తెలంగాణ బీజేపీకి ఏమైంది ?

మొత్తం 12,738 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే బీజేపీ మద్దతుదారులు గెలిచింది కేవలం 688 పంచాయతీల్లో మాత్రమే

Update: 2025-12-24 10:57 GMT
Telangana BJP President N Ramachandra Rao

తెలంగాణ బీజేపీకి ఏమైందో అర్ధంకావటంలేదు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేనని జబ్బలు చరుచుకుంటున్నారు కాని క్షేత్రస్ధాయిలో అంత సీన్ ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలకు కారణం ఏమిటంటే తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే. మొత్తం 12,738 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే బీజేపీ మద్దతుదారులు గెలిచింది కేవలం 688 పంచాయతీల్లో మాత్రమే. కాంగ్రెస్ మద్దతుతో 7010 మంది గెలిస్తే, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులు 3,502 పంచాయతీల్లో గెలిచారు.

కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన 7 వేల పంచాయతీలు ఎక్కడ, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులు గెలిచిన 3,502 పంచాయతీలు ఎక్కడ ? బీజేపీ మద్దతుదారులు గెలిచిన 688 పంచాయతీలు ఎక్కడ ? నక్కకు నాగలోకానికి అనే సామెతలాగుంది గణాంకాలు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే స్వతంత్రులు 1505 మంది పంచాయతీల్లో గెలవటం. ఇండిపెండెంట్ అభ్యర్ధులు గెలుచుకున్న పంచాయతీల్లో సగంపంచాయతీల్లో కూడా బీజేపీ మద్దతుదారులు గెలవలేదు. క్షేత్రస్ధాయిలో ఇంత దీనస్ధితిలో ఉన్న పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామంటే నమ్మటం ఎలాగ ?

పంచాయతీ ఎన్నికలు మూడుదశల్లో జరిగితే ఏ దశలో కూడా బీజేపీ మద్దతుదారులు చెప్పుకోదగ్గ స్ధాయిలో విజయాలు సాధించలేదు. 2020లో జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్లలో బీజేపీ 48 డివిజన్లలో గెలిచి చరిత్ర సృష్టించింది. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 8 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 8 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు నెగ్గారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో బీజేపీ మంచి ఊపుమీదకు వచ్చేసింది. ఆతర్వాత జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో రెండుచోట్ల గెలవటంతో పార్టీనేతలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇంకేముంది అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదే అన్నట్లుగా కమలనాదులు రెచ్చిపోయారు. తీరా ఇపుడు జరిగిన పంచాయతీ ఎన్నికలను చూస్తే ఉత్సాహమంతా చప్పబడిపోయినట్లయ్యింది.

సమన్వయం లేకపోవటమే పెద్ద సమస్యా ?

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కనబడిన ఉత్సాహం సడెన్ గా పంచాయతీ ఎన్నికలకు ఎందుకు మాయమైపోయింది ? ఇంతటి పేలవమైన ఫలితాలతో ఎందుకు చతికిలపడింది ? ఎందుకంటే అందుకు కొన్ని కారణాలు కనబడతాయి. మొదటిది రాష్ట్ర నాయకత్వం. అవును, నారపరాజు రామచంద్రరావు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన రెండో ఎన్నికిది. మొదటి ఎన్నిక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. రామచంద్రరావు స్వతహాగా మంచి వక్తే కాని పార్టీ క్యాడర్ ను, జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడలేకపోతున్నారు. పార్టీలో ఎంపీలు, ఎంఎల్ఏల మధ్య సరైన సమన్వయం లేదన్న ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నవే. ఎంపీల్లో ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్-మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఏమాత్రం పడటంలేదు. బండి నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకే మొన్నటివరకు ఈటల ప్రాతినిధ్యం వహించిన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హుజూరాబాద్ కూడా వస్తుంది.

