ఎంఎల్ఏ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టంగా ప్రకటించారు

Update: 2025-12-24 06:47 GMT
BRS MLA Danam Nagendar

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం మీడియాతో మాట్లాడుతు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టంగా ప్రకటించారు. దానం తాజా ప్రకటనతో తొందరలోనే దానం రాజీనామా చేయటం ఖాయమని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే దానంపై ఫిరాయింపుల నిరోధక చట్టం కత్తి వేలాడుతోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ ఎంఎల్ఏగా గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటునుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా దానం పోటీచేశారు. దానంతో పాటు మరో తొమ్మిదిమంది ఎంఎల్ఏలు కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

ఫిరాయింపులపై అనర్హత కత్తి వేలాడుతుండటంతో ఫిరాయింపుల్లో తొమ్మిదిమంది తాము కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క దానం మాత్రమే ఈరోజు తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లుగా చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లుగా దానం ప్రకటించారు. ఎంఎల్ఏ మాట్లాడుతు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను 300 డివిజన్లలోను గెలిపిస్తానని ప్రకటించారు. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ అన్నీ డివిజన్లలోను గెలుస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకోసం మొత్తం గ్రేటర్ పరిధిలోని అన్నీ డివిజన్లలోను ప్రచారం చేస్తానని తెలిపారు. ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతు మిగిలిన ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు ఏ పార్టీలో ఉన్నారు తనకు తెలీదని తాను మాత్రం కాంగ్రెస్ లో ఉన్నట్లు చెప్పారు.

దానం తాజాప్రకటనతో తనపైన అనర్హత వేటువేయించేందుకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలపని మరింతగా సులభమయ్యేట్లుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏలపైనా అనర్హత వేటు వేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరో నలుగురు ఎంఎల్ఏలు న్యాయపోరాటం చేస్తున్నారు. అనర్హత విషయమై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలన్న సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమందిని విచారించేందుకు నోటీసులు జారీచేశారు.

అయితే ఎనిమిదిమంది ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదు. అయితే కడియం మీడియాతో మాట్లాడుతు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెప్పారు. ప్రతిసారి తమకు సమయం కావాలని అడుగుతున్నారే కాని విచారణకుమాత్రం హాజరుకావటంలేదు. దాంతో స్పీకర్ తన విచారణను పూర్తిచేశారు.

విచారణకు హాజరైన ఎనిమిందిలో ఐదుగురు ఎంఎల్ఏలు గూడెం, తెల్లం, బండ్ల, ప్రకాష్, అరెకపూడి పార్టీ మారలేదని తేల్చేశారు. వీళ్ళు పార్టీమారినట్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయారని స్పీకర్ తేల్చిచెప్పారు. స్పీకర్ నిర్ణయంపై మరోవివాదం రేగటంతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మళ్ళీ కోర్టులో పిటీషన్లు వేయబోతున్నారు. తాజాగా దానంచేసిన వ్యాఖ్యలతో తొందరలోనే ఎంఎల్ఏ రాజీనామా చేయబోతున్నారన్న విషయం అర్ధమవుతోంది. అధిష్ఠానం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజీనామాను స్పీకర్ కు అందించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News