ఖాకీ యాక్షన్ మొదలైంది,హైదరాబాద్ భద్రతకు సజ్జనార్ సన్నద్ధం!
ఫైరింగ్ రేంజ్ నుంచి కమాండ్‌రూం వరకు,సిటీ సీపీగా సజ్జనార్ వార్
By : Saleem Shaik
Update: 2025-11-07 02:14 GMT
హైదరాబాద్ నగర (Hyderabad) పోలీసింగ్ రంగంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సీపీ సజ్జనార్ ప్రారంభించారు.ఆపరేషనల్ పోలీసింగ్ నుంచి సోషల్ మీడియా యాక్టివిజానికి, కేసుల విచారణ నుంచి ప్రజల సేవా దృక్పథం వరకు హైదరాబాద్ పోలీసింగ్ ని కొత్త దిశగా తీర్చిదిద్దవచ్చని నగర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
- హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ (V.C.Sajjanar,IPS) మరోసారి వార్తల్లో నిలిచారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ గురువారం పోలీసు అకాడమీలో పిస్టల్ తో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసిన సజ్జనార్ 2025 సెప్టెంబరు 27వతేదీన మళ్లీ ఖాకీ యూనిఫాం ధరించి కీలకమైన హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరుగా బాధ్యతలు చేపట్టారు.
సీపీ సజ్జనార్ ఫైరింగ్ ప్రాక్టీస్
మళ్లీ పోలీసు యూనిఫాం ధరించిన సీపీ సజ్జనార్ గురువారం పోలీసు అకాడమీకి సిటీ పోలీసులతో కలిసి వచ్చి ఫైరింగ్ రేంజ్ లో పిస్టల్ తో కాల్పుల సెషన్ లో పాల్గొన్నారు. ‘‘నేను హైదరాబాద్ సిటీ పోలీస్ బృందంలో చేరాను. తిరిగి ఫైరింగ్ రేంజ్‌లోకి రావడం నాకు గొప్ప అనుభూతి. బుల్‌సీని కొట్టడం థ్రిల్లింగ్‌గా ఉంది’’అని సీపీ సజ్జనార్ ఫైరింగ్ ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలతో ఎక్స్ పోస్టు చేశారు. సజ్జనార్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు పలువురు స్పందించారు. నగరంలోని దొంగలపై తుపాకీ గురిపెట్టాలని ఓ నెటిజన్ అభ్యర్థించారు. ‘‘ఇదీ రాబోయే యాక్షన్ సినిమాలా కనిపిస్తోంది’’అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘సార్ కొత్త చర్యకు సిద్ధమవుతున్నారు’’అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తం మీద సీపీ ట్వీట్ కు 51 కామెంట్లు, 110 రీ పోస్టులు,1.3 కె లైక్ లు, 146 వ్యూస్ వచ్చాయి. సీపీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్
సజ్జనార్ ఎక్కడ పనిచేస్తున్నా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ నిత్యం పోస్టులు పెడుతుంటారు. హైదరాబాద్ నగరంలో మెరుగైన పోలీసింగ్ కోసం సీపీ సజ్జనార్ శాంతిభద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ-దర్యాప్తు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్-టెక్నాలజీ అడాప్షన్, మానవ వనరుల నిర్వహణ, తదితర అంశాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలీసు అధికారులకు వివరించారు.ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై కొరడా ఝళిపించారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగుపై నగర ప్రజలకు అవగాహన కల్పించారు. డీప్ ఫేక్ కు కోడ్ వర్డ్ తో చెక్ పెట్టాలని ఆయన సూచించారు. రౌడీలు, దొంగల భరతం పడతానని సీపీ హెచ్చరించారు. చాదర్‌ఘాట్ వద్ద దొంగతనం కేసుల్లో నిందితులను వెంబడించే సమయంలో ధైర్యంగా కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, పీఎస్ ఓ మూర్తిని సీపీ అభినందించారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇద్దరు బైకర్లు ప్రాణాలు కోల్పోయారని, స్పీడ్ థ్రిల్స్ ప్రాణాలు తీశాయని సీపీ వ్యాఖ్యానించారు. ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్.. పట్టుతప్పితే బాధ్యులెవరు!? అని టూవీలరుపై గొడుగు పట్టుకొని వెళుతున్న వ్యక్తిని ప్రశ్నించారు. ఇలా ప్రమాదకర ప్రయాణం చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని సీపీ సలహా ఇచ్చారు.
రెండు ఎన్ కౌంటర్లతో దేశవ్యాప్త గుర్తింపు
2008 వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, 2019 శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. వరంగల్ జిల్లా కిట్స్ కళాశాలలో బీటెక్ చదువుతున్న స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబరు 10 వతేదీన ముగ్గురు యువకులు యాసిడ్ తో దాడి చేశారు. ఈ సంఘటన నాడు అమ్మాయిల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అంతే అప్పటి వరంగల్ ఎస్పీ సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు నిందితులు శాఖమూరి శ్రీనివాస్, జ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం యాసిడ్ ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా నిందితులు తమ పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించారని ప్రతి దాడిలో ముగ్గురిపై కాల్పులు జరపగా వారు మరణించారని పోలీసులు చెప్పారు. వరంగల్ ఎన్ కౌంటరులో సజ్జనార్ స్వయంగా పాల్లొన్నారు.
దిశ ఎన్ కౌంటర్
వెటర్నరీ డాక్టర్ దిశపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద 2019 నవంబరు 27వతేదీన లారీ డ్రైవర్, క్లీనర్లు నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆపై ఆమెను చటాన్ పల్లి బ్రిడ్జి కింద పెట్రోలు పోసి కాల్చి చంపారు.నాటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా వారు పారిపోయేందుకు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోనేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా నలుగురు నిందితులు మరణించారు.
ఎక్కడ పనిచేశారంటే...
సజ్జనార్ జనగామ ఏఎస్పీగా పోలీసు కెరీర్ ను ప్రారంభించి కొత్తగూడెం ఓఎస్డీగా, పులివెందుల ఏఎస్పీ, వరంగల్, మెదక్, నల్గొండ, గుంటూరు, కడప జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఐజీగా, సైబరాబాద్ పోలీసు కమిషనరుగా పనిచేశారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన సజ్జనార్ పోలీసు యూనిఫాం వదిలి 2021 ఆగస్టు 25వతేదీన టీజీ ఆర్టీసీ ఎండీగా చేరి నాలుగేళ్లు సేవలందించారు.
మళ్లీ ఖాకీ యూనిఫాంతో యాక్షన్ లోకి...
మొత్తం మీద ఖాకీ యూనిఫాం మళ్లీ ధరించి యాక్షన్‌లోకి దిగిన సీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ మరోసారి ఫైరింగ్ ప్రాక్టీసు ద్వారా తన దృఢ సంకల్పాన్ని చాటిచెప్పారు. పోలీసింగ్ అంటే కేవలం చట్టరక్షణ మాత్రమే కాదు, ప్రజల్లో నమ్మకం, భద్రతను కల్పించే బాధ్యత అని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. టెక్నాలజీతోపాటు మానవతా విలువలను సమన్వయం చేస్తూ నగరాన్ని నేరరహితంగా మార్చే దిశగా సజ్జనార్ తీసుకున్న తొలి అడుగులు ఇప్పటికే ప్రజల్లో విశ్వాసాన్ని నింపాయి.