తాను ఎంపీగా ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గం తనది కాబట్టి ఇక్కడ తనమాటే చెల్లుబాటు కావాలని ఈటల ఆలోచన. తనపార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తనమాటే చెల్లుబాటు కావాలన్నది బండి పంతం. కేంద్ర సహాయమంత్రి హోదాలో ఢిల్లీలో ఉంటున్న కారణంగా, జాతీయ నేతలతో ఎక్కువ సంబంధాలుంటాయి కాబట్టి పై స్ధాయిలో బండికి పట్టు ఎక్కువగా ఉంది. ఇదేసమయంలో దాదాపు 25 ఏళ్ళుగా హుజూరాబాద్ కు ప్రాతినిధ్యం వహించటం వల్ల ఈటలకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోను గట్టి సంబంధాలున్నాయి. ఇటు ఈటల అటు బండి ఇద్దరూ బీసీ నేతలే అవటంతో ఆధిపత్యం విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. ఇద్దరు మీడియా ముఖంగానే తిట్టుకున్న సందర్భాలుకూడా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ సయోధ్య చేసేంత సీన్ రామచంద్రరావుకు లేదు.

ఎవరికి వారేనా ?


వీళ్ళిద్దరి విషయాన్ని పక్కనపెట్టేస్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్విండ్ రూటే సపరేటు. ధర్మపురి జాతీయనాయకత్వంతో తనదైన స్టైల్లో తాను రిలేషన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. అందుకనే అధ్యక్షుడిని పెద్దగా పట్టించుకోరు. మొన్ననే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారం చేయాలి రమ్మని అధ్యక్షుడు పిలిస్తే ధర్మపురి రాలేదు. రాకపోగా ఉపఎన్నికలో రామచంద్రరావు జూబ్లీహిల్స్ లో తిరిగి చేస్తున్న ప్రచారం కన్నా తాను నిజామాబాదులో కూర్చుని సోషల్ మీడియా ద్వారా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు చేస్తున్న ప్రచారం చాలా ఎక్కువని సెటైర్లు పేల్చారు. కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డితో పాటు మిగిలిన నలుగురు ఎంపీలు కూడా రామచంద్రరావును పెద్దగా పట్టించుకోవటంలేదని పార్టీలోనే ప్రచారముంది. అధ్యక్షుడిని చేసిన తర్వాత రామచంద్రరావును పార్టీ జాతీయ నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు.

వీళ్ళ సంగతిని పక్కన పెట్టేసి ఎంఎల్ఏల సంగతి చూస్తే వీళ్ళ మీదకూడా అధ్యక్షుడికి పెద్దగా పట్టులేదు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆర్మూరు ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి యాక్టివ్ గా కనబడుతున్నారు. మిగిలిన ఆరుమంది ఎంఎల్ఏలు నియోజకవర్గాల్లో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎంఎల్ఏలు అందరు కలుసుకునేది పార్టీ కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహించటం అన్నది కనబడటంలేదు. కాబట్టి రామచంద్రరావుకు అటు ఎంపీలు, ఇటు ఎంఎల్ఏల మీద పెద్దగా పట్టులేదని అర్ధమవుతోంది. ప్రజా ప్రతినిధులే కాదు సీనియర్ నేతలపైన కూడా రామచంద్రరావుకు ఏమంత పట్టులేదు. సీనియర్ల మధ్య కూడా చాలా వివాదాలున్నాయి. అందుకనే ఎవరూ ఎకతాటిపైన పంచాయతీ ఎన్నికల్లో పనిచేయలేదని పార్టీ సమీక్షల్లో తేలింది.

