‘నాకు రేవంత్, కేసీఆర్‌ల సర్టిఫికెట్ అక్కర్లేదు’

తెలంగాణ ప్రజలకు రేవంత్ వెన్నుపోటు పొడిశారన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Update: 2025-11-08 07:59 GMT

జూబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపఎన్నిక ప్రచారంలో వేగం పెంచిన బీజేపీ.. బడా నేతలను రంగంలోకి దించింది. వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ధ్వజమెత్తారు. అభివృద్ధి విషయంలో తనకు రేవంత్, కేసీఆర్‌ల నుంచి సర్టిఫికెట్ అందుకోవాల్సిన అవసరం లేదని, తనను విమర్శించే, ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్‌కు ఏ కోశాన లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలేనని విమర్శించారు. ప్రజలకు కల్లబొల్లు మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారం అందుకున్నారని, అధికారం వచ్చాక హామీలను తుంగలో తొక్కేశారని అన్నారు. ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శలు గుప్పించారు.

‘‘కాంగ్రెస్ అసలు రంగ ప్రజలకు అర్థమవుతోంది. అందుకే ప్రజల దృష్టిని తమపై నుంచి మళ్లించడం కోసం కాంగ్రెస్ నన్ను గార్టెగ్ చేస్తోంది. హామీల అమలులో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు. దానిని కప్పిపుచ్చుకోవడం కోసమే నాపై విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇదే పంథాను అనుసరించారు రేవంత్. వ్యక్తిగత విమర్శలకు భయడే వ్యక్తిని కాదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఆ విషయంలో కేసీఆర్, రేవంత్‌ల సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు’’ అని అన్నారు.

బీజేపీ అవినీతి పార్టీ కాదు

‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ తరహాలో అవినీతి, కుటుంబ పార్టీ కాదు.. బీజేపీ. ఇచ్చిన హామీలను అమలు చేయడమే బీజేపీకి తెలుసు. మా పాలనపై ఇప్పటి వరకు చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు. మా పార్టీపై ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిపై నా వివరణ వినే ధైర్యం కేసీఆర్, రేవంత్‌కు ఉందా? కాంగ్రెస్ హైకమాండ్‌కు భయపడే కేసీఆర్‌పై రేవంత్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్లంతా తోడు దొంగలు. రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం’’ అని విమర్శలు గుప్పించారు. రేవంత్‌ను మళ్ళీ నమ్మడానికి తెలంగా ప్రజలు రెడీగా లేరని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.

‘‘ఆరు గ్యారెంటీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జూబ్లీ పోరులో హస్తం చిత్తవడం ఖాయం. ప్రచారంలో రేవంత్ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. కాకపోతే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది? ఫార్మా సంస్థలు, పారిశ్రామిక వేత్తలను బెదిరించి రూ.వేల కోట్లు వసూలు చేశారు’’ అని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News