర్‌లో కోతులు చెలరేగుతున్నాయి.

Update: 2025-11-09 06:03 GMT
ఖానాపూర్ పట్టణ వీధుల్లో వానరాల మూకలు...

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కోతుల గుంపులు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న ఖానాపూర్ పట్టణం లోకి వేలాది కోతులు వస్తూనే ఉన్నాయి. పట్ణంలో ఎటు చూసినా వానర మూకలే కనిపిస్తున్నాయి.మార్కెట్ కు వెళ్లి కూరగాయలు, పండ్లు కొని సంచిలో తీసుకువస్తుంటే కోతుల దండు చుట్టుముట్టి ఆ సంచిని లాక్కెళుతున్నాయి...పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై వానర మూకలు దాడి చేసి కరుస్తున్నాయి...ఇంట్లో తలుపు తెరిస్తే చాలు కోతులు వచ్చి ఫ్రిడ్జిలో పెట్టిన ఆహార పదార్థాలను ఎత్తుకెళుతున్నాయి...వంటగదిలో వంట చేస్తుంటే చాలు మూకుమ్మడిగా కోతులు వచ్చి వండిన ఆాహారపదార్థాలను ఎత్తుకెళుతున్నాయి...ఇంటి పెరట్లో పండ్ల చెట్లు ఉంటే కోతుల గుంపు చేరి పండ్లను తెంపుకెళుతున్నాయి...ఇదీ కోతుల కిష్కింధ కాండ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నెలకొన్న పరిస్థితి.నిర్మల్ జిల్లా రిజర్వ్ ఫారెస్టును ఆనుకొని కిలోమీటరు దూరంలో ఉన్న ఖానాపూర్ పట్టణంలో కోతుల బెడద సమస్యతో సతమతమవుతున్నామని ఖానాపూర్ పట్టణానికి చెందిన న్యాయవాది కల్వకుంట్ల వినయ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు ఆవేదనగా చెప్పారు.




కోతుల బెడదపై కన్నెర్ర చేసిన ఖానాపూర్ వాసులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో కోతుల గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేసి కరుస్తుండటంతో స్థానిక ప్రజలు కన్నెర్ర చేశారు. పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే కోతులు మీదపడి గీకుతున్నాయని స్థానికులు ఆవేదనగా చెప్పారు.



ఇంటి వరండాల్లో వంటలు చేయాలంటే కోతుల వల్ల ఆటంకం కలుగుతుందని, కోతుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని కోతుల ఉద్యమ కమిటీ నాయకుడు కె నారాయణ చెప్పారు. కోతుల బెడద వల్ల కనీసం తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు.కోతులు మందులను కూడా ఎత్తుకుపోతున్నాయని చెప్పారు. తాము కోతుల వల్ల బతకలేం...తినలేమని, నానా అవస్థలు పడుతున్నామని ఆయన చెప్పారు. కోతులను నివారించడంలో అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు.


ఎన్నెన్నో ఘటనలు...
-ఖానాపూర్ లో చేతి సంచితో రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి చేతిలోని సంచిని ఓ కోతి లాగబోయింది. అంతే కోతిని తరమబోతే అది కరిచింది. దీంతో సంచిని వదిలి ఆ వ్యక్తి పారిపోయాడు.
2024 అక్టోబరు 21 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనికి చెందిన బొంగోని లక్మి (52) ఇంటి ముందు కూర్చొని ఉంది. అటుగా వచ్చిన కోతులు మహిళను సమీపించడంతో భయపడి పరుగెత్తే ప్రయత్నం చేసింది. దీంతో కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ఆమెను స్తానిక హాస్పిటల్ కు తరలించారు.హాస్పిటల్లో ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీటి పర్యంత మయ్యారు.మృతురాలికి భర్త ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో వారు ఆవేదన చెందుతున్నారు.
2025 మే 31 ఖానాపూర్ మోఘల్ పురాలో నెమలిపై కోతులు వెంటపడ్డాయి. జామా మసీదులోకి వచ్చిన నెమలిని స్థానికులు కాపాడి, కోతులను తరిమారు.నెమలిని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
2024 ఆగస్టు 1 : ఖానాపూర్ మాజీ వార్డు సభ్యుడు ఎం రాధాపై కోతులు దాడి చేశాయి. కోతుల దాడిలో రాధా చేతికి గాయమైంది.
2023 మార్చి 18 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో ఉపాధ్యాయురాలు మంజులపై కోతి దాడి చేసింది. కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో మంజుల బండరాయిపై పడి గాయపడింది. గతంలో కోతుల దాడుల్లో అటెండర్ రాజన్న, వాచ్ మెన్ గాయపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులపై కోతులు దాడి చేయడం సాధారణ విషయంగా మారిందన్నారు.



 కోతులను తరలించాలని కోరుతూ భారీ ర్యాలీ

కోతుల బెడదతో విసిగి వేసారి పోయిన ఖానాపూర్ పట్టణ వాసులు కోతుల నివారణ ఉద్యమం చేపట్టారు.నవంబరు 4వతేదీన పట్టణ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి భారీ ర్యాలీ చేశారు.అధికారులు స్పందించి కోతులను తరలించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని, కలెక్టరు వచ్చి తమ సమస్యను పరిష్కరించే దాకా ఉద్యమిస్తామని ఖానాపూర్ పట్టణ కోతుల ఉద్యమ కమిటీ నాయకులు తెలిపారు. కోతులను తరలించాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ వీడీసీ సభ్యులు, కులసంఘాలు, డ్వాక్రా సంఘాలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మసీదు కమిటీ సభ్యులు, యువజన సంఘాలు, రాజకీయ నేతలు ఉద్యమ బాట పట్టారు.



