సీఎం రేవంత్, వీధి రౌడీలా మాట్లాడుతున్నారా..?
కాలేజీల బంద్ విషయంలో కళాశాలల యాజమాన్యాలకు పూర్తి మద్దతు ప్రకటించిన కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు.. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా ఉన్నాయంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారని, వారికి కళాశాలల యాజమాన్యాలు అండగా నిలిచాయని అన్నారు. అలాంటి వారిని తాట, తోలు తీస్తా అని మాట్లాడం సీఎం రేవంత్‌కు సబబు కాదన్నారు. ఈ అంశంపై తెలంగాణ జాగృతి.. కళాశాలలకు మద్దతుగా నిలుస్తుందని, పోరాటం చివరి వరకు వారికి తోడుగా నడుస్తుందని అన్నారు. వరంగల్ హన్మకొండలో కవిత.. జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కాలేజీల బంద్‌పై ఆమె స్పందించారు. సీఎం రేవంత్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన సీఎం హోదాలో ఉన్నానన్న విషయం మరిచి, వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్నారు.
‘‘కాలేజ్ యాజమాన్యాల తాట, తోలు తీస్తారా? తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా? మాట తప్పింది మీరు. అందుకే వాళ్లు కాలేజ్ లు బంద్ చేశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి.. కాలేజ్ యాజమాన్యాలను బెదిరిస్తారా? తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన.. కాలేజ్ యాజమాన్యాల తరఫున మేము పోరాడుతాం. సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలి’’ అని సూచించారు. ‘‘మేము ఇక్కడకు రాగానే కాలేజ్ పిల్లలు మన వద్దకు వచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నేను ఈ విషయానికి సంబంధించి కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడితే సీఎం స్పందించారు’’ అని తెలిపారు.
‘‘పాత బకాయిలతో పాటు ఈ ఏడాది బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ నిన్న ప్రెస్ మీట్ లో వీధి రౌడీలు కూడా సిగ్గు పడే విధంగా మాట్లాడారు. కాలేజీల యాజమాన్యాల తోలు, తాట తీస్తారంట. ఎందుకు తోలు తీస్తారు సీఎం? ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ కాలేజ్ లను మన ప్రాంతంలో పెట్టకపోతే వారే ఆ బాధ్యత తీసుకున్నారు. లోన్లు తీసుకొని, పైసా పైసా కూడా బెట్టి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్ లు ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులకు విద్య అందించినందుకు వారి తాటా తీస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మీరు ఇచ్చిన మాట తప్పినందుకే కాదా? వాళ్లు కాలేజ్ లు బంద్ చేశారు. మేము కూడా సింబాలిక్ గా మాత్రమే బంద్ నిర్వహించాలని వారికి అప్పీల్ చేశాం. కాలేజ్ లు నడపలేని పరిస్థితి రావటంతోనే వారు బంద్ చేశారు. మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు. కానీ కాలేజ్ యాజమాన్యాలకు ఎందుకు ఇవ్వటం లేదు. పైగా కాలేజ్ వాళ్ల మీద మీరు వీరంగం ప్రదర్శించారు. 18 వందల కాలేజ్ లు ఉంటే 2 కాలేజ్‌ల పేర్లు చెప్పారు. వాళ్లు పర్మిషన్లు అడిగితే...నిబంధనలకు విరుద్దమైతే వారికి పర్మిషన్ ఇవ్వకండి’’ అని అన్నారు.
‘‘కానీ మిగతా వారంతా ఏం చేశారు. అక్కడి విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తారు? వాళ్లు కచ్చితంగా తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడ్డారు. మీరు మాట తప్పి...వాళ్లను బెదిరిస్తారా? నిన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించాక వాళ్లు కాలేజ్ లను స్టార్ట్ చేశారు. ఐతే విద్యార్థులు నష్టపోకుండా వారికి చదువు చెప్పాలని కాలేజ్ యాజమాన్యాలను కోరుతున్నా. పిల్లల మీద వివక్ష వద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే మీ తరఫున మేము పోరాటం చేస్తాం. రెండు రోజుల పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నాం. మొత్తం 5 నియోజకవర్గాల్లో తిరుగుతాం. ఇక్కడ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాం’’ అని స్పష్టం చేశారు.