చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్..

సృష్టి ఐవీఎఫ్ కేసు ఆధారంగా జరిపిన సోదాల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి.

Update: 2025-12-24 13:03 GMT

తెలంగాణలో అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సృష్టి ఫెర్టిలిటీ కేసు ఆధారంగా పోలీసులు చిన్నారులకు సంబంధించిన నేరాలపై తీగ లాగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మంగళవారం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా, దాడులకు సంబంధించిన వివరాలను డీసీపీ రితు రాజ్ వెల్లడించారు. ఈ ముఠా గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించినట్లు తెలిపారు.

‘‘మంగళవారం జరిపిన దాడుల్లో 20 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశాం. ఈ ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించిన వారిని కూడా గుర్తించాం. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి చిన్నారులను విక్రయించే దందా చేస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది’’ అని ఆమె వెల్లడించారు.

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగానే నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి చెరలో ఉన్న చిన్నారులను సురక్షిత కేంద్రాలకు తరలించారు పోలీసులు. ఈ వ్యహారంపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రితు రాజ్ చెప్పారు. ఈ ముఠాకు ఉన్న లింకులపై మరింత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, అందుకోసం గుజరాత్ పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు వివరించారు.

Tags:    

Similar News