చీమల భయానికి మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో వింత మరణం

Update: 2025-11-06 13:51 GMT

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చీమల భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో నివాసముండే 25 ఏళ్ల మనీషా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుసైడ్ చేసుకోవడానికి ముందు రాసిన నోట్ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. రకరకాల మానసిక జబ్బులతో ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటే. అయితే చీమల భయానికి ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి అని పోలీసులు అంటున్నారు.


విషయం తెలుసుకున్న పోలీసులు మనీషా ఇంటికి చేరుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు వాళ్ళ బెడ్ రూమును పోలీసులు పరిశీలించినపుడు  ఒక నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో, 'శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు... కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చండి' అని రాసి ఉంది.  అమీన్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీమల ఫోబియాతో మహిళా చనిపోయిన విషయం విన్నవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.  గృహిణి మరణించడంతో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనీషా కొంతకాలంగా చీమల ఫోబియాతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. ఈనెల 4వ తేదీన సాయంత్రం భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బెడ్‌రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది. తలుపులను ఎంత తట్టినా తెరుచుకోకపోయేసరికి భర్తకు అనుమానం వచ్చింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళను పిలిచాడు. వాళ్ళసాయంతో  తలుపులు బద్దలు కొట్టి తెరిచి చూస్తే మనీషా చీరతో ఉరి వేసుకుని కనిపించింది.

మైర్మెకోఫోబియా అంటే


చీమల ఫోబియాను శాస్త్రీయ భాషలో ‘మైర్మెకోఫోబియా’ అని అంటారు. నిజానికి చీమలంటే భయం అనేది కేవలం మానసిక ఆందోళన మాత్రమే కాదు, అదొక క్లినికల్ ఫోబియా.  మైర్మెకోఫోబియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారికి గుండె వేగంగా కొట్టుకోవడం , చెమటలు పట్టడం, విపరీతమైన వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భయం వంటి లక్షణాలుంటాయి.  దాని ద్వారా కలిగే తీవ్రమైన మానసిక వేదన, ఒంటరితనం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.  ఫోబియా తీవ్రతరం అయినప్పుడు ఆ వ్యక్తి నిరంతర భయం నుంచి బయటపడటానికి సుసైడ్ మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని భావించే ప్రమాదం ఉంది. మనీషా విషయంలో కూడా అదే జరిగింది. ఆమె భయం ఆమెను జీవించడానికి వీలు లేని విధంగా చేసిందని మానసిక నిపుణులు అంటున్నారు.


ఈ భయం చీమలను చూసినప్పుడు మాత్రమే కాదు వాటి గురించి ఆలోచించినప్పుడు లేదా వాటి గురించి మాట్లాడినప్పుడు కూడా తలెత్తవచ్చునని మానసిక నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, ఫోబియాలకు చికిత్స ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Tags:    

Similar News