కర్నూలు బస్సు ప్రమాదం: వేమూరి ట్రావెల్స్ యజమాని వినోద్ అరెస్ట్
19 మంది ప్రాణాలను బలి తీసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు.
By : The Federal
Update: 2025-11-07 08:59 GMT
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణ వేగం పుంజుకుంది. 19 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ ప్రమాదానికి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరు పరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించారు.
ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత వారం కర్నూలు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు బయటపడేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 19 మంది సజీవ దహనమయ్యారు, మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రిజిస్ట్రేషన్‌లో లొసుగులు, నిర్లక్ష్యం బహిర్గతం
ప్రమాదానికి కారణమయిన బస్సు.. సీటర్ వాహనంగా రిజిస్టర్ అయి ఉండి, తరువాత దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్పు చేసినట్లు రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డయ్యూడామన్ లో బస్సును కొనుగోలు చేసి ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేయించి అక్కడే బాడీని కట్టించి హైదరాబాద్- బెంగళూరు మధ్య తిప్పుతున్నట్టు అధికారులు గుర్తించారు.
భద్రతా ప్రమాణాలు, అగ్ని మాపక నియంత్రణ పరికరాలు లేని స్థితిలో బస్సును తిప్పుతున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ బస్సు, గతంలోనూ నిబంధనల ఉల్లంఘనపై చలానాలు వేసినట్టు ట్రాఫిక్ అధికారుల దృష్టికి వచ్చింది.
కానీ సరైన చర్యలు తీసుకోకపోవడం, రవాణా శాఖ పర్యవేక్షణ లోపించడం వలనే ఈ ప్రమాదం మరింత తీవ్రతరం అయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
డ్రైవర్ ఇప్పటికే అరెస్ట్
ఈ కేసులో మొదటి నిందితుడు (A-1) డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు కొన్ని రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఇప్పుడు బస్సు యజమాని వినోద్ (A-2) అరెస్టుతో దర్యాప్తు వేగవంతమైంది.
ప్రమాదానికి దారి తీసిన మెకానికల్ లోపాలు, బస్సు సీటింగ్ మార్పులు ఎవరి అనుమతితో జరిగాయో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దూకుడు పెరిగింది. సేఫ్టీ సర్టిఫికెట్లు లేకుండా రోడ్లపై నడుస్తున్న బస్సులు, డ్రైవర్ల అధిక వేగం, లైసెన్స్ మానిప్యులేషన్లు- ఇవన్నీ కలిపి రోడ్లను ప్రమాదకరంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కర్నూలు ప్రమాదం నిర్లక్ష్య వ్యవస్థకు ఉదాహరణగా నిలిచింది.
వేమూరి కావేరి ట్రావెల్స్ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలో వ్యాప్తించిన నిర్లక్ష్యం, లాభాల దాహం, అధికార యంత్రాంగ పర్యవేక్షణ లోపం అన్నింటికీ నిదర్శనంగా ఈ ప్రమాదాన్ని భావించవచ్చు.
దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.