‘ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తా’

కాంగ్రెస్, బిఆర్ ఎస్ లపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

Update: 2025-11-08 11:09 GMT
kishanreddy intresting comments

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆట మొదలైనప్పుడు తానేంటో చూపిస్తానని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. శనివారం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ ఎస్ నేతల కాళ్ల క్రింద ఉన్న భూమి కదలాలని అన్నారు. తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకున్నది కెసీఆర్ కాళ్ల క్రింద తెలంగాణ ఉండటానికి కాదన్నారు. బలిదానాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగాయన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్ పెత్తనం చేస్తోందన్నారు.


తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్, బిఆర్ ఎస్ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లో ఉందన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రెక్కాడితే డొక్కాడని ప్రజల కోసం బిజెపి పోరాడుతోందన్నారు. పేదల గూడు కూల్చితే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు.

వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటే ప్రజలు ఇపుడు బిజెపి పక్షాన నిలవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఘనమైన బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను బిఆర్ ఎస్ ప్రభుత్వం దివాలా తీయించిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రానుందని, దీనికి జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో  విజయం నాంది పలుకనుందని కిషన్ రెడ్డి అన్నారు.

ఆత్మీయ సమ్మేళనంలో షెకావత్

ఇద్దరు సభ్యులున్న బిజెపి ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. బిజెపి అంచెలంచెలుగా ఎదగడానికి ప్రవాస భారతీయుల పాత్ర ముదావహమని ఆయన అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచార నిమిత్తం షెకావత్ హైదరాబాద్ వచ్చారు. సోమాజీగూడలోని ఓ స్టార్ హోటళ్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో శుక్రవారం పోద్దుపోయాక ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీ గ్రామంలో బిజెపి జెండా ఎగరడంలో  ప్రవాసీల పాత్ర మరువరానిదని ఆయన అన్నారు.


ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఆవిర్బవించిందన్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని షెకావత్ అన్నారు. కుటుంబ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ఆయన విమర్శించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మరింత దిగజార్చిందన్నారు. జూబ్లిహిల్స్ లో బిజెపిని గెలిపించి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎంతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ బరిలో దించిందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని ప్రభుత్వాలను నడిపాయని షెకావత్ దుయ్యబట్టారు.


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ సమాజహితం కోసం ప్రజలు బిజెపిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News