హెచ్‌సీఏపై బీసీసీఐకి ఫిర్యాదు చేస్తాం: బండి
ప్లేయర్‌ని సెలక్ట్ చేయాలంటే కొందరు అధికారులు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ బండి ఆగ్రహం.
హెచ్‌సీఏలో గ్రామీణ స్థాయి క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ క్రికెటర్లను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని, హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ తన విధులను సరిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్తామని, హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ తీరుపై ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలక్షన్లపై బండి సంజయ్ స్పందించారు. సెలక్షన్లలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గ్రామీణ క్రికెటర్లకు నిర్లక్ష్యం చేస్తున్నారని, వారికి అవకాశం కల్పించడానికి కూడా సెలక్షన్ కమిటీ ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు.
‘‘గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదు. ఈ విషయంపైనే క్రీడాకారుల తల్లిదండ్రులు నన్ను కలిశారు. త్వరలో హెచ్‌సీఏపై చర్యలు ఉంటాయి. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తాం. సెలక్షన్ కమిటీలో కొందరు ప్లేయర్స్‌ను సెలక్ట్ చేయడానికి రూ.లక్షలు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు చెప్పారు. గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయడం లేదని ఆరోపించారు’’ అని బండి తెలిపారు. ఈ ఆరోపణలన్నింిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. యువత నైపుణ్యాలను అధికారులే తొక్కేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదాలే వివాదాలు..
అయితే హెచ్‌సీఏ.. వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఇటీవల సంతకాల ఫోర్జరీ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేకెత్తించింది. సన్‌రైజర్స్ హైదరబాద్‌తో టికెట్ల విషయంలో మొదలైన వివాదం.. ఫోర్జరీ సంతకాలు, నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కొంతకాలంగా హెచ్‌సీఏ పేరు ఎక్కడా పెద్దగా వినిపించలేదు అనుకునేలోపే ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్రమంత్రి బండి సంజయ్ నోటి వెంట వినిపించింది. అయితే ఈసారి కూడా వివాదం కారణంగానే కావడంతో.. హెచ్‌సీఏ నిర్వహణపై అధికారులు సమూల పరిశీలన చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.