అందుకనే పార్టీప్రభావం మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా కనబడలేదు. 2020 ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు గెలిచింది 100 పంచాతీల్లో మాత్రమే. అప్పటి ఫలితాలతో పోల్చితే తాజా ఫలితాల్లో బాగానే పుంజుకున్నట్లు కనబడుతున్నా పార్టీ నేతలు చెప్పుకుంటున్న దానికి, క్షేత్రస్ధాయిలో ఫలితాలకు అసలు సంబంధమే లేదు. కేంద్రమంత్రులు కిషన్-బండి మద్య కూడా మంచి సంబంధాలు లేవన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే బండికి రామచంద్రరావుకు కూడా గొప్ప సంబంధాలైతే లేవని పార్టీలో టాక్ వినబడుతోంది. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధలఎన్నికల్లో పార్టీనేతల వ్యవహారం ఎలాగుంటుందనేది ఆసక్తిగా మారింది. ఎలాగంటే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినవి. కాని తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు పార్టీల బ్యానర్లపైనే జరుగుతాయి. రాబోయే ఎన్నికల్లో గనుక బీజేపీ మంచి ఫలితాలను సాధించలేకపోతే 2028 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎంతమంది నమ్ముతారు ? రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని కమలనాదులు చెప్పుకోవటమే తప్ప వాస్తవంగా అలాంటి పరిస్ధితులు ఉన్నాయా ? అన్నదే అనుమానం.

గ్రామాల్లో పటిష్టమైన నాయకత్వంలేదు : చలసాని

పంచాయతీ ఎన్నికలకు స్ధానిక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అసలు సంబంధమే ఉండదని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలవనంత మాత్రాన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా గెలవదని అనుకునేందుకు లేదు’’ అని అన్నారు. ‘‘గ్రామాల్లో పార్టీకి పటిష్టమైన నాయకత్వం లేదన్నది వాస్తవం’’ అని చెప్పారు. ‘‘గ్రామస్ధాయిలో పట్టుకున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్యనే ఎక్కువగా పోటీ జరిగింది’’ అని అన్నారు. ‘‘బీజేపీ ఎంఎల్ఏలు ఉన్న నిర్మల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ మద్దతుదారులు గెలిచారు’’ అని గుర్తుచేశారు. ‘‘గ్రామీణ ప్రాంతంలో పార్టీబలోపేతంపై బీజేపీ నాయకత్వం ఆలోచించకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటం సాధ్యంకాదు’’ అని తేల్చేశారు. ‘‘నగరాల చుట్టూ తిరిగే నాయకత్వంపైన పార్టీ ఎక్కువగా ఆధారపడుతోంది కాబట్టే గ్రామపోరులో పార్టీ మద్దతుదారులు చతికిలపడ్డారు’’ అని తెలిపారు.

బలం పెరిగింది : బండి

ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు 2020 ఎన్నికలతో పోల్చితే ఇపుడు బీజేపీ ఎక్కువ పంచాయతీలను గెలుచుకున్నది అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు తాజా ఫలితాలే నిదర్శనం అని బండి తెలిపారు.

1000 పంచాతీల్లో గెలిచింది : నారపరాజు

‘‘గ్రామీణ ప్రాంత ఓటర్ల నాడిని తెలుసుకునే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు వెయ్యి పంచాతీల్లో గెలిచారు’’ అని రామచంద్రరావు తెలిపారు. ‘‘1200 ఉపసర్పంచ్ పదవుల్లో కూడా పార్టీ మద్దతుదారులు గెలిచాకు’’ అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఫల్యాలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు’’ అని అధ్యక్షుడు అభివర్ణించారు. ‘‘రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుంది’’ అన్న ఆశాభావాన్ని అధ్యక్షుడు వ్యక్తంచేశారు.

50శాతం కూడా గెలవలేదు : ఈటల

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపోయారు. ‘‘అధికారంలో ఉండికూడా కాంగ్రెస్ పార్టీ 50శాతం పంచాయతీల్లో కూడా గెలవలేదు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘అధికారంలో ఉన్న పార్టీ ఎక్కవ స్ధానాల్లో గెలవటం పెద్ద విశేషం ఏమీకాదు’’ అని అన్నారు. ‘‘తాజా ఫలితాలతో గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమవుతోంది’’ అని అన్నారు.

Tags:    

Similar News