ఆఫ్రికన్ నత్తల నివారణకు స్ప్రేయింగ్ ఆపరేషన్ షురూ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్ పల్లి హరిత వనంలో ఆఫ్రికన్ నత్తల బెడదతో జనం ఆందోళన

Update: 2025-11-06 10:16 GMT
న్యూబోయిన్ పల్లిలోని ఆర్మీ హరిత వనంలో ఆఫ్రికన్ నత్తల నివారణకు రసాయనాన్ని పిచికారి చేస్తున్న కంటోన్మెంట్ సిబ్బంది.

హైదరాబాద్ నగర శివార్లలోని సికింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోని ఆర్మీ ఏరియాలో ఆఫ్రికన్ నత్తల నివారణకు కంటోన్మెంటు బోర్డు ఆరోగ్య, పారిశుధ్య విభాగం అధికారులు గురువారం స్ప్రేయింగ్ ఆపరేషన్ చేపట్టారు. సికింద్రాబాద్ ఆరోగ్య, పారిశుధ్య విభాగం సూపరింటెండెంట్ ఎం దేవేందర్ ఆధ్వర్యంలో పది మంది కార్మికులతో నత్తల నివారణకు ఉప్పునీరు, క్లోరిన్ తో కూడిన బ్లీచింగ్ పౌండరు కలిపిన రసాయనాన్ని తాము పిచికారి చేశామని, దీని వల్ల ఆఫ్రికన్ నత్తలు మరణిస్తున్నాయని కంటోన్మెంట్ శానిటరీ ఇన్ స్పెక్టర్ అశుతోష్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినికి ధికి చెప్పారు. మరో మూడు రోజులపాటు ఆఫ్రికన్ నత్తల నివారణకు స్ప్రేయింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని ఆయన తెలిపారు. న్యూ బోయిన్ పల్లిలోని మేడ్చల్ రోడ్డు పక్కన ఉన్న ఆర్మీ ఏరియాలో చెట్లపై ఆఫ్రికన్ నత్తలు కనిపించడంతో దీన్ని నివారణకు రసాయనాన్ని పిచికారి చేశామన్నారు. ఈ నత్తలు కంటోన్మెంట్ ప్రాంతంతోపాటు చుట్టూపక్కల వ్యాప్తి చెందకుండా నివారించేందుకు రసాయనాన్ని పిచికారి చేస్తున్నామని చౌహాన్ వివరించారు.


 ఆఫ్రికన్ నత్తలు


 ఆఫ్రికన్ నత్తలు ఎందుకు వచ్చాయంటే...

వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబరు నెలలో భారీవర్షాలు కురవడం వల్ల న్యూబోయిన్ పల్లి ప్రాంతంలోని మిలటరీకి చెందిన రెండు ఎకరాల వనంలో ఆఫ్రికన్ నత్తలు వచ్చాయని కంటోన్మెంటు అధికారులు చెప్పారు. వర్షపు సీజన్ ముగిశాక భారీవర్షాలు కురవడం వల్ల ఈ నత్తలు వచ్చాయని భావిస్తున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డుకు చెందిన ఉన్నతాధికారి ఎం దేవందర్ చెప్పారు.

ఆర్మీ హరిత వనంలో రసాయనం పిచికారి చేస్తున్న కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది


పచ్చని చెట్లను తినేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

కంటోన్మెంట్ హరిత వనంలోకి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు కాని గుంపులుగుంపులుగా ఆఫ్రికన్ నత్తలు వచ్చాయని స్థానికులు చెప్పారు. ఈ నత్తలు పచ్చని చెట్లను మేసేస్తున్నాయని వారు తెలిపారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేర సికింద్రాబాద్ కంటోన్మెంటు అధికారులు రంగంలోకి దిగి గురువారం ఆఫ్రికన్ నత్తల నివారణకు రసాయనాల స్ప్రేయింగ్ చేపట్టారు. ఉప్పు కలిపిన నీటితోపాటు క్లోరిన్ ఉన్న బ్లీచింగ్ పౌడరు కలిపిన నీటిని పిచికారి చేస్తే నత్తల బెడద తగ్గుతుందని కంటోన్మెంటు అధికారులు చెప్పారు.

ఆఫ్రికన్ నత్తల బెడదతో జనం ఆందోళన
ఆఫ్రికన్ నత్తల బెడద తో న్యూ బోయిన్ పల్లి ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికన్‌ నత్తలు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ న్యూబోయిన్‌పల్లిలో మిలిటరీకి చెందిన రెండు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో కనిపించాయి. ఆఫ్రికన్‌ నత్తలు కనిపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నత్తలు ఆకులు, చిగుళ్లు, కాండం, పూతపిందెలనే కాకుండా ఏకంగా వృక్షాలనే నేలకొరిగేలా చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.ఆఫ్రికన్ నత్తలు హైదరాబాద్‌ అంతా విస్తరిస్తే ఉన్న పార్కులు, ఇళ్లలో పెంచుకునే మొక్కలూ తినేస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.



Tags:    

Similar News