‘సైబర్ నేరాలపై అందరికీ అవగాహన అవసరం..’

సైబర్ నేరాల నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న డీజీపీ శివధర్ రెడ్డి.

Update: 2025-11-09 11:03 GMT
Cyber Awareness IN Hyderabad

హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్‌ నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు. సైబర్ అవగాహనా కార్యక్రమం మాదిరిగా కాకుండా, దీనిని ఒక ఉద్యమం తరహాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులు, గృహిణులు సైబర్ కేటుగాళ్లకు టార్గెట్ గా మారుతున్నారని ఆయన వివరించారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడూ మహిళలకు ఫోన్లు చేసి భయపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలు అత్యంత చైతన్యవంతంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. యువకులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, విఐపిలు ప్రతీ ఒక్కరూ కూడా ఈ అవగాహనా కార్యక్రమంలో భాగం కావాలని డిజిపి దిశా, నిర్దేశం చేశారు.

అవగాహనకు మౌత్ పబ్లిసిటీ ముఖ్యం

సైబర్ అవగాహన గూర్చి మౌత్ పబ్లిసిటీ చేస్తే ప్రయోజనాలు సాధ్యం అని డిజిపి అన్నారు. అలా చేస్తే పెద్ద మాస్ మూవ్‌మెంట్ అవుతుందని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లకు అత్యంత అడ్డంకి ప్రజల అవగాహనా లోపమేనన్నారు . హైదరాబాద్‌లో సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పటికీ, ఇంకా బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గడానికి ప్రధాన కారణం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడమేనని డిజిపి తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు పని చేస్తుందన్నారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు.

మోసాలు జరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. అందుకే ప్రజల్లో సైబర్ అవగాహన మరింత అవసరమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రచారాన్ని విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీలో ఇది ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో తెలంగాణ అంతటా సైబర్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

పదవీ బాధ్యతలు తీసుకున్న రోజే సైబర్ నేరాలపై దృష్టి

తెలంగాణ డిజిపిగా సెప్టెంబర్ లోబాధ్యతలు తీసుకున్న డిజిపి శివధర్ రెడ్డి తొలి విలేకరుల సమావేశంలోనే సైబర్ నేరాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి సైబర్ కేటుగాళ్లకు చిక్కుకుని డీప్ ఫేక్ బాధితుడిగా వార్తలలో కెక్కారు. ఇప్పటికే ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ, పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని. దీనిపై ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో సామాన్యులు భయపడాల్సిన అవసరంలేదు అని పోలీసులు తెలిపారు.

సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా, డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ నేరస్థులపై దృష్టి సారించాము అని అప్పట్లో సజ్జనార్ తెలిపారు.పిల్లలు ఐదు వేలు, పదివేల రూపాయలకు ఆశపడి సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు.

Tags:    

Similar News