రేవంత్ చెప్పిన బ్యాడ్ బ్రదర్స్ ఎవరో తెలుసా ?

నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్, కేటీఆర్ ను జనాలు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నట్లు చెప్పారు

Update: 2025-11-07 11:54 GMT
Revanth

ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ సిటీ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో రేవంత్(Revanth) మాట్లాడుతు మెట్రో విస్తరణ రెండో దశను, మూసీ ప్రక్షాళనను, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీని బ్యాడ్ బ్రదర్స్(Bad Brothers) అడ్డుకుంటున్నట్లు మండిపడ్డారు. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్(Hyderabad) కు తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని, నగరంలో నిర్మించాలని అనుకుంటున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, ఎలివేటెడ్ క్యారిడార్లకు కూడా ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు సీఎం ఆరోపించారు. ఇంతకీ రేవంత్ పదేపదే బ్యాడ్ బ్రదర్స్ అని అన్నది ఎవరినో తెలుసా కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను.

హైదరాబాద్ అభివృద్ధి కోసం కొట్లాడిన పీ జనార్ధనరెడ్డి, మర్రి శశిధరరెడ్డిని ఒకపుడు హైదరాబాద్ బ్రదర్స్ అని అంటే ఇపుడు నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్, కేటీఆర్ ను జనాలు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నట్లు చెప్పారు. 30 ఏళ్ళనుండి పెండింగులో ఉన్న కంటోన్మెంట్ నుండి శామీర్ పేట, మేడ్చల్ కు ఎలివేటెడ్ కారిడార్లకు అప్రూవల్ తెచ్చి రు. 5 వేల కోట్లతో పనులు ప్రారంభించినట్లు రేవంత్ తెలిపారు. ఉత్తరతెలంగాణ మొత్తం ఈరెండు కారిడార్లపైనే ఆధారపడినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నా కారిడార్ల కోసం ప్రయత్నించలేదన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

2004-14 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ అన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినవే అని గుర్తుచేశారు. 2014 తర్వాత కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో రు. 16 వేల కోట్ల మిగులుబడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే 2023లో కేసీఆర్ రు. 8 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కు అప్పగించినట్లు ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ కు కేటాయించిన ఐటీఐఆర్ రద్దుచేసింది ఎవరో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. ఐటీఐఆర్ కూడా మంజూరై ఉంటే హైదరాబాద్ ఈపాటికి ఇంకా అభివృద్ధి జరిగుండేదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలిపోయిందని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేసి టెలిఫోన్ ట్యాపింగ్ కు ఉపయోగించుకున్నారని, ప్రగతిభవన్, బాగున్న సచివాలయంను కూలగొట్టి కొత్తసచివాలయం నిర్మించింది కుమారుడిని సీఎం చేయాలని మాత్రమే అని సెటైర్లు వేశారు. కొత్తసచివాలయం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు.

Tags:    

Similar News