కేటీఆర్, బండి ఇద్దరిలో ఒకరికే అవకాశం

ఒకరికి అనుమతిచ్చి తమసభకు అనుమతి నిరాకరించటంతో పోలీసుల వైఖరిపై బీజేపీ నేతలు మండిపోతున్నారు.

Update: 2025-11-07 07:24 GMT
Bandi and KTR

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోలీసులతీరు బాగా వివాదాస్పదమవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రహమత్ నగర్లో సభకు ఇచ్చిన అనుమతే. విషయం ఏమిటంటే రహమత్ నగర్లో శుక్రవారం మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోవటంలో బీజేపీ(Telangana BJP)కి అనుమతి నిరాకరించిన పోలీసులు బీఆర్ఎస్(BRS) సభకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకరికి అనుమతిచ్చి మరొకరి సభకు అనుమతి నిరాకరించటంతో పోలీసుల వైఖరిపై బీజేపీ నేతలు మండిపోతున్నారు.

రహమత్ నగర్లో మీటింగ్ పెట్టుకునేందుకు అనుమతికోరుతు ఈనెల 4వ తేదీన బీజేపీ పోలీసులకు లేఖరాసింది. అయితే 6వ తేదీ రాత్రివరకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాన్చారు. అలాగే బీఆర్ఎస్ సభకు మాత్రం వెంటనే అనుమతి ఇచ్చేశారు. బీజేపీ తరపున కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్యఅతిధిగా హాజరుకాబోతున్నారు. బండి స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న విషయం పోలీసులకు బాగా తెలుసు. అయినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు. బోరబండలో గురువారం జరిగిన మీటింగ్ విషయంలో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించి చివరినిముషంలో అనుమతివ్వటం వివాదాస్పదమైంది.

ఆ విషయాన్ని బీజేపీ మరచిపోకముందే శుక్రవారం ఉదయం రహమత్ నగర్ మీటింగు నిర్వహణకు అనుమతి ఇవ్వటంలేదని బీజేపీకి పోలీసులు శుక్రవారం సమాచారం ఇచ్చారు. దాంతో బండితో పాటు నేతలంతా అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. మీటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధంచేసుకున్న తర్వాత చివరినిముషంలో అనుమతి నిరాకరిస్తు సమాచారం ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల తాజా వైఖరితో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అన్న తమఆరోపణలు నిజమే అని నిర్ధారణ అయ్యిందని బండి మండిపడుతున్నారు. పై రెండుపార్టీలు ఒకటి కాకపోతే తమ మీటింగుకు అనుమతి నిరాకరించిన పోలీసులు బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వటం ఏమటని బండి నిలదీస్తున్నారు. మరి పోలీసులు ఏమి సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News