సిద్దిపేట జిల్లాలో విషాదం
కాలి, బూడిద పాలైన 300 క్వింటాళ్ల పత్తి
ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతు కళ్ల ముందే కాలి బూడిదపాలైంది.
ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని ఏకంగా 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బెజ్జంకికి చెందిన రైతు బండి ఐలయ్య తన పది ఎకరాలతో పాటు మరికొంత భూమిని అప్పు చేసి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు.వచ్చిన లాభాలతో అప్పులు తీర్చాలనుకున్నాడు. కొద్దిరోజులుగా పత్తి తీత పనులు చేసి ఇంటికి తెచ్చిన పత్తిలో తడి ఆరేందుకు ఖాళీ స్థలంలో టార్పాలిన్లు వేసి ఆరబెట్టారు.
పత్తిలో తేమ శాతం కొనుగోలు చేయమని ఇటీవలె కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఖరాఖండిగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎకరానికి ఏడు క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయమని తేల్చేసింది. దీంతో రైతులు ప్రయివేటు మిల్లర్లను ఆశ్రయించి తక్కువ ధరకే పత్తిని విక్రయించి ఇంటికి వస్తున్నారు.మరో వైపు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విసిగిపోయిన జిన్నింగ్ మిల్లులు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయమని హెచ్చరికలు జారి చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మోంథా తుఫాను వల్ల పత్తి రైతులు భారీ నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో రైతు బండి ఐలయ్య తన ఇంటి ముందు తడిసిన పత్తిని ఆరబెట్టాడు. శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని క్షణాల్లో పత్తి మొత్తం కాలి బూడిదైంది. రైతు ఐలయ్యతో పాటు కుమారులు రమేష్, అనిల్, ఇతర కుటుంబ సభ్యులు గమనించి మంటలు ఆర్పడానికి విఫలయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సుమారు 300 క్వింటాళ్ల మేర పత్తి కాలిపోయినట్లు నష్టపోయిన రైతు ఐలయ్య తెలిపారు. ఇన్ని రోజుల కష్టం బూడిద పాలు కావడంతో బోరున విలపించారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట రూరల్ పోలీసులు పరిశీలించారు.