రీజినల్ రింగ్ రోడ్ మర్రిగూడ జింకలకు మరణ శాసనమా?
‘జింకల పార్క్ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం’
By : పి. చైతన్య
Update: 2025-11-08 07:21 GMT
రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road: ORR) నల్గొండ జిల్లాలోని మర్రిగూడ (Marriguda) ప్రాంతంలో సంచరిస్తున్న జింకలకు ప్రమాదకారిగా మారే అవకాశం ఉండటంతో వాటి రక్షణకు ప్రతేయక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో 1,000 పైగా జింకలు ఆవాసంగా చేసుకొని ఉంటున్నట్లు అటవీశాఖ అధికారుల అంచన. రీజినల్ రింగ్ రోడ్ వీటికి ప్రమాదంగామారే అవకాశం లేకపోలేదు
భారతదేశంలో జింకలు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ద్వారా రక్షణకు కఠిన చట్టాలు రూపొందించటం జరిగింది.. ఈ చట్టం జింకల పరిరక్షణ స్థితి ఆధారంగా వాటిని వేర్వేరు షెడ్యూల్‌లుగా వర్గీకరిస్తుంది. , అన్ని జాతులకు వేట నిషేధించబడింది. జాతీయ ఉద్యానవనాలు, కమ్యూనిటీ నేతృత్వంలోని ప్రాజెక్టులు వంటి రక్షిత ప్రాంతాలను సృష్టించడం వంటి పరిరక్షణ ప్రయత్నాలు కూడా రక్షణలో ఉన్నాయి.
జింకలు సాధారణంగా అడవులు, గడ్డి భూములు, లేదా దట్టాలలో చెట్ల పొదలను ఆవాసంగా చేసుకుంటాయి. దట్టమైన వృక్షసంపదలో ఆశ్రయం పొందుతాయి. మర్రిగూడ రాచకొండ అటవీ ప్రాంతంపై అతి సమీపంలో ఉండటంతో ఇక్కడ జింకల సంచారం కనిపిస్తుంది.
మర్రిగూడ మండలంలోని నామపురం, సారంపేట, శేరిపురం, లెంకలపల్లి, భీమలపల్లి, వట్టిపల్లి గ్రామాలలో జింకలు, కృష్ణ జింకలు అధికంగా కనిపిస్తాయి. జింకలు నివాస ప్రాంతాలలో, వ్యవసాయ పొలాలలో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. ఈ గ్రామాలకు దగ్గరనుంచి వెళుతుండటంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ముందుగాని వాటి యజమానులు తమ భూములకు కంచెని వేసుకోవటం ప్రారంభించారు. దీనితో ముళ్ళ కంచెలవల్ల జింకలు గాయాలపాలు అయినా సంఘటనలు కూడా ఉన్నాయని ఈ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూళ్ళ కంచెల వల్ల జింకలు కుక్కల దాడినుంచి తప్పిచించుకోవటం కష్టంగా మారుతుంది. రీజినల్ రింగ్ రోడ్ పూర్తి అయిన తరువాత ఈప్రాంతం నుంచి వెళ్లే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. జింకలు వాహనాల మూలంగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.
మర్రిగూడ మండలంలోని నామాపురం గ్రామాన్ని చెందిన కంచుకట్ల సంపత్ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడుతూ “వేసవిలో త్రాగునీటి కోసం గ్రామాలలోకి ప్రవేశిస్తాయి. మేము వాటికి ఎప్పుడూ హాని చేయలేదు. వన్య ప్రాణులకూ నీరు త్రాగేందుకు వీలు కల్పించేందుకు గ్రామస్థులు నీటి తొట్టెలపై మూతలు కూడా పెట్టరు, ” అని చెప్పారు.
అదే గ్రామానికి చెందిన శనగని యాదయ్య మాట్లాడుతూ " నా పొలాలలో జింకను వెంబడిస్తూ 10 నుండి 15 కుక్కలు కనిపించాయి. నేను ఆ కుక్కలను వెళ్లగొట్టి జింకను కాపాడను. జింకలను రక్షించడానికి అటవీ శాఖ జోక్యం చేసుకోవాలి", అని అన్నారు.
భవిష్యత్తులో, రింగ్ రోడ్డు పూర్తయిన తర్వాత, వేగంగా వెళ్లే వాహనాలు రహదారిని దాటడానికి ప్రయత్నించే జింకలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జింకల రక్షణ కోసం సారంపేట వద్ద ఉన్న 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో జింకల పార్కు ఏర్పాటు చేయటమే పరిష్కారం అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆ ప్రాంతం లో జింకల తగ్గకుండా పరిష్కారం చూపుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయాలనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభంకు ముందే జింకల పార్క్ ఏర్పాటు చేసి వాటిని తరలించినట్లు ఐతే జింకల రక్షణకు వీలు కలుగుతందని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు. రాచకొండ ప్రాంతం కూడా దగ్గరగా ఉండటంతో జింకల పార్క్ ఏర్పాటు చేసినట్లు ఐతే ఈ ప్రాంతం పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
పేరు ప్రచురించటానికి ఇష్టం లేని అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో మూడు జింకలు మర్రిగూడ ప్రాంతంలో కుక్కల దాడిలో మృత్యువాత పడినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జింకల పార్క్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. "ఏది ఏమైనా, తాము వన్యప్రాణుల రక్షణకు తగు చర్యలు తీసుకొన్నట్లు అయన తెలిపారు. గాయ పడిన జింకలకు చికిత్సను అందించి ప్రాణాలు కాపాడడం జరిగింది,' అని అయన చెప్పాము.