 వినతిపత్రాలు

ఎన్టీఆర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీసి, కోతుల బెడదను తట్టుకోలేక పోతున్నామని, దీన్ని నివారించాలని కోరుతూ ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనరుకు,ఖానాపూర్ తహసీల్దారుకు వినతిపత్రాలు సమర్పించారు. ఖానాపూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా కోతులు అందరిపై స్వైర విహారం చేస్తున్నాయని, ఎంతోమంది కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోతుల కాటుల వల్ల సైతం తీవ్ర ఇబ్బందులు పడి ఆసుపత్రుల పాలవుతున్నామని స్థానిక ప్రజలు చెప్పారు. ఖానాపూర్ మున్సిపల్ అధికారులు ఇకనైనా ఈ ఘటనను చూసి కోతులను అదుపు చేయాలని ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకంఠంతో కోరారు.



 కోతుల బాధపై ఉద్యమ బాట

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. గుంపులుగుంపులుగా కోతులు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.,కోతుల దాడులతో వందలాది మంది గాయపడ్డారు. 100 మంది గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. రాత్రింబవళ్లు కోతుల కాపలా టీంలను పెట్టాల్సి వస్తుందని వారు చెప్పారు. వాహనచోదకులను సైతం కోతులు అడ్డుకుంటున్నాయి.దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోతుల నివారణ ఉద్యమ కమిటీ నేత కె నారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మంకీ రెస్క్యూ సెంటరు ఉన్నా...
నిర్మల్ లో మంకీ రెస్క్యూ సెంటరు ఉన్నా కోతులను పట్టుకునే వారే కరువయ్యారు.కోతులను పట్టి తీసుకువస్తే కోతుల సంఖ్య పెరగకుండా నివారించేలా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తామని నిర్మల్ కోతుల రక్షణ, పునరావాస కేంద్రం డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కానీ కోతులను పట్టుకునేందుకు ఎనిమల్ హ్యాండ్లర్లకు ఒక్కో కోతికి 500 నుంచి 800 రూపాయలు ఇవ్వాలి. మున్సిపాలిటీలో నిధులు లేక కోతులను పట్టించలేకపోతున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.దీంతో స్వైర విహారం చేస్తున్న కోతులు కరవడంతో బాధితులు నిర్మల్, భైంసా, ఖానాపూర్ ఆసుపత్రులకు వెళుతున్నారు. ఖానాపూర్ పరిసర ప్రాంతాలైన లక్ష్మణచాంద, మామడ, సారంగాపూర్, కడెం మండలాల్లో ఇళ్లపై, పంటలపై కోతుల దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

యాదాద్రి జిల్లాలో కోతుల దాడులు
యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5.17 లక్షలకు పైగా కోతులున్నాయని వ్యవసాయశాఖ అధికారుల సర్వేలోనే తేలింది.17 మండలాల్లో 3,773 కోతుల గుంపులున్నాయి ఒక్కో గుంపులో 30 కి తక్కువ కాకుండా కోతులున్నాయి. జిల్లా జనాభాలో 60 శాతానికి మించి కోతున్నాయని సర్వే తెలిపింది.రాజాపేట, గుండాల మండలాల్లో అధికంగా కోతులున్నాయి. 2024వ సంవత్సరంలో 2,429 మంది కోతుల దాడుల్లో గాయపడ్డారు. ఈ ఏడాది 10 నెలల్లో 4,983 మందిపై కోతులు దాడి చేశాయి. రోజుకు 16 మందికి పైగా కోతుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. గత ఏడాది కంటే కోతుల దాడిలో గాయపడిన వారి సంఖ్య రెట్టింపు అయింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 500కుపైగా కోతుల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి.

పలు జిల్లాల్లో కోతుల బెడద
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వానరాలు తరచూ దాడి చేస్తూ స్థానికులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. సుల్తానాబాద్ లోని గాంధీ నగర్ కు చెందిన అనుమాల బుచ్చయ్య తన ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా వానరం వచ్చి బుచ్చయ్య తలపై ఎక్కి కూర్చుంది.ఆయన తలపై కోతి కూర్చోవడంతో భయాందోళనకు గురయ్యాడు బుచ్చయ్య. స్థానికులు కూడా భయంతో వణికిపోయారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఉద్యోగులు విధుల్లో నిమగ్నమై ఉండగా ఓ కోతి వచ్చింది. దాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు.

కోతి కరిస్తే రేబిస్
కోతి కరిస్తే కుక్కలాగే రేబిస్ వ్యాధి వస్తుందని కోతి కరవడం వల్ల పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి శరీరంలోకి వచ్చి మెదడు, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. కోతి కరిచిన వెంటనే సబ్బుతో శుభ్రంగా కడిగి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వెటర్నరీ డాక్టర్ డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఖానాపూర్ పట్టణంలో కోతుల బెడద ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చాయి.ఖానాపూర్‌లోని కోతుల బెడద ఇప్పుడు కేవలం ప్రాణాంతక సమస్య మాత్రమే కాక, వన్యప్రాణుల నిర్వహణ, సామాజిక భద్రతతో కూడిన పెద్ద పరీక్షగా మారింది.


Tags:    

Similar News